
Buggana Rajendranath Reddy
Buggana Rajendranath Reddy: మా ప్రభుత్వం వస్తే మద్యపాన నిషేధం చేస్తాం అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చి పడేశారు. మద్యపాన నిషేధం సంగతి గురించి అధికార పార్టీ నాయకులు అడిగితే ఈ మధ్యకాలంలో చిత్ర విచిత్రమైన లాజిక్కులు చెబుతున్నారు. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతాయుతమైన మద్యపానం అమలు చేస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర విస్మయ పరుస్తున్నాయి.
18 వేల కోట్లకు పైగా ఆదాయం..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18 వేల కోట్లకు పైగా మద్యం నుంచి ఆదాయం వస్తుందని బడ్జెట్లో చెప్పారు. ప్రజల నుంచి ఇంత పెద్ద మొత్తం ఎలా పిండుకుంటారని ప్రశ్నిస్తే.. రేట్లు పెంచి తాగే వారిని తగ్గించి బాధ్యతాయుత మద్యపానాన్ని అలవాటు చేస్తున్నామని మంత్రి సెలవిచ్చారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు.. ఆర్థిక శాఖామంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అర్థమవుతుంది. ఆరోగ్యానికి హానికరమైన చీప్ లిక్కర్ ను అమ్ముతూ పేదల రక్తాన్ని పిండుకుంటున్న అధికార పార్టీ.. బాధ్యతాయుతమైన మద్యపానం అంటూ బాధ్యత కబుర్లు చెబుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఈ తరహా మాటలు బుగ్గన లాంటి మంత్రులకే చెల్లుతుందని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Buggana Rajendranath Reddy
భారీగా పెరిగిన ఆదాయం..
ఒకప్పుడు మద్యపానం ద్వారా రాష్ట్ర ఖజానాకు నాలుగు నుంచి ఐదువేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ మొత్తం ఇంచుమించుగా 20 వేల కోట్ల రూపాయలకు చేరింది. అయినా ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఇతర రంగాల్లో పడిపోవడమే దీనికి కారణం. పరిస్థితి ఇంత స్పష్టంగా కనిపిస్తున్న.. బుగ్గన మాత్రం తనకు అచ్చొచ్చిన పిట్ట కథలను మద్యపానం విషయంలోనూ చెబుతూ వినే వారి చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా బుగ్గనలాంటివారు రాష్ట్ర పతనంలో భాగస్వాములు అవుతున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో పిట్టకథలు చెప్పగలిగే మంత్రికి.. మీడియా ముందు ఈ తరహా కొట్టు కథలు చెప్పడం పెద్ద కష్టమేమీ కాదన్నా విమర్శ వ్యక్తమవుతోంది.