
Gujarat Conman Kiran Patel
Gujarat Conman Kiran Patel: చాలా సందర్భాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకే మేమున్నామని, నిందితులు ఎలాంటివారైనా, ఏ రూపంలో ఉన్నా శిక్షిస్తామని పోలీసులు అంటూ ఉంటారు.. కానీ కొందరు తెలివైన దొంగలు దీనిని తప్పని నిరూపిస్తుంటారు.. ఇది పలుసార్లు వాస్తవంలోకి కూడా వచ్చింది.. ఇది ఇప్పుడు దేశంలోని అత్యంత సున్నిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో అక్కడి పోలీసులకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. వచ్చిన వ్యక్తిని చూసి, అతడు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా పోలీసులు మోసపోయారు. అది కూడా రెండుసార్లు.. జరిగిందంతా తెలుసుకునే లోపు.. అప్పటికే నష్టం వాటిల్లింది.
సాధారణంగా మన సమాజంలో ఎవరికైనా నష్టం వాటిల్లితే, మోసానికి గురైతే పోలీసులను ఆశ్రయిస్తారు.. వారికి ఫిర్యాదు చేస్తారు. కానీ అలాంటి పోలీసులే మోసపోతే.. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్లో జరిగింది.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన కిరణ్ భాయ్ పటేల్ ఏకంగా రెండుసార్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులను మోసం చేశాడు. పచ్చిగా చెప్పాలంటే బకరాలను చేశాడు. ఇతగాడు ఫిబ్రవరి నెలలో ఒకసారి, మార్చి నెలలో ఒకసారి జమ్మూ కాశ్మీర్ ను సందర్శించాడు. మామూలుగా సందర్శిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇతడు దానికి ఎంచుకున్న విధానమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయిపోయింది. దేశ ప్రధాని కార్యాలయంలో వ్యూహాలు, ప్రచారాల విభాగంలో అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్నానని ఈయన చెప్పడంతో… జమ్మూ కాశ్మీర్ పోలీసులు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. బుల్లెట్ ప్రూఫ్ మహేంద్ర స్కార్పియో ఎస్ యూ వీ,5 స్టార్ హోటల్ లో వసతి కూడా సమకూర్చారు. ఆయన ఎక్కడికి వెళ్లినా భారీ బందోబస్తు కల్పించారు.
అంతేకాదు శ్రీనగర్ సందర్శించిన రెండుసార్లు కిరణ్ భాయ్ పటేల్ అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఇందుకు సంబంధించిన ఫోటోలను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాడు. కాశ్మీర్ లోని దూద్ పత్రి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడం, గుజరాత్ నుంచి పర్యాటకులను పెద్ద సంఖ్యలో అక్కడికి రప్పించడంపై సమావేశాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇతగాడి బండారం బయటపడటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఆ బండారం ఎక్కడ బయటపడుతుందోనని దాన్ని గోప్యంగా ఉంచారు. ఫిబ్రవరిలో కాశ్మీర్ వచ్చిన కిరణ్ రెండు వారాలు తిరగకుండానే మళ్లీ రావడంతో అక్కడి అధికారులకు అనుమానం కలిగింది. అతడు మోసగాడాని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

Gujarat Conman Kiran Patel
ఇక కిరణ్ భాయ్ పటేల్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను వేలాది మంది అనుసరిస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ వాఘెలా కూడా అతడి ఫాలోవర్స్ లో ఉన్నాడు. అమెరికాలోని కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ, తిరుచి ఐఐఎం నుంచి ఎంబీఏ చేశానని ట్విట్టర్ బయోలో కిరణ్ భాయ్ పటేల్ చెప్పుకున్నాడు. అంతేకాదు కాశ్మీర్ పర్యటనలో భాగంగా దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసేవాడు. అతగాడు ఎక్కడికి వెళ్లినా పారా మిలిటరీ గార్డ్స్ రక్షణగా నిలిచేవారు. మరోవైపు ఈ ఉదంతంతో జమ్ము కాశ్మీర్ పోలీసుల పైనా అంతర్గతంగా విచారణ కొనసాగుతోంది. మొత్తానికి కిరణ్ భాయ్ పటేల్ జమ్మూ కాశ్మీర్ పోలీసులను బకరాలను చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.