CM KCR : కేసీఆర్‌కు మళ్లీ మంచి రోజులు.. ఇక తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు!
కాగల కార్యం గందర్వులు తీర్చిన చందంగా బీజేపీని రేసు నుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్న కేసీఆర్‌కు టీడీపీ రూపంలో ఉపశమనం లభించింది. దీంతో ఈసారి ఓటమి తప్పదా అన్న సందిగ్ధంగో ఉన్న కేసీఆర్ నెత్తిన చంద్రబాబు పాలుపోశారన్న చర్చ మొదలైంది.

CM KCR : తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఐదు నెలలే గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను ఈసారి ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో కనుమరుగైన టీడీపీ నేనున్నానంటూ తెరపైకి వస్తోంది. చంద్రబాబు తన స్వార్థం కోసం.. ఏపీలో వైఎస్.జగన్‌ను ఎదుర్కొనడం కోసం తెలంగాణలో బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, అమిత్‌షా భేటీ తాజాగా చర్చనీయాంశమైంది.
ఇన్నాళ్లూ దూరంపెట్టి..
2018 నుంచి టీడీపీ, బీజేపీ మధ్య చెడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టింది. మరోవైపు రాష్ట్రంలోనూ అధికారం టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ తరుణంలో బాబు పరిస్థితి కుడితిలోపడ్డ ఎలకలా తయారైంది. బీజేపీతో మళ్లీ కలిసేందుకు బాబు అనేక ప్రయత్నాలు చేశారు. మరోవైపు ఏపీలో సీఎం జగన్ చంద్రబాబును చెడుగుడు ఆడుకుంటున్నాడు. అయినా బీజేపీ చంద్రబాబును దగ్గకు కూడా రానివ్వలేదు. ఈ తరుణంలో తాజాగా అమిత్‌షా అపాయింట్ మెంట్ ఇచ్చారు.
పొత్తుల చర్చలు..
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలన్న ఆలోచన పవన్, చంద్రబాబు చేస్తున్నారు. ఈతరుణంలో బాబుకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అమిత్‌షాతో ఏం మాట్లాడారన్నది ఎవరూ చెప్పడం లేదు. కానీ, భేటీలో చర్చంచిన అంశాలపై పుకార్లు శికార్లు చేస్తున్నాయి. తెలంగాణలో, ఏపీలో పొత్తుల గురించే బాబు అమిత్‌షాతో సమావేశమయ్యారని తెలుస్తోంది.
పొత్తులతో బీజేపీ చిత్తే..
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఒక దశలో అధికారంలోకి రావడం ఖాయం అన్నంతగా ప్రజల్లోకి వెళ్లింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త వెనక్కు తగ్గినా.. ఇంకా రేసులో మాత్రం ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా కర్ణాటక ఫలితాలతో జోష్‌మీద ఉంది. ఇలాంటి తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్‌షాను కలవడం, పొత్తలపై చర్చించడం తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూసే కేసీఆర్ విజయం సాధించారు. ఆంధ్రాబాబు మనకు అవసరమా అని పిలుపునివ్వడంతో కాంగ్రెస్–టీడీపీ కూటమికి ఓట్లు పడలేదు. తాజాగా బీజేపీ–టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2018 నాటి పరిస్థితే పునరావృతం అవుతుందన్న చర్చ జరుగుతోంది.
కాగల కార్యం గందర్వులు తీర్చినట్లు..
కాగల కార్యం గందర్వులు తీర్చిన చందంగా బీజేపీని రేసు నుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్న కేసీఆర్‌కు టీడీపీ రూపంలో ఉపశమనం లభించింది. దీంతో ఈసారి ఓటమి తప్పదా అన్న సందిగ్ధంగో ఉన్న కేసీఆర్ నెత్తిన చంద్రబాబు పాలుపోశారన్న చర్చ మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగి, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ కలిపి పనిచేస్తే అది తెలంగాణ బీజేపీకి తీవ్ర నష్టం చేయడం ఖాయం ఇక కేసీఆర్ హాయిగా తడిగ్డు వేసుకుని కూర్చోవచ్చు.
