YS Viveka Case : వివేకా కేసులో ఫస్ట్ టైమ్ జగన్ ప్రస్తావన.. ఏం జరగబోతోంది?
తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే వివేకానందరెడ్డి హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి సీఎం జగన్ చెప్పారన్న ప్రచారం ఉంది. దీంతో సీబీఐ దానిపైనా దృష్టిపెట్టింది. ఆ నలుగురి వాంగ్మూలాన్ని సేకరించింది.

YS Viveka Case : వివేకా హత్య కేసులో కీలక ట్విస్ట్. తొలిసారి సీఎం జగన్ పేరును సీబీఐ ప్రస్తావించింది. ఇన్నాళ్లూ సీఎంను టార్గెట్ చేస్తూ విపక్షాలు హత్యకేసులో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఫస్ట్ టైమ్ సీబీఐ నేరుగా పేరు ప్రస్తావించడం సంచలనం కలిగిస్తోంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో సీఎం జగన్ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చింది. హత్య విషయం జగన్ కు ఉదయం 6.15 గంటల కంటే ముందే తెలిసినట్టు తమ దర్యాప్తులో తేలినట్టు సీబీఐ కౌంటర్ లో ప్రస్తావించింది. వివేకా హత్య గురయినట్టు ముందుగా చూసినట్టు చెబుతున్న పీఏ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసునని సీబీఐ స్పష్టం చేయడం సంచలనంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి నేరుగా జగన్ పేరు బయటకు రావడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఆది నుంచి రకరకాల ఆరోపణలు వస్తున్నా సీబీఐ అంతదూరం వెళుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే కొద్దిరోజుల కిందట ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ కొత్తపలుకు కాలమ్ లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2019 మార్చి 15 వేకువజామున మరో నలుగురితో కలిసి ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నారని.. ఆ సమయంలో అతడికి ఫోన్ వచ్చిందని.. బయటకు వెళ్లి మాట్లాడి వచ్చిన జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని కాలమ్ లో ప్రస్తావించారు. ఇప్పుడు దానికి దగ్గరగా ఉన్న విషయాన్ని సీబీఐ కౌంటర్ లో పేర్కొనడం విశేషం.
అయితే జగన్ కు అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా? అన్నదానిపై సీబీఐ స్పష్టతనివ్వలేదు. దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. శనివారం దీనిపై మరికొంత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సీబీఐ తన వాదనలు వినిపించే చాన్స్ దక్కలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సమయం గడిచిపోయింది. శనివారం ఉదయం సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కేసు నీరుగారుతోందని విపక్షాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏకంగా సీఎం జగన్ పేరు రావడం కీలకాంశమే.
తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే వివేకానందరెడ్డి హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి సీఎం జగన్ చెప్పారన్న ప్రచారం ఉంది. దీంతో సీబీఐ దానిపైనా దృష్టిపెట్టింది. ఆ నలుగురి వాంగ్మూలాన్ని సేకరించింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు.తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు. జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడాలని సీబీఐ గుర్తించి వారిని పిలిచి ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం కీలక మలుపులు తిరగబోతున్నట్లుగా చెబుతున్నారు. సరిగ్గా జగన్ ఢిల్లీలో ఉండగా ఆయన పేరు బయటకు రావడం విశేషం.