WhatsApp Scam: ‘సాఫ్ట్’గా సైబర్ వలలో.. రూ.42 లక్షలు పోగొట్టుకున్న మరో టెకీ!
తర్వాత.. మూడు వీడియోలు లైక్ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150 జమ అయింది. మరో ఆరు వీడియోలను లైక్ చేస్తే.. రూ. 300 ఖాతాలో వేశారు.

Whatsapp Scam: ఇటీవల స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వాట్సప్‌లో పెద్ద సమస్యగా మారాయి. ఎంతోమంది మోసాల బారిన పడుతున్నారు. డబ్బులూ పోగొట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్‌కు వచ్చే మెస్సేజ్‌లకు రెస్పాండ్ అయి రూ.19 లక్షలు పోగొట్టుకుంది. తాజాగా గురుగ్రామ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా మోసగాళ్ల వలలో చిక్కి రూ.42 లక్షలు పోగొట్టు కోవకున్నాడు. చదువు రానివారు, మారుమూల గ్రామాల వారు సైబర్ వలలో చిక్కితే వారికి తెలయక అలా జరిగింది అనుకుంటాం. కానీ, టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇలా సైబర్ వలలో చిక్కడం ఆశ్చర్యం కలుగుతోంది.
సమస్యగా మారిన స్పామ్ కాల్స్, మెసేజ్‌లు..
ఇటీవల స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వాట్సప్‌లో పెద్ద సమస్యగా మారాయి. ఎంతోమంది మోసాల బారిన పడుతున్నారు. డబ్బులూ పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య గురుగ్రామ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా అతడిని సంప్రదించి, పార్ట్–టైమ్ ఉద్యోగం ఇస్తామని ఆశ పెట్టారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో చేరాలని సూచించారు. టెక్నాలజీ గురించి బాగా తెలిసి ఉన్నప్పటికీ ఆ ఇంజినీరు నేరగాళ్ల మాయలో పడి డబ్బులు కోల్పోవటం గమనార్హం.
రెండు రోజల క్రితం ఓ యువతి కూడా..
విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మొబైల్‌కు ఓరోజు మెసేజ్ వచ్చింది. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చని.. వివరాలకు సంప్రదించండి అని ఫోన్ నంబరు అందులో ఉంది. ఆ నంబరుకు ఫో¯Œ చేయగా.. యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పాటు ఇది కూడా చేస్తే పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని ఆమె ఆశపడింది. అన్నింటికీ అంగీకరించి, తన బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చింది.
నమ్మించి.. నగదు జమ చేసి..
తర్వాత.. మూడు వీడియోలు లైక్ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150 జమ అయింది. మరో ఆరు వీడియోలను లైక్ చేస్తే.. రూ. 300 ఖాతాలో వేశారు. దీంతో ఆమెకు నమ్మకం కుదిరేలా చేశారు. ప్రీపెయిడ్ టాస్కులు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. పెట్టుబడి అని… దానికి లాభం వస్తుందని చెప్పడంతో ఆమె సరేనన్నారు. అలా తొలుత.. రూ.వెయ్యి చెల్లిస్తే తిరిగి రూ.1,600 ఆమెకు వచ్చాయి. ఇలా ఆమె విడతల వారీగా రూ.19 లక్షలు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది.
ఇవీ జాగ్రత్తలు..
ఇలాంటి సమస్యలను పరిష్కరించటానికి వాట్సప్ ప్రయత్నిస్తోంది. అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.
– రెండంచెల (టూ స్టెప్) ధ్రువీకరణను యాక్టివేట్ చేసుకోవాలి. ఇది వాట్సప్ ఖాతా సురక్షితంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఖాతా రీసెటింగ్, వెరిఫై చేస్తున్నప్పుడు ఆరు అంకెల పిన్ నంబరును అడుగుతుంది. ఇతరులు మన ఖాతాలోకి చొరబడకుండా కాపాడుతుంది.
– తెలియనివారి నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుచిత సమాచారాన్ని కోరినా, విచిత్రమైన అభ్యర్థనలు చేసినా అనుమానించాలి. ఇలాంటి మెసేజ్‌లకు స్పందించొద్దు. నేరుగా ఆ వ్యక్తులకు లేదా సంస్థలకు ఫోన్ చేసి ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ వారికి ఇవ్వద్దు. డబ్బులు పంపొద్దు.
– అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు జవాబు ఇవ్వద్దు. ఇలాంటి కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేయాలి. అనుమానిత ఖాతాల గురించి రిపోర్టు చేయాలి.
– అనుమానిత గ్రూప్ చాట్‌లో ఉన్నట్టు అనిపిస్తే వెంటనే దానిలోంచి బయటకు వచ్చేయాలి. దాని మీద ఫిర్యాదు(రిపోర్టు) చేయాలి.
– ప్రొఫైల్ ఫొటో, ఆన్‌లైన్ స్టేటస్ వంటి వివరాలను ఎవరెవరు చూడొచ్చనేది మనమే నిర్ణయించుకోవచ్చు. సెటింగ్స్‌లోని ప్రైవసీ విభాగం ద్వారా దీన్ని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ స్టేటస్‌ను చూసేవారిని పరిమితం చేసుకుంటే భద్రతా పెరుగుతుంది. నమ్మకమైన కాంటాక్టులతోనే వ్యక్తిగత వివరాలను పంచుకోవాలి.
– వాట్సప్ ఖాతాకు అనుసంధానమైన పరికరాలను తరచూ సమీక్షించుకోవటం మంచిది. ఏదైనా తెలియని పరికరం కనిపిస్తే వెంటనే దాన్నుంచి లాగ్ అవుట్ కావాలి.
– అనుమానిత టెక్స్›్ట, అభ్యర్థనలు అందినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అవి నిజమో, కాదో తెలుసుకోవాలి. ధ్రువీకృతం కానీ లింక్‌లను క్లిక్ చేయొద్దు. చిరునామా, ఫోన్ నంబరు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు.