MP Avinash Reddy : అవినాష్ తల్లి శ్రీలక్ష్మి హైదరాబాద్ తరలింపు..ఏం జరగనుంది?
దీంతో సీబీఐ కట్టడి పెరుగుతోందని భావిస్తున్నారు. మరోవైపు అవినాష్ తల్లి తాజా ఆరోగ్య పరిస్ధితి ఆధారంగా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకునే అవకాశముందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడింది. ఈ రోజు డిశ్చార్జి చేయనున్నట్టు విశ్వభారతి ఆస్పత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి. కొద్దిసేపటి కిందటే ఆమె డిశ్చార్జి ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వేదికగా హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి హైదరాబాద్ వస్తుండగా.. తల్లి ఆరోగ్యం బాగాలేదని లేఖ రాసి వెనుదిరిగారు. అక్కడ నుంచి అవినాష్ అరెస్టు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. వైసీపీ శ్రేణులు సైతం హల్ చల్ సృష్టించాయి. ఇప్పుడు శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడడంతో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్యార్జి అయ్యారు.
తన తల్లిఆరోగ్యం బాగాలేదని చెప్పి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు తరచూ గైర్హాజరవుతూ వచ్చారు. తల్లిని హైదరాబాద్, బెంగళూరు తరలించకుండా వ్యూహాత్మకంగా కర్నూలులో ఉంచడంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. అటు సీబీఐ హడావుడి చూస్తే దాదాపు అరెస్ట్ అన్న రేంజ్ లో పావులు కదిపింది. అటు కేంద్ర బలగాలు సైతం చుట్టుముట్టాయని ప్రచారం జరిగింది. వైసీపీ శ్రేణులు రక్షణ వలయంగా నిలబడి అవినాష్ ను రక్షణ కల్పించారని ఎల్లోమీడియా గగ్గోలు చేసింది. కానీ ఇవేవీ జరగలేదు.
శ్రీలక్ష్మి డిశ్చార్జి చేసిన విశ్వభారతి యాజమాన్యం మరోవార్త చెప్పింది. ఆమెకు మరింత మెరుగైన చికిత్స కోసమే మరో ఆస్పత్రికి తరలించాల్సి ఉందని ఈ ప్రకటనలోనే తెలిపింది. దీంతో అవినాష్ తల్లిని ఇవాళ హైదరాబాద్ కు తరలిస్తున్నారు.మరోవైపు తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు హాజరు కాని అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు సిద్ధమైంది. వాస్తవానికి నిన్న విచారణ జరగాల్సి ఉండగా.. ఆలస్యం కావడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు.
ఈ కేసులో సీబీఐ విచారణపై అనేక అనుమానాలున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇతోధికంగా సాయపడుతున్న వేళ అవినాష్ అరెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్పత్రి గోడలు దాటి అవినాష్ ను అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకో సీబీఐ అధికారులు వెనక్కి తగ్గారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మూడురోజుల పర్యటనకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో సీబీఐ కట్టడి పెరుగుతోందని భావిస్తున్నారు. మరోవైపు అవినాష్ తల్లి తాజా ఆరోగ్య పరిస్ధితి ఆధారంగా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకునే అవకాశముందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.