Hanuman- Adipurush: రామాయణం, మహాభారతం.. ఇవి భారతీయుల ఆత్మలు. మనం పుట్టినప్పటినుంచి కన్నుమూసే దాకా ఇంట్లో నలుగురితో మాట్లాడుతున్నప్పుడో, స్కూల్లో చదువుకుంటున్నప్పుడో, మిత్రులతో సంభాషిస్తున్నప్పుడో.. కచ్చితంగా వాటి ప్రస్తావన వస్తుంది. అది వాటి గొప్పతనం. తరాలు మారినా, వందల ఏళ్ళు గడిచినా నేటికీ వాటి గురించి మనం చర్చించుకుంటున్నామంటే అచంచలమైన నీతి వాటిల్లో నిగూఢమై ఉందని అర్థం. రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు.. మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, ద్రౌపది.. ఇలా కొన్ని కొన్ని పాత్రలు మనపై చెరగని ముద్ర వేశాయి. వేస్తూ ఉంటాయి. వీళ్ల ఔన్నత్యం గురించి మనం చరిత్రలో చదువుకోవడం తప్ప.. చూసింది లేదు. అలాంటి మనకు సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం దర్శకులు చేశారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేటి తేజ సజ్జా వరకు వారి వారి కోణాల్లో ఆధ్యాత్మికత మనకి పరిచయం చేశారు. ఇదంతా కూడా మెజారిటీ ప్రజలు మెచ్చేలా ఉంటే బాగుంటుంది. అది కాకుండా చేతిలో డబ్బుంది. ఏం తీసినా చూస్తారు అనే తల పొగరు ఉంటే మాత్రం మట్టి కొట్టుకుపోవడం గ్యారంటీ. ఎందుకు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంటే.. తేజ సజ్జ హీరోగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్ అనే సినిమాకు సంబంధించి ఒక చిన్న పాటి వీడియో నిన్న విడుదలైంది. చూడగానే అది చాలా ఆకట్టుకుంటున్నది. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న ఆది పురుష్ అనే సినిమాకు సంబంధించి వీడియో విడుదలైంది. ఆది పురుష్, హనుమాన్ రెండు కూడా రామాయణ నేపథ్యం లో తీసే సినిమాలే. కానీ విడుదలైన వీడియోలు చూస్తే బొచ్చెడు తేడా కనిపిస్తోంది.

Hanuman- Adipurush
గ్రాఫిక్స్ పేరుతో భారీ దందా
ఆధ్యాత్మిక సినిమాలకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మంచి పాయింట్ తీసుకోవాలి. లేకుంటే అంతే సంగతులు. వాస్తవానికి ఇలాంటి మైథాలజికల్ సినిమాలు తీసేటప్పుడు దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. భారీ గ్రాఫిక్స్ పేరిట నిర్మిస్తున్న ఇలాంటి సినిమాల బడ్జెట్ లెక్కలు ఒక పట్టాన అర్థం కావు. ఎవరి వాటా ఏమిటో తెలియదు. అంత బడ్జెట్ ఎందుకు చూపిస్తారో, దాని వెనుక ఉన్న ఐటీ మర్మం ఏమిటో తెలియదు. ఇక 500 కోట్లతో ఓమ్ రౌత్ తీస్తున్న ఆది పురుష్ కు సంబంధించిన వీడియో ఆ మధ్య విడుదలైంది కదా. టీవీల్లో కార్టూన్, యానిమేషన్ సీన్లు తీసుకొచ్చి, యధాతధంగా పేస్ట్ చేసి, 500 కోట్ల ఖర్చు చూపించాడు.. దేశమంతా బండ బూతులు తిట్టింది. ఒరేయ్ బాబు సినిమా అలాగే ఉంటే మర్యాద దక్కదు అని కూడా హెచ్చరించింది. అయితే ఆ బూతుల్ని కూడా అతడు సంపద మార్గానికే వాడుకున్నాడు.. మరి ఎవరికీ నచ్చడం లేదు కదా.. గ్రాఫిక్స్ మార్పిద్దాం, ఇక అందంగా చెక్కుదాం, మరో 100 కోట్లు ఇవ్వండి అని నిర్మాతల జేబులు మళ్ళీ కట్ చేసేశాడు.. కానీ ఆ దర్శకరత్నానికి హనుమాన్ పేరిట తెలుగు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్న సినిమా వీడియో చూపించాలి. నిన్న విడుదలైన వీడియో చూస్తే ఆది పురుష్ కంటే వెయ్యిరెట్లు బాగుంది. హనుమాన్ సినిమాకు బడ్జెట్ కేవలం 15 కోట్లు. ఈ గ్రాఫిక్స్ దందాలు చేసే పెద్ద దర్శకులకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్నారో ఏమో.. నిర్మాతలకు అసలు లెక్కలు తెలిసిపోతాయని భావించారో ఏమో.. వికీపీడియాలో ఆఫ్ బడ్జెట్ ఫిగర్స్ తీసి పక్కన పెట్టారు. ఆది పురుష్ తీసుకోండి. మొత్తం ఖర్చు 600 కోట్లు. ఇప్పటికే విడుదలైన వీడియో చూస్తే ఆ సినిమా సత్తా ఏమిటో తెలిసిపోతోంది. అది పరమ అధ్వానంగా ఉంది.
అయితేనేం అదరగొట్టేశారు
ఆది పురుష్ బడ్జెట్ తో పోలిస్తే హనుమాన్ నాలుగైదు పైసలు మాత్రమే. అయితేనేం అదరగొట్టేశారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో.. కొన్నిచోట్ల మరి 100 మంది బాలయ్యలు ఒక్కటైన వేళ అన్నట్టుగా అతి హీరోయిజాన్ని ఆపాదించారు. హనుమంతుడే కదా! అతని బలాన్ని మొత్తం చూపించాం అనుకున్నారేమో.. సినిమా విడుదలయితే గాని తెలియదు.. టీజర్ బట్టే సినిమాలు అంచనా వేయలేం.. కరెక్టే గాని సినిమా పోకడను అది పట్టిస్తుంది కదా! కచ్చితంగా ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, అది పురుష్ గ్రాఫిక్స్ కన్నా ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా బాగుంది. భారీ గ్రాఫిక్స్ సినిమాల్లో దర్శకుడు కనిపించడు.

Hanuman
అందుకే కదా రోబో 2.0 మట్టి కొట్టుకుపోయింది. రాధే శ్యామ్ 90 ఎం ఎం రాడ్ అయింది. కానీ హనుమాన్ లో ఆ లోపం లేదు. కొన్ని షాట్లల్లో ప్రశాంత్ వర్మ కనిపించాడు. ఆ మధ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 సంబంధించి బాలకృష్ణ తో ఒక గ్లింప్సీ వీడియో చేశాడు కదా! తనకు వీడియోల మేకింగ్ పై ఎంత పట్టు ఉందో చెప్పకనే చెప్పాడు.. పరికరం ఎంత ఆధునికమైతేనేం.. అది చేతిలో ఉన్న పని వారికి ఎలా వాడుకోవాలో తెలియాలి. ఇది అదే.. మొన్నిమధ్య కార్తికేయ 2 అని ఒక సినిమా విడుదలయింది. దిల్ రాజు లాంటి నయా నియంతలు ఆ సినిమాను తొక్కేయాలని చూశారు. కానీ ఫలితం ఏమైంది.. అన్నట్టు హనుమాన్ సినిమాకి 15 కోట్లు బడ్జెట్. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మేసి 16 కోట్లు సంపాదించారు. శాటిలైట్ రేట్స్ ఇంకా ఖరారు కానట్టుంది.. అంటే ఏ లెక్కన చూసుకున్న బంపర్ ప్రాఫిట్స్.. ఇప్పుడు అసలే భక్తి కాలం నడుస్తోంది. పైగా హనుమంతుడు.. ఈ సినిమా మరో కార్తికేయ -2 కావడం. అది ఏ దిల్ రాజు లాంటి వాడు తొక్కకపోతే..