GT Vs MI Qualifier 2: గిల్ మిస్ అయ్యాడిలా.. ముంబై ఓటమికి, గుజరాత్ గెలుపునకు మధ్య జరిగింది ఇదే

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఓపెనర్లు వృధ్ధిమాన్ సాహా, సుబ్ మన్ గిల్ జట్టుకు సుభారంభాన్ని అందించారు. 6.2 ఓవర్లలోనే 54 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడే గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.

  • Written By: BS Naidu
  • Published On:
GT Vs MI Qualifier 2: గిల్ మిస్ అయ్యాడిలా.. ముంబై ఓటమికి, గుజరాత్ గెలుపునకు మధ్య జరిగింది ఇదే

GT Vs MI Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 62 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ కు కొరకరాని కొయ్యిగా మారిన సుబ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లోను 129 పరుగులతో చెలరేగి గుజరాత్ టైటాన్స్ కు అద్భుత విజయం అందించాడు. అయితే, గిల్ ఈ మ్యాచ్ లో 50 పరుగుల లోపు మూడుసార్లు అవుట్ అయ్యే అవకాశం లభించినా ముంబై సద్వినియోగం చేసుకోలేక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.

రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్ పై టైటాన్స్ జట్టు భారీ పరుగులు తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. గిల్ అద్భుతమైన ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు 10 వికెట్లను కోల్పోయి ఆల్ అవుట్ అయింది. అయితే, ముంబై జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ఆ జట్టు ఆటగాళ్లు చేసిన తప్పిదాలే కారణంగా కనిపిస్తున్నాయి. గిల్ మూడుసార్లు అవుట్ అయ్యే అవకాశం లభించినప్పటికీ అందిపుచ్చుకోలేకపోవడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.

50 పరుగులోపు మూడుసార్లు అవుట్ అయ్యే అవకాశం..

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఓపెనర్లు వృధ్ధిమాన్ సాహా, సుబ్ మన్ గిల్ జట్టుకు సుభారంభాన్ని అందించారు. 6.2 ఓవర్లలోనే 54 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడే గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి గుజరాత్ జట్టు భారీ పరుగులు చేసేందుకు కారణమైన గిల్ మూడుసార్లు ఇచ్చిన అవకాశాలను ముంబై జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. 2.1 ఓవర్ వద్ద గిల్ 9 పరుగుల వద్ద ఉండగా స్టంప్ అవుట్ అయ్యే అవకాశం వచ్చింది. బెహ్రండాఫ్ వేసిన బంతిని ముందుకు వెళ్లి ఆడే ప్రయత్నం చేయగా బంతి మిస్ అయి కీపర్ ఇషాన్ కిషన్ చేతిలోకి వెళ్ళింది. అయితే, బంతిని అందుకొని స్టంప్ అవుట్ చేయడంలో విఫలం అయ్యాడు కిషన్. దీంతో తొలిసారి గిల్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మళ్లీ 30 పరుగుల వద్ద జోర్డాన్ వేసిన ఆరో ఓవర్ లో మరో రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు గిల్. తొలుత జోర్డాన్ వేసిన బంతిని గాల్లోకి కొట్టాడు గిల్. ఈ బంతిని అందుకునేందుకు టీమ్ డేవిడ్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. కొద్ది దూరంలో బంతి పడిపోవడంతో గిల్ మరోసారి అవుట్ కాకుండా బయటపడ్డాడు. ఇదే ఓవర్ లో మరుసటి బంతికి గిల్ బ్యాటుకు బంతి తాకి కీపర్ వైపు వెళ్ళింది. ఇన్ సైడ్ ఎడ్జ్ కావడంతో కీపర్ కు కాస్త దూరంగా బంతి వెళ్ళింది. అయితే, ఈ బంతిని అందుకోవడంలో ఇషాన్ కిషన్ మరొకసారి విఫలం కావడంతో మళ్లీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు గిల్.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయిన గిల్..

మూడుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడ అవకాశం ఇవ్వకుండా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 129 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించి పెట్టాడు. ఈ క్రమంలోనే 215 స్ట్రైక్ రేట్ తో పరుగులను సాధించాడు. ఇందులో పది సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. బౌలర్ ఎవరైనా గిల్ బాదుడుకు బలి కావాల్సి వచ్చింది. ఫోర్లు, సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అర్థ సెంచరీ చేసేంతవరకు కాస్త నెమ్మదిగా ఆడిన గిల్.. ఆ తర్వాత నుంచి చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు.

62 పరుగులు భారీ తేడాతో ఓటమి..

ముంబై ఇండియన్స్ జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో 62 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సాహా 16 బంతుల్లో 18 పరుగులు, గిల్ 60 బంతుల్లో 129 పరుగులు, సాయి సుదర్శన్ 31 బంతుల్లో 43 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 28 పరుగులు, రషీద్ ఖాన్ రెండు బంతుల్లో ఐదు పరుగులు చేయడంతో 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 233 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 171 పరుగులకే 20 ఓవర్లలో కుప్పకూలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఏడు బంతుల్లో 8 పరుగులు, నేహాల్ వధిర 3 బంతుల్లో నాలుగు పరుగులు, కామెరాన్ గ్రీన్ 20 బంతుల్లో 30 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 38 బంతుల్లో 61 పరుగులు, తిలక్ వర్మ 14 బంతుల్లో 43 పరుగులు, విష్ణు వినోద్ ఏడు బంతుల్లో 5 పరుగులు, టిమ్ డేవిడ్ మూడు బంతుల్లో రెండు, క్రిష్ జోర్డాన్ 5 బంతుల్లో రెండు పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ స్కోర్ చేయలేక చేతులెత్తేయడంతో ముంబై ఇండియన్స్ జట్టు భారీ పరుగులు తేడాతో ఓటమిపాలైంది.

సంబంధిత వార్తలు