AP Industries : కియా పరిశ్రమ విస్తరణకు అవకాశం లేకుండా చేశారు. జాకి పరిశ్రమ జాడ లేకుండా చేశారు. చిత్తూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేశారు. కానీ అడ్డగోలుగా వాదిస్తున్నారు. మూడున్నరేళ్లలో భారీ పరిశ్రమలు వచ్చాయని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. భూ కేటాయింపులో పొదుపు మంత్రం పాటిస్తూనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్టు ప్రచారం మొదలు పెట్టేశారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను గణాంకాలతో విడమరచి మరీ.. సాక్షిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి సూపర్ గా ఉందని.. అదంతా రామోజీరావు, ఎల్లో మీడియా కుట్రగా అభివర్ణించారు. మరో అడుగు ముందుకేసి రాష్ట్రం నుంచి తెలంగాణకు తరలుతున్న అమర్ రాజా కంపెనీకి రాజకీయం అంటగట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న తెలుగు మీడియా సంస్థలను తాము తరిమేసినట్టా అని ప్రశ్నిస్తున్నారు. సరికొత్త వక్రభాష్యం మొదలుపెట్టారు.
వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలకు నమ్మినట్టు..దేనినీ నమ్మలేదు. ఏ రంగానికి సరైన న్యాయం చేయలేదు. ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని రైతుభరోసా పథకంతో సరిపెట్టారు. అనుబంధంగా ఉండే సాగు నీటి శాఖను దాదాపు నిర్వీర్యం చేశారు. అనుబంధ శాఖలైన వ్యవసాయ మార్కెటింగ్, పాడి పరిశ్రమల శాఖకు అయితే పట్టించుకున్న దాఖలాలు లేవు. పరిశ్రమల విషయానికి వస్తే అదానీ కంపెనీ పెట్టుబడులు, వాటికి భూ కేటాయింపులు తప్పితే మరేవీ కనిపించడం లేదు. నాలుగేళ్ల పదవీ కాలం ముగిసింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త పల్లవిని ఎత్తుకుంటున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో అమర్ రాజా గ్రూప్ ఏపీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. రాయలసీమలో వేలాది మంది ఉపాధికి దూరం కానున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వ చర్యల ఫలితమేనని తేలడంతో.. లోపాలను సరిపుచ్చుకునేందుకు వైసీపీ సర్కారు రంధ్రాన్వేషణ ప్రారంభించింది. అధికార సాక్షి పత్రికలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ పాత రోత వాసనలతోనే ఈ రాతలు సాగడం రాష్ట్ర ప్రజలకు నమ్మశక్యంగా లేవు.
అదానీ, రిలయన్స్ వంటి పేరుమోసిన పరిశ్రమల ఏర్పాటు, పూర్వాపరాలపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది., చంద్రబాబు హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అదానీ గ్రూపు ఈ రాష్ట్రంజ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందని.. అదంతా జగన్ చొరవతోనేనని ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 30 సంవత్సరాల్లో 70,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందని.. దీనికి గాను విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో అత్యంత విలువైన 400 ఎకరాల భూమిని చంద్రబాబు అందించేందుకు సిద్ధపడ్డారని గుర్తుచేసింది. అదే వైసీపీ సర్కారు అయితే ఈ ఐదేళ్లలో నికర పెట్టుబడులకు పట్టుబడడంతో రూ.14,300 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందని .. కేవలం 130 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం అందించేందుకు ఒప్పందం చేసుకుందని.. సుమారు 270 ఎకరాల భూమిని ఆదా చేసినట్టు ప్రత్యేక కథనం ప్రచురించింది. అదే సమయంలో ఈ రాష్ట్రం నుంచి అమర్ రాజా కంపెనీ వెళ్లలేదని చెప్పుకొచ్చింది. వ్యాపార విస్తరణలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం మాత్రమే చేసుకుందని.. అంతమాత్రాన తాము పొమ్మన్నట్టా అని కూడా రాసుకొచ్చింది. ప్రజా ప్రయోజనాల రీత్యా కంపెనీ నిర్వహణలో కొన్ని లోపాలు మాత్రమే తాము ఎత్తిచూపామని.. దానిని పొమ్మని చెప్పినట్టా అని ప్రశ్నించింది.
వైసీపీతో పాటు సాక్షి మీడియా భావిస్తున్నట్టు ఇదంతా రామోజీరావు అండ్ ఎల్లోమీడియా సృష్టే అనుకుందాం. పరిశ్రమలు వెల్లవలా తరలివస్తే వాటి గురించి సమగ్రంగా..లోతైన విశ్లేషణలతో సాక్షి మీడియాలో రాయొచ్చు కదా. అయితే అది అవాస్తవమే అయినా అయి ఉండాలి. లేకుంటే సాక్షి మీడియాలో సమర్థులైన మీడియా ప్రతినిధులైనా లేకపోయి ఉండాలి. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల విషయంలో ప్రభుత్వ వైఖరిపై వస్తున్న వ్యతిరేక కథనాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ప్రజలు కూడా ఆరాతీసి మరీ దీనిని రుజువు చేసుకుంటున్నారు. కానీ సాక్షి ప్రభుత్వం తరుపున ఇచ్చిన వివరణ మాత్రం ప్రజలను సంతృప్తి పరచడం లేదు. అదానీ గ్రూపు చుట్టూ తిప్పుతూ..అందులో చంద్రబాబు వైఫల్యాలను కలుపుతూ ఇచ్చిన వివరణ సైతం ఏమంత సహేతుకంగా కూడా లేదు. ఏపీలో మెజార్టీ ప్రజలు అదో చెత్త వివరణతో పోలుస్తున్నారు.
అయితే తాజా పరిణామాలు మాత్రం రాయలసీమ ప్రజలకు మింగుడుపడడం లేదు. తమ ప్రాంత బిడ్డ, అందునా తాము అభిమానించే రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడంతో సీమ ప్రజలు జగన్ ను తమ నెత్తినెక్కించుకున్నారు. కనివినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టి సుపరిపాలన అందించాలని దీవించారు. కానీ వారి ఆశించిన దానికంటే ఇప్పుడు భిన్నంగా పాలన నడిపిస్తున్నారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అందులో కీలకమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నైనా రాయలసీమకు కేటాయించారంటే అదీ లేదు. ఎంతో కొంత దగ్గరగా ఉన్న అమరావతిని కాదని.. 1000 కిలోమీటర్ల దూరం ఉన్న సాగరనగరానికి కేటాయించారు. పోనీ హైకోర్టు ఏర్పాటుకైనా చొరవ చూపారా అంటే అదీ లేదు. ప్రభుత్వపరంగా కర్నూలుకు హైకోర్టు తరలించడం లేదని సుప్రీం కోర్టుకు చెప్పారు. పార్టీ పరంగా హైకోర్టు కావాలంటూ గర్జనలు మొదలు పెట్టారు.
ఇప్పడు సీమలో ఉన్న పరిశ్రమలకు రక్షణ లేకపోగా.. కొత్త పరిశ్రమల జాడ లేకపోయింది. కియా పరిశ్రమ ఏర్పాటు తరువాత అనుబంధ పరిశ్రమల ఏపీ వైపు చూస్తాయని భావించారు. కానీ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతల వైఖరితో ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. చివరికి నిర్మాణ పనులు ప్రారంభించిన జాకీ వంటి పరిశ్రమ కూడా సైడ్ అయ్యింది. వేరే రాష్ట్రాల కు వెళ్లిపోయింది. చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి కల్పించేందుకు అమెరికా నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన అమర్ రాజా కూడా తన దారి తాను చూసుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఏపీలో విస్తరణ లేనట్టేనని స్పష్టమైన సంకేతాలిచ్చింది.అతి పెద్ద జియో ప్లాంట్ సైతం రాయలసీమకు దూరమైంది. మూడున్నరేళ్ల కాలాన్ని ఒక్కసారి స్థుతించుకుంటే రాయలసీమలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధిని దూరం చేసిన ఘనత మాత్రం వైసీపీ సర్కారుది. కానీ దానిని మరచి తమ సర్కారు అంతా సవ్యంగా చేస్తోందని సాక్షిలో పసలేని వివరణ ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు.