ప్రభుత్వ నిర్లక్ష్యంలో అమెరికా ప్రజల జీవితాలు

కరోనా మహమ్మారి రోజు రోజు కు దాని విశ్వ రూపం, వికృత రూపం చూపిస్తూ వుంది. ఇప్పుడు దాని ప్రతాపం అమెరికాపై పూర్తి గా కేంద్రీకృతమయ్యింది. దాదాపు లక్షకు పైగా కరోనా కేసులు నమోదుకావటం కలవరం కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణులు మొదట్నుంచి ఇటువంటి ఉపద్రవం తలెత్తబోతుందని హెచ్చరిస్తూనే వున్నారు. అయినా ప్రభుత్వం ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ హెచ్చరికలను కొట్టిపారేశాడు. చాలా తేలికగా తీసుకున్నాడు. ఇదంతా కట్టుకధలుగా కొట్టిపారేశాడు. గత రెండువారాలనుంచే దీని తీవ్రతను అర్ధంచేసుకోగలిగాడు. ఇటువంటి […]

  • Written By: Ram Katiki
  • Published On:
ప్రభుత్వ నిర్లక్ష్యంలో అమెరికా ప్రజల జీవితాలు

కరోనా మహమ్మారి రోజు రోజు కు దాని విశ్వ రూపం, వికృత రూపం చూపిస్తూ వుంది. ఇప్పుడు దాని ప్రతాపం అమెరికాపై పూర్తి గా కేంద్రీకృతమయ్యింది. దాదాపు లక్షకు పైగా కరోనా కేసులు నమోదుకావటం కలవరం కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణులు మొదట్నుంచి ఇటువంటి ఉపద్రవం తలెత్తబోతుందని హెచ్చరిస్తూనే వున్నారు. అయినా ప్రభుత్వం ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ హెచ్చరికలను కొట్టిపారేశాడు. చాలా తేలికగా తీసుకున్నాడు. ఇదంతా కట్టుకధలుగా కొట్టిపారేశాడు. గత రెండువారాలనుంచే దీని తీవ్రతను అర్ధంచేసుకోగలిగాడు. ఇటువంటి మహమ్మారి విషయంలో ఒక్కరోజు లేటయినా పెద్ద ప్రమాదమేనని గ్రహించలేకపోయాడు. ఇప్పుడు చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా హడావిడి చేయటం వలన వచ్చిన ఉపద్రవాన్ని ఆపలేరు. జరిగిన లోపం తన అధికారానికి ముప్పు వస్తుందేమోననే భయం తో ఈ నెపాన్ని చైనా పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. చైనా తప్పు ఉన్నమాట నిజమైనా తను ముందస్తు చర్యలు తీసుకోవటం లో విఫలమయ్యాడనేది కూడా కఠోర సత్యం.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచింది 

అమెరికా లో మొట్టమొదటగా వుహాన్ నుంచి అమెరికా పశ్చిమతీర రాష్ట్రమైన వాషింగ్టన్ లోని సియాటిల్ కి జనవరి 21వ తేదీన వచ్చిన ప్రయాణీకుడికి ఈ వైరస్ లక్షణాలు కనబడ్డాయి. వెంటనే అక్కడి ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని, ప్రజల్ని అప్రమత్తం చేశారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే పెను ప్రమాదం పొంచివుందని హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ప్రతిస్పందన వేగంగా లేదు. ఈ లోపు చైనా నుంచి రాకపోకలు చేసేవాళ్ళు నిరభ్యంతరంగా దేశంలోపలికి వేలమంది వచ్చారు. గమనించిన వెంటనే కొన్ని ముందస్తు చర్యలు చేపట్టివుంటే పరిస్థితి అదుపులోనేఉండేది. టెస్టింగ్ ఎంత ప్రహసనం గా జరిగిందంటే సియాటిల్ లాంటి పెద్దనగరం వుండే వాషింగ్టన్ రాష్ట్రం మొత్తానికి రోజుకు 200 కన్నా టెస్టులు చేసే కెపాసిటీ లేదు. అదీ ఫలితం రావటానికి 24 గంటలు పైగా వేచివుండాల్సి వచ్చేది. ఈ టెస్ట్ కిట్లు ఇప్పటి అధునాతన సాంకేతికతకు పనికిరావని నెత్తి నోరు మొత్తుకున్నా, ప్రైవేటు లాబులు గంటలోపే ఇస్తామని చెప్పినా వినే నాధుడు లేడు. బయో సాంకేతికత లో ప్రపంచం లోనే మొదటి స్థానంలో వున్న అమెరికాలో ఇలాజరిగివుంటుందంటే ఎవరైనా నమ్ముతారా. కానీ నిజం. వయోవృద్ధులు వుండే లైఫ్ కేర్ సెంటర్లలో సియాటిల్ శివారు ప్రాంతం కిర్క్ ల్యాండ్ లో ఎక్కువ మరణాలు సంభవించాయి. కొన్నాళ్ళు దాని గవర్నర్ కి , ట్రంప్ కి నిధుల విషయం లో మాటల యుద్ధం జరిగింది. వాషింగ్టన్ రాష్ట్రం లో జరిగిన మరణాలతో వాషింగ్టన్ రాజధానిలో వుండే ట్రంప్ కి ఉలికిపాటు వచ్చింది. చివరకు తనపక్కన తిరిగిన వాళ్లకు వ్యాధి సోకిందని నిర్ధారణ అవటంతో అమెరికా మొత్తం కలవరపాటు కి గురయ్యింది. అప్పటికి గానీ ట్రంప్ కి పూర్తిగా తలకెక్కలేదు.

అప్పటికి కూడా కాలం చెల్లిన టెస్టు కిట్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వచ్చిన అలజడితో చివరకు పోయినవారం 45 నిముషాల్లోనే ఫలితం వచ్చే కిట్లు ప్రవేశపెట్టారు. ఈరోజు తాజాగా 15నిమషాల్లోనే ఫలితం వచ్చే కిట్లను ఎఫ్ డిఎ ఆమోదించింది. అలాగే ఒకేసారి ఎక్కువమందికి చేసే వెసులుబాటు కల్పించారు. దానితో ఈవారంలో ఒక్కసారి వ్యాధిసోకిన కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికి ఒక లక్షకు పైగా  చేరుకొని ప్రపంచంలోనే ఈ వ్యాధి సోకినవారిలో మొదటి స్థానం లో నిలిచింది. నిపుణుల అంచనాప్రకారం వచ్చే రెండు మూడు వారాలు ఇంకా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం వుంది. ఇప్పటికీ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించలేదు. అదేమంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అంతగా లేదని మాట్లాడుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం న్యూయార్క్ లో వచ్చిన ఉపద్రవం ఇంకొన్ని నగరాల్లో కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. లూసియానాకి చెందిన న్యూ ఆర్లిన్స్ నగరానికి ఆ ముప్పు పొంచివుందని చెబుతున్నారు. అలాగే డల్లాస్ , అట్లాంటా , మియామీ,డిట్రాయిట్ , చికాగో, ఫిలడెల్ఫియా ల్లో కూడా ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. విశేషమేమంటే ట్రంప్ అధికారం లోకి వచ్చిన తర్వాత జాతీయ అంటువ్యాధుల నివారణ వైట్ హౌస్ విభాగాన్ని ఎత్తివేశాడు. దీనిపై ఇప్పుడు పలు విమర్శలు తలెత్తుతున్నాయి.

న్యూయార్క్ లో ఇంత విస్ఫోటనం ఎందుకు జరిగింది?

న్యూయార్క్ సిటీ జనాభా 86 లక్షలు. అమెరికా మొత్తం మీద అతి జనసాంద్రత కలిగిన నగరం. చదరపు మైలుకి 27 వేలమంది నివసిస్తున్నారు. ప్రపంచం మొత్తం నుంచి టూరిస్టులు ఎక్కువగా వచ్చే నగరం కూడా అదే. ఇంకో విశేషమేమంటే న్యూయార్క్ నగరం లో ప్రజలు ఎక్కువమంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే ఉపయోగిస్తారు. అటువంటి నగరం లో ఈ వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. ఇప్పుడు ఎక్కువ టెస్టు కిట్లు అందుబాటులోకి రావటం, వెంటనే ఫలితం రావటం తో ఒక్కసారి కేసులు బయటకు వచ్చాయి. అయినా ముందస్తు చర్యలు, కఠిన చర్యలు తీసుకోవటంలో ఆ రాష్ట్ర గవర్నరు, న్యూయార్క్ మేయర్ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. దీనికి తోడు ట్రంప్ కి, వీరికి మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. విశేషమేమంటే ఈ చర్యలపై ఇప్పటికి చర్చ నడుస్తూనే వుంది. అసలు లాక్ డౌన్ వలన నష్టాలు కూడా ఉన్నాయని ఇప్పటికీ ఒకవర్గం వాదిస్తూనే వుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అతి ప్రజాస్వామ్యం కూడా చేటు చేస్తుందనటానికి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ ఎక్కడా ఉండదు.

ఇప్పటికే మొత్తం ఈ వైరస్ సోకిన వాళ్లలో మూడింట ఒక వంతు న్యూయార్క్ రాష్ట్రం నుంచే వున్నారు. అందులో మూడొంతులు న్యూయార్క్ నగరం లోనే వున్నారు. అలాగే చనిపోయినవాళ్లలో కూడా న్యూయార్క్ నగరవాసులు మూడింట ఒకవంతు వున్నారు. న్యూయార్క్ మేయర్ డి బ్లాసియో అంచనా ప్రకారం వచ్చే రెండు వారాల్లో న్యూయార్క్ నగరం లోని 86 లక్షలమందిలో సగం మందికి ఈ వైరస్ సోకే ప్రమాదముందని చెబుతున్నాడు. తాజాగా ప్రతి 3 రోజులకి వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య రెట్టింపు అవుతుంది. న్యూయార్క్ గవర్నర్ క్యుమో అంచనా ప్రకారం ఒక్క న్యూయార్క్ రాష్ట్రానికే 30 వేల వెంటిలేటర్లు, 1,40,000 హాస్పిటల్ బెడ్లు కావలసి ఉంటుందని ప్రకటించాడు. అప్పటికీ ఒక వెంటిలేటర్ ఇద్దరు పేషెంట్లకు వాడితేనే అంత అవసరముందని , అర్జెంటుగా సప్లై చేయమని ట్రంప్ ని అర్ధించాడు. అయితే గవర్నర్ అంచనా అతిగా ఉందని అన్ని వెంటిలేటర్లు అవసరం లేదని ట్రంప్ ప్రకటించాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇలా పబ్లిక్ గా కొట్లాడుకోవటం చూస్తే ప్రజలకు రోత పుడుతుంది.

ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటుందా?

నిపుణుల అంచనా ప్రకారం అమెరికాలో వైరస్ ఇంకా పీక్ స్టేజి కి రాలేదని ఇంకా రెండు , మూడు వారాలు కర్వ్ పైపైకి వెళుతూనేవుంటుందని చెబుతున్నారు. ఇలా పెరుగుకుంటూ పోతే ఈ సంఖ్య ఎంత అవుతుందోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ లోపల ట్రంప్ ఒక ప్రకటన ఇస్తూ ఈస్టర్ ఆదివారం ఏప్రిల్ 12వ తేదీకి సాధారణ స్థితికి కొంత భాగం వస్తుందని , నిర్బంధాలు తొలగించి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పాడు. దానిపై నిపుణులు తీవ్రంగా విభేదిస్తున్నారు. తొందరపడి అటువంటి నిర్ణయం తీసుకొంటే పరిస్థితులు దారుణంగా వుంటాయని హెచ్చరిస్తున్నారు. పూర్తిగా నియంత్రణలోకి రావటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఈ మహమ్మారి దుష్పరిణామాలు దారుణంగా వుంటాయని చెబుతున్నారు. భారత దేశం ఇప్పటికే దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటే లక్ష కేసులు వుండి కూడా అమెరికా ఇలా తటపటాయిస్తుంటే ప్రజల జీవితాలు ఏమి కావాలి? అందులో ఇటీవలి కాలంలో భారతీయులు ఎక్కువమంది స్థిర నివాసాలు ఏర్పరుచుకోవడం, లక్షలాది మంది విద్యార్థులు చదువులకోసం అమెరికా వెళ్ళటం తెలిసిందే. భారతీయుల్లో కూడా మన తెలుగు వాళ్ళు గణనీయమైన సంఖ్య లో వున్నారు. మన రెండు రాష్ట్రాల్లోని చాలా కుటుంబాల పిల్లలు ఎవరో ఒకరు అమెరికాలో ఉండటంతో అమెరికాలో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఎలా మార్పుచెందుతాయోనని ఇక్కడి వాళ్ళు టెన్షన్ తోనే కాలం గడుపుతున్నారు. తాజాగా అందిన వార్తల ప్రకారం 2లక్షల కోట్ల డాలర్ల బిల్లుపై ట్రంప్ సంతకం చేసాడు. దీని ప్రకారం చాలా మందికి 1200 డాలర్లు చొప్పున చెల్లిస్తారు. అమెరికా లో పరిస్థితులు త్వరలో సాధారణ స్థితికి రావాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు