Vangaveeti TDP: వంగవీటి.. ఈ పేరుకు విజయవాడలో ఎంత పవర్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బెజవాడను గడగడలాడించిన రంగా వారసత్వం రాధా రూపంలో ఇప్పటికీ ఉంది. కానీ నాటి వాడి వేడి లేకపోయినా.. కాపుల్లో వంగవీటి కుటుంబంపై అభిమానం మాత్రం చెక్కుచెదరలేదు.
వంగవీటి రంగా నాడు కాంగ్రెస్ లో ఎదిగి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడిగా రంగా ఎంతో పాటు పడ్డాడు. కమ్మ కులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం రాధాకృష్ణ, ఆషా.
విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు వంగవీటి రంగాను ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన హత్యతో కోస్తాలోని చాలా జిల్లాల్లో దాడులు, ప్రతిదాడులు జరిగాయి. విజయవాడ అతలాకుతలమైంది. రంగాను చంపింది టీడీపీ వారేనని.. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారి ఆస్తులను రంగా అనుచరులు నాడు నాశనం చేశారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ కూడా కొనసాగించారు.
రంగా కాంగ్రెస్ లోనే ఎదిగారు. ఆపార్టీ కోసమే బతికారు.. చివరకు ఆ పార్టీలోనే చనిపోయారు. ఆయనను చంపిన వారు టీడీపీలోని ఓ ప్రముఖ నేత అని.. అది ఇప్పటికీ అందరికీ తెలుసు అని ప్రచారం సాగుతుంది.
అయితే కాలం మారింది. రాజకీయాలు మారాయి. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తన తండ్రిని చంపించిన టీడీపీలోనే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేరడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసిందన్న టాక్ నడిచింది. రాజకీయంగా ఎదగడం కోసం టీడీపీలో చేరినా ఇక్కడా ఆయన ఎదగలేకపోయారు. దీంతో ప్రస్తుతం స్తబ్దుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు.
ప్రస్తుతం టీడీపీ మహానాడు ఒంగోలులో ఘనంగా జరుగుతోంది. ఇందులో వంగవీటి రంగా అభిమానులు సందడి చేశారు. రంగా స్టిక్కర్ తో ఉన్న బైక్ పై టీడీపీ జెండాలు పట్టుకొని కార్యకర్తలు వెళుతున్న ఫొటో వైరల్ అయ్యింది. ఏ పార్టీ నేతల చేతిలో అయితే ఆయన చంపబడ్డారని ఆరోపణలు వచ్చాయో.. అదే పార్టీ జెండాను.. ఆయన ఫొటో ముద్రించిన బైక్ పై ఠీవీగా ముందుకు తీసుకెళ్లడం వైరల్ అయ్యింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరి అవసరార్థం రాజకీయాలు ఎటు మరులుతాయోనన్న దానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణగా నిలిచింది.