TV9 Raviprakash: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆ మీడియా అధిపతిగా ఉన్నప్పుడు అస్సలు ‘తగ్గేదే లే’ అన్నట్టుగా ఆడింది ఆడాడు.. పాడింది పాడాడు. ఏకంగా తెలుగు రాజకీయాలనే తన చేతిలో ఉన్న అగ్రమీడియాతో శాసించాడు. అయితే అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. అందరు నేతలూ గమ్మున ఊకుండరు కదా… ఎన్నో ఏళ్లుగా రవిప్రకాష్ ను టచ్ చేయని రాజకీయ నేతలున్నారు. అంతలా బలంగా మారిన రవిప్రకాష్ తెలంగాణ వచ్చాక కూడా అంతే స్థాయిలో రెచ్చిపోయారన్న విమర్శ ఉంది. కేసీఆర్ సర్కారును ఆదిలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అప్పుడు అవమానించేలా కథనాలు ప్రసారం చేశాడు. అప్పుడు కేసీఆర్ ఆగ్రహానికి గురై తెలంగాణలో టీవీ9 నిషేధానికి కారణమైంది.
నిషేధం ముగిశాక కూడా టీవీ9 తీరు మారలేదు. తెలంగాణలో ఇంటర్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసి ఇన్నాళ్లు తెరవెనుక ఉండి నడిపించిన రవిప్రకాష్ బయటకొచ్చి మరీ స్వయంగా డిబేట్లు పెట్టడం కేసీఆర్ సర్కారుకు పుండుమీద కారం చల్లినట్టైంది. అందుకే లక్ష్యాన్ని గురిపెట్టిన కేసీఆర్ చివరకు విజయవంతంగా రవిప్రకాష్ ను టీవీ9 నుంచి పంపించేశాడని మీడియా సర్కిల్స్ లో ఒక విస్తృత ప్రచారమైతే ఉంది. కేసీఆర్ తో పెట్టుకునే రవిప్రకాష్ తన పదవి కోల్పోయారని అంటుంటారు. అది నిజమో కాదో కానీ తాజాగా మరోసారి టీవీ9 వ్యవహారంలో తలదూర్చి మరోసారి చేతులు కాల్చుకున్నాడు రవిప్రకాష్. ఈసారి అడ్డంగా బుక్కయ్యాడు.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్ తాజాగా ఈరోజు రూ.10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని.. సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటీషన్ దాఖలు చేశారు. దీంతో టీవీ9పై రవిప్రకాష్ కు ఉన్న చివరి ఆశ కూడా పోయింది. ఇక అందులోకి ఎంట్రీ ఇవ్వడం రవిప్రకాష్ కు సాధ్యం కాదని తేటతెల్లమైంది.
సుధీర్ఘ వాదనల అనంతరం ట్రైబ్యూనల్ టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చిచెప్పింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని పేర్కొంది. వాటాల విక్రయ ఒప్పందం రవిప్రకాష్ కు తెలిసే జరిగిందని.. అందులో కూడా రవిప్రకాష్ భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10లక్షలు చెల్లించాలని ట్రిబ్యూనల్ ఆదేశించింది.
టీవీ9లో దాదాపు 80 శాతం వాటాను శ్రీనిరాజు కలిగి ఉన్నారు. మైనార్టీ వాటా ఉన్న రవిప్రకాష్ ఆయనను ఇందులో ఇమడనీయకుండా.. అమ్ముకోకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. రవిప్రకాష్ చేతిలో మీడియా ఉండడంతో ఎవరూ ఆ మీడియాతో పెట్టుకోకూడదని.. టార్గెట్ కాకూడదని కొనలేదు. రవిప్రకాష్ ఒత్తిడితోనూ ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు.
కానీ కేసీఆర్ తో రవిప్రకాష్ పెట్టుకోవడంతోనే ఆయనకు మూడింది. టీవీ9ను కొనేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. కేసీఆర్ కు సన్నిహితులుగా ముద్రపడిన మేఘా సంస్థ కృష్ణారెడ్డి, మైంహో అధినేత జూపల్లి రామేశ్వరరావులు ముందుకొచ్చారు. శ్రీనిరాజు వీరికి తన వాటాను రూ.500 కోట్లకు అమ్మేశారు. అప్పటి నుంచి వివాదం ప్రారంభమై.. రవిప్రకాష్ అక్రమాలు బయటపడి ఆయనను తొలగించేదాకా వెళ్లింది.
20 శాతం వాటా ఉన్న వాటాదారులు, రవిప్రకాష్ కలిసి తమకు తెలియకుండా టీవీ9 అమ్మకం జరిగిందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ కు వెళ్లారు. హవాలా సొమ్ము ద్వారా జరిగిందని ఆరోపించారు. అయితే రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరిపామని టీవీ9 బోర్డు ఆధారాలు చూపించడంతో రవిప్రకాష్ కు లా బోర్డు షాకిచ్చింది. రవిప్రకాష్ చర్యలు అనైతికమని ఏకంగా 10 లక్షల ఫైన్ విధించింది.