Hyderabad city : టీచరుగా హైదరాబాద్ నగరానికి వచ్చి.. అమాయకులను ఉచ్చులోకి లాగి
మహమ్మద్ సలీం గా మారిన సౌరబ్ రాజ్ విద్య 2018లో తన భార్యతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. తొలుత ఇతడు తన భార్యతో కలిసి సైదాబాదులో నివసించేవాడు. అక్కడ ఒక పాఠశాలలో భార్యాభర్తలు టీచర్లుగా పనిచేసేవారు

Hyderabad city : కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో మళ్లీ ఉగ్ర జాడలు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు గత కొంతకాలంగా హైదరాబాదులో నిర్వహిస్తున్న తనిఖీలు, విచారణ ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాదులో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన ఫార్మాసుటికల్ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ మహమ్మద్ సలీం టెర్రర్ మాడ్యూల్ లో కీలకమైన వ్యక్తిగా నిలిచాడు. అతడు మిగిలిన వారిని ఉగ్ర ఉచ్చులోకి లాగాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో 11 మందితో పాటు నగరంలో అరెస్ట్ అయిన ఐదుగురిని ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలు దిగ్బ్రాంతి కలుగజేస్తున్నాయి.
భార్యతో కలిసి..
మహమ్మద్ సలీం గా మారిన సౌరబ్ రాజ్ విద్య 2018లో తన భార్యతో కలిసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. తొలుత ఇతడు తన భార్యతో కలిసి సైదాబాదులో నివసించేవాడు. అక్కడ ఒక పాఠశాలలో భార్యాభర్తలు టీచర్లుగా పనిచేసేవారు. అయితే ఉగ్రవాద మాడ్యూల్ అమలు చేసేందుకే ఇతడు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.. అబ్బాస్ అనే వ్యక్తి కోసం ఆటో ఖరీదు చేసి సైదాబాద్ నుంచి సలీం తరచూ మలక్పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. ఇతడికి అక్కడే హఫీజ్ బాబా నగర్ కు చెందిన మహమ్మద్ అబ్బాస్ ఆలీతో పరిచయం అయింది. అలా ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. పేద కుటుంబానికి చెందిన అబ్బాస్ ను తన దారిలోకి తెచ్చుకునేందుకు సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో కొనుగోలు చేశాడు. తక్కువ ధరకు అతడికి అద్దెకు ఇచ్చాడు. ఇలా తన మీద ఆధారపడిన అబ్బాస్ ను సలీం సైదాబాద్ లో తాను ఉంటున్న ఇంటికి తరచూ తీసుకెళ్లేవాడు. రెచ్చగొట్టే వీడియోలు చూపించేవాడు. ఈ క్రమంలో సలీం తో పనిచేసేందుకు అబ్బాస్ అంగీకరించాడు.
రెహమాన్ ఇలా పరిచయం
ఇక హైదరాబాదులోని మల్టీ నేషనల్ కంపెనీలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అబ్దుల్ రెహమాన్ తో పాటు ఇతని భార్య కూడా మతం మార్చుకుంది. రెహమాన్ ది ఒడిశా రాష్ట్రం. అతడి భార్యది మధ్యప్రదేశ్. ఈమెకు, సలీం భార్యకు భోపాల్ నుంచే పరిచయం ఉంది. రెహమాన్ తన భార్య ద్వారా సలీం భార్యకు.. ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహమాన్ మెల్లగా అతడి ఉచ్చులోపడ్డాడు.
గోల్కొండ లోని ఒక ప్రార్ధన స్థానంలో సలీంకు డెంటిస్ట్ షేక్ జునైద్ తో పాటు దినసరి కూలీ మహమ్మద్ హమీద్ తో పరిచయం ఏర్పడింది. వీరిని తన దారిలోకి తెచ్చుకున్న సాలెం మరికొందరిని కూడా తన మాడ్యూల్ లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్ కు చెప్పగా.. అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్ నగర్ కు చెందిన మహమ్మద్ సల్మాన్ ను పరిచయం చేశాడు. అయితే ఈ సల్మాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇక ఈ మాడ్యూల్ కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచి కూడా ఆర్థిక సహాయం అందలేదని యాంటీ టెర్రర్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు మొత్తం సలీం, రెహమాన్, జునైద్ భరించారు. గత ఏడాది కాలంలో సలీం ఏకంగా నాలుగు ఇళ్ళు మారాడు. సైదాబాద్ నుంచి అక్బర్ బాగ్, అక్కడి నుంచి సీతాఫల్ మండి, ఆ తర్వాత గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహమాన్, జునైద్ కూడా ఇతడి ప్రోద్బలం తోనే అక్కడ ఇళ్ళు తీసుకున్నారని తెలుస్తోంది. సలీం తన మాడ్యూల్ అమలు చేసేందుకు ఎంజే మార్కెట్ సమీపంలోని ఓ దుకాణం నుంచి మూడు ఎయిర్ గన్స్, పిల్లెట్స్ కొన్నాడు. అయితే వీటిలో రెండు మాత్రమే రికవరీ అయ్యాయి. మరొక దాని ఆచూకీ లభించలేదు.. అయితే ఈ మాడ్యూల్ లో సలీం మాత్రమే ఉన్నాడా? లేక ఇంకెవరైనా ఉన్నారా అనేదానిపై మధ్యప్రదేశ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
