
Unemployed Suicides
Unemployed Suicides: నిరుద్యోగ తెలంగాణ.. విద్యావంతులను, ప్రతిభావంతులును, యువతను చంపేస్తోంది. స్వరాష్ట్రం సిద్ధిస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని కేసులకు భయపడకుండా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలకు తెగించి కొట్లాడింది యువత. సకల జనుల పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. కానీ, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరలేదు. పాలకుల నిర్లక్ష్యం.. ఉద్యోగాల భర్తీలో ఏడాదికో మాట మార్చడం.. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పడం, అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం.. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్నపత్రాలు లీక్ కావడాన్ని నిరుద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. నోటిఫికేషన్లు రాలేదని ఇన్నాళ్లు పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వచ్చిన నోటిఫికేషన్ల పేపర్లు లీక్ కావడంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి, కుటుంబాలను వదిలి ఐదారు నెలలుగా కష్టపడుతున్న నిరుద్యోగులకు భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. భరోసా నింపాల్సిన పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో మనోధైర్యం కోల్పోతున్న కొంతమంది చావే శరణ్యమనుకుంటున్నారు.
సిరిసిల్లలో నిరుద్యోగి బలవన్మరణం..
ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే ఆవేదనతో ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్లలో ప్రశాంత్ అనే నిరుద్యోగి గ్రామ శివారులో తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండుసార్లు కానిస్టేబుల్‌కు, ఆర్మీ ఉద్యోగాలకు ప్రయత్నించినా.. ఉద్యోగం రాలేదు. దీంతో తరచూ ఆవేదన చెందే వాడని బంధువులు తెలిపారు.
అటకెక్కిన ఇంటికో ఉద్యోగం హామీ..
తెలంగాణ ఉద్యమ సమయంలో, స్వరాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి ఉద్యమనేతగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్నాడు. ఎన్నికల సమయంతో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. కానీ, నాలుగున్నరేళ్లు పోలీస్ నోటిఫికేషన్లు మినహా ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఇంటికో ఉద్యోగం హామీని అటకెక్కించారు.

Unemployed Suicides
నిరుద్యోగ భృతితో ఎర..
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్, తనకు మళ్లీ అవకాశం ఇస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని, అలా ఇవ్వకుంటే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో కేసీఆర్‌ను నమ్మిన నిరుద్యోగులు మళ్లీ అధికారం కట్టబెట్టారు. మళ్లీ సీఎం కుర్చీ ఎన్నిక కేసీఆర్ మొదటి సారిలాగానే నోటిషికేషన్ల విడుదల, నిరుద్యోగ భృతి హామీని అటకెక్యించారు. దీంతో నాలుగేళ్లుగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో కుటుంబాలకు, తల్లిదండ్రులకు కన్నీరే మిగిలచ్చారు.
ఎట్టకేలకు నోటిఫికేషన్లు..
వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల చేతుల్లో చావుదెబ్బ తప్పదని గ్రహించిన కేసీఆర్ ఎన్నికలకు ఏడాది ముందు నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రారంభించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పోలీస్, ఎస్సై, ఫైర్, తదితర ఉద్యోగాల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపట్టారు. వేల రూపాయలు ఖర్చుచేసి శిక్షణ తీసుకుంటున్నారు. సీరియస్‌గా ప్రిపరేషన్‌లో ఉన్నారు.
లీకేజీ కలకలం..
అంతా ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రిపరేషన్‌లో ఉంటే.. టీఎస్‌పీఎస్సీలో మాత్రం ప్రశ్నపత్రాలు లీక్ కావడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. స్వార్థం కోసం కొంతమంది ప్రశ్నపత్రాలు లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశామని, ప్రజలు కడుపునిండా తింటున్నారని, కంటినిండా నిద్ర పోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బంగారు తెలంగాణ ఎలా అయిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచకుంటే ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.