Geo Thermal Power: వేడినీరు, నీటి ఆవిరి.. గోదావరిలో లోయలో తర”గని” విద్యుత్!
భూమి అంతర్గత పొరల్లో కొన్ని లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుందన్న విషయం తెలుసుకదా.. ఆ వేడిని ఉపయోగించి తయారు చేసే విద్యుత్‌నే జియోథర్మల్ విద్యుత్ అంటారు.

Geo Thermal Power: జియో థర్మల్ విద్యుత్.. ఇప్పటి వరకు మనకు అంతగా పరిచయం లేని పదం ఇది. భూమి అంతర్గత పొరల్లో ఉండే వేడినీరు, నీటి ఆవిరి ఆధారంగా తయారుచేసే విద్యుత్‌నే జియోథర్మల్ విద్యుత్ అంటారు. ఈ విద్యుదుత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు దేశవ్యాప్తంగా పదులసంఖ్యలో ఉండగా.. అందులో ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి లోయ ప్రాంతం కూడా ఒకటి. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జియోథర్మల్ విద్యుదుత్పత్తి మరింత లాభదాయకంగా ఉండే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అందులోభాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో బూర్గంపహాడ్, మణుగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆస్ట్రేలియా పరిశోధకులతోపాటు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ (నేషనల్ జియోఫిజికల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు పర్యటించి నమూనాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అసలు జియోథర్మల్ విద్యుత్ ఏంటి? దాని కథాకమామిషూ ఏమిటో ఒకసారి చూద్దామా..
భూమి అంతర్గత వేడిని ఉపయోగించి..
భూమి అంతర్గత పొరల్లో కొన్ని లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుందన్న విషయం తెలుసుకదా.. ఆ వేడిని ఉపయోగించి తయారు చేసే విద్యుత్‌నే జియోథర్మల్ విద్యుత్ అంటారు. భూమి అట్టడుగు పొరల్లో ఉండే విపరీతమైన వేడికి శిలలు కరిగిపోయి ద్రవస్థితిలోకి మారిపోతాయి. దీనినే శిలాద్రవం లేదా మాగ్మా అంటారు. భూమిలోపల కొన్ని మైళ్ల వరకు ఈ మాగ్మా పొర ఆవరించి ఉంటుంది. మాగ్మాకు పైభాగంలో ఉండే పొరల్లో సూక్ష్మ లోపాల ద్వారా ఈ వేడితోపాటు శిలాద్రవం ఉపరితల పొరలకు చేరుతుంటుంది. లోపాలున్న ప్రాంతాల్లోనే భూగర్భ జలాశయాలు కూడా ఉంటే.. వేడికి ఆ నీరు విపరీతంగా వేడెక్కి నీటి ఆవిరిగానూ మారిపోతుంది. ఈ వేడి నీరు లేదా నీటి ఆవిరిని బోర్ల ద్వారా వెలుపలికి తీసుకువచ్చి వాటితో టర్బైన్‌లు తిప్పి విద్యుత్ తయారు చేస్తారు. ఈ విధానంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ వల్ల పర్యావరణ కాలుష్యం చాలా అత్యల్ప స్థాయిలో ఉంటుంది. పైగా.. వేడినీరు, నీటి ఆవిరి తప్ప మరే ఇంధనమూ అక్కర్లేదు.. అది కూడా తరిగిపోని ఇంధనం. మన దేశంలో దాదాపు 10,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సరిపడా వనరులున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇన్ని ఉపయోగాలున్నా.. జియోథర్మల్ విద్యుత్‌పై ఇంతవరకు దృష్టి సారించకపోవడానికి ప్రధానకారణం.. అవసరాలకు సరిపడినన్ని బొగ్గునిల్వలు అందుబాటులో ఉండడమే.
ఎలా తయారు చేస్తారు?
ముందుగా ప్రత్యేక పరీక్షల ద్వారా భూమి అంతర్గత పొరల్లో ఉన్న వేడినీటి జలాశయాలు లేదా నీటిఆవిరి ప్రాంతాలను గుర్తిస్తారు. వీటిని జియోథర్మల్ క్షేత్రాలు అంటారు. ఆ ప్రాంతాల్లో కిలోమీటరున్నర నుంచి రెండు కిలోమీటర్లలోతు బోర్లు వేస్తారు. జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో సింహభాగం ఈ బోర్ల తవ్వకానికే ఖర్చవుతుంది. నాలుగైదు బోర్లు వేస్తేకానీ.. అందులో ఒకటో, రెండో సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. ఒక్కసారి భూమి అంతర్గతపొరల్లో వేడినీటి ఆశయం దొరికిందంటే.. చాలు.. ఇక విద్యుదుత్పత్తే తరువాయి. బోర్లలో నుంచి వెలువడేది వేడినీరా? నీటి ఆవిరా? వాటి ఉష్ణోగ్రతలు ఏమిటి అన్న విషయాలను బట్టి టర్బైన్‌ల ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఫ్లాష్ స్టీం ప్లాంట్
భూగర్భ వేడినీటి జలాశయాల్లో నీరు విపరీతంగా వేడిగా ఉంటే.. ఆ నీరంతా నీటిఆవిరిగా మారుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో బోరు వేసినప్పుడు ఆ నీటి ఆవిరి విపరీతమైన ఒత్తిడితో భూ ఉపరితలానికి చేరుతుంది. నేరుగా.. టర్బైన్‌లను తిప్పగలిగే శక్తి ఈ నీటిఆవిరికి ఉంటుంది. ఒక్కసారి విద్యుదుత్పత్తికి వినియోగించిన నీటిఆవిరిని చల్లార్చి నీరుగా మార్చి మరో బోరు ద్వారా భూగర్భ వేడినీటి జలాశయానికి పంపిస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ రకం ప్లాంట్లనే ఎక్కువగా నిర్మిస్తున్నారు.
డ్రై స్టీం ప్లాంట్
భూగర్భం నుంచి కేవలం నీటి ఆవిరి మాత్రమే అందే పరిస్థితి ఉంటే.. ఈ రకం ప్లాంట్ నిర్మిస్తారు. భూగర్భం నుంచి వేడినీటి ఆవిరి అధిక ఒత్తిడితో ఉపరితలానికి చేరుకునేప్పుడు దాంతోపాటు.. కొన్ని రాళ్లూ వస్తాయి. వీటి వల్ల టర్భైన్‌లు దెబ్బతినకుండా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లుంటాయి.
బైనరీ ప్లాంట్
భూగర్భం నుంచి వేడినీరు మాత్రమే లభించే పరిస్థితుల్లో బైనరీ ప్లాంట్ నిర్మిస్తారు. భూగర్భం నుంచి వచ్చే వేడినీటిని ఉపయోగించి తక్కువ మరుగు ఉష్ణోగ్రత కలిగిన ఐసోబ్యుటేన్ వంటి ద్రవాలను వేడిచేస్తారు. తద్వారా వెలువడిన ఆవిరితో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. భూగర్భం నుంచి వేడినీటితోపాటు, నీటి ఆవిరీ లభిస్తే.. హైబ్రిడ్ ప్లాంట్ అవసరమవుతుంది. బైనరీ, డ్రైం స్టీం ప్లాంట్ల సమ్మిళితమే హైబ్రిడ్ ప్లాంట్.
మనదేశంలో జమ్మూకాశ్మీర్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలతోపాటు మన రాష్ట్రంలోని గోదావరి లోయప్రాంతంలో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులున్నాయి.
లాభనష్టాలు
జియోథర్మల్ ప్లాంట్లు ఏర్పాటు అనుకున్నంత తేలిక కాదు. ముందుగా.. నమ్మకమైన, విద్యుదుత్పత్తికి సరిపడా వనరులున్న జియోథర్మల్ క్షేత్రం గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ.. క్షేత్రం దొరికినా.. ప్లాంటు నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉండవు. ఎందుకంటే.. ఎక్కువ జియోథర్మల్ క్షేత్రాలు పర్వతాలపైనో, భారీ లోయల్లోనో ఉంటాయి. జియోథర్మల్ క్షేత్రం నుంచి నీటి ఆవిరి లేదా నీటిని కిలోమీటరున్నర కన్నా ఎక్కువ దూరం తరలించడం సాధ్యం కాదు. మంచి జియోథర్మల్ క్షేత్రం ఆధారంగా 2 నుంచి 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. నీటిఆవిరి లభ్యత మరీ ఎక్కువగా ఉంటే.. 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ.. ఒక్కసారి పెట్టుబడి చేతికి వచ్చిందంటే.. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర అంత చవక మరేదీ ఉండదు.
