Bihar : హెడ్ మాస్టర్ ను చితకబాదిన మహిళా టీచర్లు

వాగ్వాదం జరగడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై దృష్టిసారించామని.. త్వరలోనే విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

  • Written By: Dharma Raj
  • Published On:
Bihar : హెడ్ మాస్టర్ ను చితకబాదిన మహిళా టీచర్లు

Bihar :  సమాజంలో ఉపాధ్యాయులది ప్రత్యేక స్థానం. వారిని ఉన్నతంగా భావిస్తారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత కూడా వారిదే. అటువంటి గురువులు ముగ్గురు తమ బాధ్యతలను మరిచిపోయారు. ఏకంగా పిల్లల ముందే కలహించుకున్నారు. కొట్లాటకు దిగారు. విద్యార్థుల ముందే ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. జుట్లు పట్టుకున్నారు. కర్రలతో బాదుకొని బీభత్సం సృష్టించారు. అయితే ఆ ముగ్గురు మహిళా ఉపాధ్యాయులే కావడం విశేషం. ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు నిశ్చేష్టులయ్యారు. బిహార్ లో చోటుచేసుకుంది ఈ ఘటన.

ఓ పాఠశాలలో హెచ్ఎంతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తరగతులు జరుగుతుండగా.. హెచ్ఎం కాంతి కుమారి, మరో టీచర్ అనితా కుమారికి మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుంది. తరగతి గది కిటికీలు మూసే అంశంలో.. మాటామాటా పెరిగింది. చినికిచినికి గాలివానలా మారింది. మొదట తరగతి గదిలో కొట్టుకున్న ఇద్దరు టీచర్లు.. ఆ తర్వాత బయటికి వచ్చి తన్నుకున్నారు. హెచ్ఎం కాంతికుమారి.. తరగతి గది నుంచి బయటికి రాగానే.. అనితా కుమారి ఆమె వెంటే బయటికి వచ్చి పిడిగుద్దులు కురిపించారు.అనితా కుమారికి మరో టీచర్ తోడవడంతో ఇద్దరూ కలిసి హెచ్ఎంను చితకబాదారు. చెప్పులు, కర్రలతో కొట్టుకున్నారు. చివరకు స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

అయితే ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. హెచ్ఎం కాంతి కుమారికి.. మరో టీచర్ అనితా కుమారికి.. వ్యక్తిగత గొడవలు ఉన్నాయని విద్యాశాఖ అధికారి నరేష్ వెల్లడించారు. ఆ గొడవలకు తోడు తాజాగా కిటికీలు మూయడంలో మరోసారి వాగ్వాదం జరగడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై దృష్టిసారించామని.. త్వరలోనే విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు