Visakhapatnam : వైసీపీకి షాక్.. పార్టీని వీడిన కీలక నేత
విశాఖ జిల్లాలో జనసేన బలంగా ఉండడంతో ఆ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. పూర్వాశ్రమంలో పీఆర్పీలో పవన్ తో కలిసి పనిచేసి ఉండడం కలిసొచ్చే అంశం. పైగా వివాదరహితుడు అన్న పేరు ఉంది. అందుకే జనసేన నాయకత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Visakhapatnam : వైసీపీకి మరో షాక్. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయన ఎట్టకేలకు పార్టీ వీడాలని డిసైడయ్యారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన రమేష్ బాబు కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు. రెండేళ్ల కిందట వైసీపీలో చేరారు. హైకమాండ్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కానీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల టిక్కెట్ కుదరదని తేల్చిచెప్పడంతో పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.
ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు, విజయసాయిరెడ్డి చొరవ తీసుకొని రమేష్ బాబును పార్టీలో చేర్పించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు కోసం పంచకర్ల శక్తివంచన లేకుండా కృషిచేశారు. అయితే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతల నుంచి తొలగించడం, అటు అవంతి శ్రీనివాసరావుకు అమాత్య పదవి పోవడంతో పంచకర్లను పట్టించుకునే వారు కరువయ్యారు. విజయసాయిరెడ్డి మనిషిగా ముద్రపడడంతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారన్న టాక్ ఉంది. ముఖ్యంగా పెందుర్తి టిక్కెట్ విషయంలో హైకమాండ్ మొండిచేయి చూపడంతోనే పంచకర్ల పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది.
పంచకర్ల రమేష్ బాబుది మచిలీపట్నం. దశాబ్దాల కిందట వ్యాపారరీత్యా విశాఖ వచ్చి స్థిరపడ్డారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. పెందుర్తి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి యలమంచిలి నుంచే బరిలో దిగి ఓటమి చవిచూశారు. 2021లో వైసీపీలో చేరారు. హైకమాండ్ గుర్తించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ భరోసా లేకపోవడంతో పంచకర్ల వైసీపీని వీడారు.
అయితే పంచకర్ల ఏ పార్టీలో చేరుతారన్నది క్లారిటీ లేదు. జనసేనలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. బలమైన కాపు సామాజికవర్గనేత కావడం, విశాఖ జిల్లాలో జనసేన బలంగా ఉండడంతో ఆ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. పూర్వాశ్రమంలో పీఆర్పీలో పవన్ తో కలిసి పనిచేసి ఉండడం కలిసొచ్చే అంశం. పైగా వివాదరహితుడు అన్న పేరు ఉంది. అందుకే జనసేన నాయకత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
