Gujrat Himachal pradesh Exit Polls 2022 : దేశంలోనే ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులు మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అందుకే మోడీ, అమిత్ షా సహా దేశంలోని కీలక నేతలంతా గుజరాత్ పై మోహరించారు. ప్రధాని అన్న విషయాన్ని మరిచిపోయి సైతం మోడీ ర్యాలీలు తీశారు. ప్రజల వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఓట్లు అడిగారు. దాదాపు 10 రోజుల పాటు గుజరాత్ లో గెలుపు కోసం కష్టపడ్డారు. అంతలా కష్టపడ్డ దానికి ఫలితం వచ్చిందా? ఇక హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరిగాయి? అక్కడ విజయం ఎవరిది? అన్న దానిపై తాజాగా ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మళ్లీ గుజరాత్ లో బీజేపీనే గెలవబోతోందని సర్వేల్లోని స్పష్టం చేశాయి. మోడీ చరిష్మానే ఇక్కడ పనిచేస్తోందని.. ప్రధాని అయిన ఈ గుజరాతీ వెంట గుజరాతీలంతా నిలబడ్డారని తేలింది.మరోసారి గుజరాత్ బీజేపీదేనని అన్ని సర్వేలు కుండబద్దలు కొట్టాయి.
హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం బీజేపీ పప్పులు ఉడకలేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ తప్పదని.. గట్టి ఫైట్ నడుస్తుందని తేలింది.
ఇక గుజరాత్ లోనూ, హిమాచల్ ప్రదేశ్ లోనూ బలమైన ముద్ర వేస్తామని కలలుగన్న ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ ప్రభావం రెండో చోట్ల లేదని తేలింది. సింగిల్ డిజిట్ కే గుజరాత్ లో ఆప్ పార్టీ పరిమితం అవుతుందని.. కేజ్రీవాల్ మ్యాజిక్ ఇక్కడ పనిచేయలేదని తేలింది.
-గుజరాత్ లో ఎగ్జిట్ పోల్స్ (ఎవరికెన్ని అసెంబ్లీ సీట్లు)
– పీపుల్స్ సర్వే: బీజేపీకి 125-143, కాంగ్రెస్ 30-48, ఆప్ 3-7 సీట్లు
-ఆత్మసాక్షి: బీజేపీ 98-110, కాంగ్రెస్ 66-110, ఆప్ 9-14 సీట్లు
-ఔట్ ఆఫ్ ది బాక్స్: బీజేపీ 130-145, కాంగ్రెస్ 25-35, ఆప్ 5-7 సీట్లు
-న్యూస్ ఎక్స్ సర్వే: బీజేపీకి 117-140, కాంగ్రెస్ 34-51, ఆప్ 6-13 సీట్లు
-హిమాచల్ ప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ (ఎవరికెన్ని అసెంబ్లీ సీట్లు)
-న్యూస్ ఎక్స్ : బీజేపీ 32-40, కాంగ్రెస్ 27-34, ఆప్ 0,
-రిపబ్లిక్ టీవీ-పీఎంఏఆర్ క్యూ: బీజేపీ 34-39, కాంగ్రెస్ 28-33, ఆప్ 0-1
-టైమ్స్ నౌ ఈటీజీ : బీజేపీ 38, కాంగ్రెస్ 28, ఆప్ 0
సొంత రాష్ట్రం గుజరాత్ లో ఓడిపోతే పరువు పోతుందని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఆ పార్టీ అగ్రనేతలంతా గుజరాత్ లో వాలి ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు గుజరాత్ లో ప్రచారానికే రాలేదు. రాహుల్ పాదయాత్రలో ఉండగా.. సోనియా పట్టించుకోలేదు.దీంతో ప్రతిపక్షం లేకపోవడంతో బీజేపీ గెలుపు సులువైంది. ఆప్షన్ లేకపోవడంతోపాటు ఆప్ బలంగా లేకపోవడం కూడా బీజేపీ విజయానికి దోహదపడింది. హిమాచల్ ప్రదేశ్ లో ఆదినుంచి కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉండి హోరాహోరీగా తలపడుతున్నాయి.దీంతో అక్కడ హంగ్ సంకేతాలు మరోసారి బయటపడ్డాయి.