Hijab Row Karnataka: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే లో జరుగుతాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందుకే ఆ రాష్ట్రం రచ్చ రచ్చగా మారుతున్నది. మొన్నటికి మొన్న హిజాబ్ గొడవలతో అట్టుడికింది. చాలా జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మంగళూరు నుంచి ఉడిపి దాకా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కొందరు విద్యార్థులు అయితే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసింది. మధ్యే మార్గంగా తీర్పు చెప్పి పరిస్థితులను చక్కదిద్దింది. ఇప్పుడు కర్ణాటకలో కొంతమేర ప్రశాంత వాతావరణం నెలకొంది.

Hijab Row Karnataka
నూపూర్ శర్మ వ్యాఖ్యలతో
ఆ మధ్య మహమ్మద్ ప్రవక్త మీద నుపూర్ శర్మ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొంతమంది విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇదే సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి.. తీరా హై కమాండ్ రంగంలోకి దిగడంతో కొంతమేర పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మొన్న మంగళూరు ప్రాంతంలో ప్రెజర్ కుక్కర్లో ఏర్పాటు చేసిన బాంబు పేలడంతో కలకలం చెలరేగింది.. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగడంతో దీని వెనుక ఉన్నది ఐసిస్ అని తేలింది. మే నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
కసబ్ తో పోల్చాడు
ఈ వివాదాలు ఇలా ఉండగానే.. కర్ణాటకలోని ఓ ముస్లిం విద్యార్థిని ముంబై పేలుళ్ల హంతకుడు కసబ్ తో ప్రొఫెసర్ పోల్చాడు. దీంతో ఇది వివాదాస్పదమైంది. మణిపాల్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రొఫెసర్ క్లాసులో నీ పేరు ఏంటి అని అడిగాడు. దానికి అతడు సమాధానం చెప్పగానే…ఓహో నువ్వూ కసబ్ లాంటి వాడివేగా అంటూ ఎగతాళి చేశాడు. దీంతో సదరు విద్యార్థి ప్రొఫెసర్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదం ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో ఆయన రంగంలోకి దిగాడు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. సదరు ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు విధించాడు. ప్రొఫెసర్ ఆ విద్యార్థికి క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిని ఇంతటితో ఆపకుండా మణిపాల్ యూనివర్సిటీ విచారణకు ఆదేశించింది.. సదరు విద్యార్థికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది.

Hijab Row Karnataka
సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
అయితే వివాదాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది మరింత వివాదాస్పదమై రాజకీయ రంగు పులుముకుంది.. దీన్ని చూసిన కొంతమంది ముస్లిం బాలికలు తీవ్రంగా స్పందించారు. మాకే కాదు ముస్లిం యువకులకు కూడా చదువుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు.. అయితే ఈ ఘటనతో బసవరాజ్ సర్కార్ మరోసారి ఇరకాటంలో పడింది.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అయితే ఈ వివాదం మరెంత రాజు కుంటుందోనని ఆ ప్రాంత మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.