Janasena: శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గం జనసేనకు ఫిక్స్ అయ్యిందా? పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారా? అందుకే అక్కడ పార్టీ గురించి టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదా? అక్కడ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కలవరపాటుకు అదే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైందన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని చెబుతూ వస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పొత్తులు ఉంటాయని సంకేతాలిచ్చారు. అదే సమయంలో పొత్తుల రూపంలో గౌరవం దక్కితేనే అన్న షరతు విధించారు. దీంతో టీడీపీ హైకమాండ్ జాగ్రత్త పడింది. ఎట్టి పరిస్థితుల్లో జనసేనతో పొత్తు ఉంటేనే జగన్ సర్కారును గద్దె దించగలమని అంతిమ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు జనసేనకు కేటాయించే సీట్లపై దృష్టిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Janasena
అయితే కేవలం మూడు, నాలుగు జిల్లాల్లో మాత్రమే జనసేన బలంగా ఉన్నట్టు చూపే ప్రయత్నం టీడీపీ అండ్ ఎల్లో మీడియా చేస్తూ వస్తోంది. కానీ పవన్ దాదాపు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జనసేనకు ప్రాతినిధ్యం దక్కాలని పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని జిల్లాలో సీట్ల కేటాయింపు ఉంటేనే పొత్తు కొనసాగుతుందని చంద్రబాబుకు స్పష్టమైన సంకేతాలు పంపారు. అందుకే చంద్రబాబు సామాజికవర్గాల బలాలను అంచనా వేసుకొని జనసేనకు సీట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవకూడదని భావిస్తున్నారు. అందుకే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని రిజర్వ్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సీటు జనసేనకే కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పుకాపులు అధికంగా ఉన్నారు. కానీ ఆ సామాజికవర్గం వారు ప్రాతినిధ్యం వహిస్తున్నది రెండే నియోజకవర్గాలు. అందులో ఒకటి పాతపట్నం, మరొకటి ఎచ్చెర్ల. పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో తూర్పుకాపులు అధికంగా ఉన్నా.. ఆ రెండు రిజర్వ్ నియోజకవర్గాలు. పాలకొండ ఎస్టీలకు, రాజాం ఎస్సీలకు కేటాయించారు. ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ మంత్రి కళా వెంకటరావు ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అయితే పాతపట్నం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలన్న ఆలోచనలో టీడీపీ హైకమాండ్ ఉంది. ఇక్కడ టీడీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. అభ్యర్థిత్వం ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కలమట వెంకటరమణమూర్తితో పాటు మామిడి గోవిందరావు, సిరిపురం తేజేశ్వరరావు వంటి ఆర్థిక, అంగబలం ఉన్నవారు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరంతా తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన వారే. వీరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మిగతా వర్గాలు సహకరించని దుస్థితి. అందుకే ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని చంద్రబాబు ఫిక్సయ్యారుట.

Janasena
2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కలమట వెంకటరమణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి టీడీపీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మూడు వర్గాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దీనికి చెక్ చెప్పేందుకు హైకమాండ్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అటు జనసేన సైతం తూర్పుకాపులు బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకునేపనిలో పడింది. పాతపట్నం అయితే విజయం తథ్యమని భావిస్తోంది. ఇక్కడ జనసేన యాక్టివ్ గా ఉండడమేకాకుండా పవన్ అభిమానులు ఎక్కువ. అన్ని జిల్లాలో జనసేనకు ప్రాతినిధ్యం ఉండాలని పవన్ భావిస్తున్న తరుణంలో చంద్రబాబు కూడా పాతపట్నం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని మానసికంగా సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.