Kamareddy: అమ్మ ప్రాణం పోసి జీవం ఇస్తే..ఆ ప్రాణానికి రూపు ఇచ్చి..వ్యక్తిగా తీర్చేది మాత్రం నాన్నే. ప్రతీ విజయం, బాధలో నీ వెనుక నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేది కూడా నాన్నే. అటువంటి నాన్నే ఇద్దరు కుమార్తెలను భారంగా పరిగణించి విక్రయిస్తే దానిని ఏమంటారు. కనురెప్ప అయి కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరిస్తే ఆ బాధితులు ఎవరితో చెప్పుకోవాలి. చిన్ననాడే తల్లిని కోల్పోయి కన్నీళ్లు, కడగండ్లను అలవాటు చేసుకున్న ఆ బాలికలు యుక్త వయసుకు రాగానే తండ్రికి దుర్భుద్ధి కలిగింది. రెండో భార్యతో కలిసి ఈడొచ్చిన ఆడ పిల్లలను నడివీధిలోనిలబెట్టి విక్రయించాడు. కొనుగోలు చేసి పెళ్లిచేసుకున్న వారి వేధింపులు తాళలేక బాధిత బాలికలు అధికారులను ఆశ్రయించడంతో అ అమానుషం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఓ మారు మూల గ్రామంలో వెలుగుచూసింది ఈ ఘటన.

Kamareddy
జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరి బాలికల తల్లి చిన్ననాడే చనిపోయింది. తండ్రి రెండే వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే నలుగురు పిల్లలను పెంచి పోషించలేమని భావించిన తండ్రి, రెండో భార్యతో కలిసి పన్నాగం పన్నాడు. 14 సంవత్సరాల ఈడుకలిగిన ఇద్దరి కవల కుమార్తెలను విక్రయించాలని నిర్ణయించాడు. సమీప బంధువులకు చెప్పడంతో ఆయన రాజస్థాన్ కు చెందిన మరో వ్యక్తిని పరిచయం చేశాడు. వారిద్దరూ మెదక్ జిల్లా దండుపల్లికి చెందిన శర్మన్ ను తీసుకొచ్చారు. కలవ బాలికల్లో చిన్న అమ్మాయిని శర్మన్ రూ.80 వేలకు కొనుగోలు చేశాడు. అప్పటికే వివాహమైన శర్మన్ కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చాలామంది మహిళలతో ఆయనకు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ బాలికపై లైంగిక వేధింపులు అధికమయ్యాయి.దీంతో బాలిక తప్పించుకొని కామారెడ్డి డీసీసీవోను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పింది.

Kamareddy
తన సోదరిని ఇదే విధంగా రూ.50 వేలకు విక్రయించారని.. హైదరాబాద్ కు చెందిన కృష్ణకుమార్ డిసెంబరులో వివాహం చేసుకొని.. చిత్రహింసలు పెడుతున్నాడని ఫిర్యాదుచేసింది. దీంతో డీసీపీవో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కామారెడ్డి పోలీసులు తల్లిదండ్రులతో పాటు శర్మన్, కృష్ణకుమార్, వారికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫోక్సో కేసు నమోదుచేశారు. ఏడుగుర్ని రిమాండ్ కు తరలించారు. వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత బాలికలు బాలల సంరక్షాధికారి రక్షణలో ఉన్నారు.