JD Lakshminarayana: మంచి సమాజం కోసం పరితపించే వ్యక్తుల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒకరు. రాజకీయాలంటే అంటరానివి కాదని తరచూ చెబుతుంటారు. గత ఎన్నికల్లో తన భావజాలానికి దగ్గరగా ఉండడంతో జనసేన తరుపున విశాఖ లోక్ సభ స్థానానికి పోటీచేశారు. సరిగ్గా ఎన్నికలకు పక్షం రోజుల ముందు పార్టీలో చేరి రెండున్నర లక్షలకుపైగా ఓట్లను సొంతం చేసుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం చిన్నచిన్న కారణాలు చూపుతూ ఆయన జనసేనకు, పవన్ కు దూరమయ్యారు. అయినా స్వచ్ఛంద సేవల రూపంలో ప్రజల్లోనే తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనతో పాటు కుమార్తె సైతం విశాఖ నుంచి పోటీచేస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది.

JD Lakshminarayana
సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తాన హోదా జేడీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే లోక్ సభకు పోటీచేస్తారన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య అలయెన్స్ కుదిరితే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయాలన్నది ఆయన అభిమతంగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నుంచి దూరం కావడంతో.. ఇప్పుడు మరోసారి ఆ పార్టీలో చేరితే ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుందని ఆయన భావిస్తున్నారు. టీడీపీలోకి వెళదామంటే జగన్ కేసుల్లో కీలకంగా వ్యవహరించినందున విమర్శలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే బీజేపీయే కరెక్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అది కూడా జనసేన, టీడీపీతో కలిస్తేనే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయాలని.. లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

JD Lakshminarayana
మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె దండి ప్రియాంకారావు సైతం రాజకీయాల్లోకి వస్తారని విశాఖ నగరంలో ప్రచారం జరగుతోంది. ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. విశాఖలోనే విద్యాబ్యాసం, స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న ఆమె రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అటు తండ్రి లోక్ సభ, ఇటు కుమార్తె శాసనసభకు పోటీచేస్తే ఎలా ఉంటుందోనని అనుచరులు, అభిమానులు నగరంలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల్లో ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు అనుకూలమైన పార్టీ.. అదీ గెలుపుపై నమ్మకం కుదిరే పార్టీలో చేరాలని తండ్రీ కుమార్తెలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.