Manoharabad: బట్టలు ఉతికేందుకు వెళ్లి శవమయ్యారు.. కన్నీళ్లు పెట్టించేంత విషాదం ఇదీ..
మహిళలు చెరువు వద్ద బట్టలు ఉతుకుతుండగా చెరువులో ఆడుతున్న బాలుడు చరణ్ కాస్త లోతుకు వెళ్లి జారిపడ్డాడు.

Manoharabad: చిన్నపాటి నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలు తీసింది. ఆదివారం బోనాల జాతర జరుపుకున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సోమవారం బటు‍్టలు ఉతుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లారు. అదే చెరువులో శవమై తేలారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య ఇంటికి బోనాల జాతర కోసం అంబర్‌పేట నుంచి సమీప బంధువులు లక్ష్మీ(30), బాలమణి(30), బాలమణి కుమారుడు చరణ్(6) వచ్చారు. ఉదయం ఈ ముగ్గురితోపాటు చంద్రయ్య కూతురు లావణ్య(19) చెరువులో బట్టలు ఉతకడం కోసం వెళ్లారు.
బాలుడు జారి పడడంతో..
మహిళలు చెరువు వద్ద బట్టలు ఉతుకుతుండగా చెరువులో ఆడుతున్న బాలుడు చరణ్ కాస్త లోతుకు వెళ్లి జారిపడ్డాడు. దీంతో నీటమునుగుతున్న చరణ్‌ను గమనించిన మహిళలు బాలుడిని రక్షించడానికి ఒకరి వెనుక మరొకరు వెళ్లారు. ఎవరికీ ఈత రాకపోవడంతో అందరూ వరుసగా నీటమునిగారు.
దొరకని బాలుడి మృతదేహం..
అయితే ముగ్గురు మహిళల మృతికి కారణమైన బాలుడు చరణ్ మృతదేహం మాత్రం ఇంకా లభించలేదని తెలిసింది. పోలీసులు చెరువులో గాలిస్తున్నారు.
