YCP vs TDP : రాజకీయ మరణాలపై వైసిపి, టిడిపి మధ్య ఫైట్
తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఆరుగురు చనిపోయినట్లు ఎల్లో మీడియా రాస్కొచ్చింది. దీనిని వైసీపీ సోషల్ మీడియా తప్పుపడుతోంది.

YCP vs TDP : తెలుగునాట రాజకీయ మరణాలకు చాలా విలువ. ఎవరైనా రాజకీయ ప్రముఖులు మరణించినా, వారు అనారోగ్యానికి గురైనా, జైలుకు వెళ్ళినా చాలా గుండెలు ఆగిపోతుంటాయి. అయితే అందులో వాస్తవం ఉందా? అన్న ప్రశ్న ఎప్పటినుంచో ఉంది. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతోనే.. ఈ రాజకీయ మరణాలు ప్రారంభమయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాజకీయ మరణాలే జగన్ ఉన్నతికి కారణమయ్యాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మృతితో తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో గుండె పోటు మరణాలే అధికం. అలా తన తండ్రి గురించి ఆలోచించి చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని జగన్ నాడు భావించారు. ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్
నిలువరించింది. కానీ జగన్ హై కమాండ్ మాటను పెడచెవిన పెట్టి మరి ఓదార్పు యాత్ర పూర్తి చేశారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ను అజేయమైన శక్తిగా నిలిపారు.
అయితే తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఆరుగురు చనిపోయినట్లు ఎల్లో మీడియా రాస్కొచ్చింది. దీనిని వైసీపీ సోషల్ మీడియా తప్పుపడుతోంది. అయితే దీనికి టిడిపి శ్రేణులు కూడా దీటైన కౌంటర్ ను ఇస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణంతో వందలాదిమంది గుండె ఆగి చనిపోయినట్టే.. ఇప్పుడు కూడా ఆరుగురు చనిపోయారని చెప్పుకొస్తున్నారు. నాడు అబద్ధమైతే.. నేడు కూడా అబద్ధమేనని.. ఈ సవాల్ ను స్వీకరించాలని కోరుతున్నారు. ఇలా రాజకీయ మరణాలపై అధికార, విపక్షం మధ్య గట్టి ఫైటే నడుస్తోంది.
