
PM Mitra
PM Mitra: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో సంస్థలను రాకుండా చేస్తుందని, రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుందని పదేపదే బీఆర్‌ఎస్ వర్గాలు, మంత్రులు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మేము సముచిత స్థానం ఇస్తున్నామని బీజేపీ కూడా తన వంతుగా చెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
టెక్స్‌టైల్ రంగానికి ఊతం..
తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5ఎఫ్ దృష్టితో అంటే(ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారిన్) దృష్టి్టతో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్ టైల్ పార్కులను నెలకొల్పనున్నట్టు, అందులో తెలంగాణ రాష్ట్రానికి ఒకటి కేటాయించినట్టు మోదీ శుక్రవారం ట్వీట్ ద్వారా తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

PM Mitra
లక్షల మందికి ఉపాధి..
తెలంగాణ రాష్ట్రంతోపాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో కూడా ఈ మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ మాటలకే కానీ, అనుకున్న లక్ష్యాలను ఇంకా సాధించలేకపోతుంది.

PM Mitra
‘కాకతీయ’నే మెగా పార్క్‌గా..
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించాలని కేంద్రానికి అనేకమార్లు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ప్రస్తుతం మెగా టెక్స్ టైల్ పార్క్‌ను తెలంగాణకు మంజూరు చేయడంతో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌నే తాజాగా కేంద్రం ప్రకటించిన టెక్స్ టైల్ పార్క్‌గా మార్చి నిధులు తీసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. మరి ఈ అవకాశాన్ని రాష్ట్రం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి.