AP Salaries: అప్పుపై ఆధారపడి పాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. నెలనెలా అప్పు పుడితే కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు అందించలేని దయనీయ స్థితికి చేరుకుంది ఏపీలోని వైసీపీ సర్కారు. రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి మరీ పథకాల పేరిట నగదు పంచేస్తోంది. ప్రజలకు పప్పూ బెల్లం అందించి.. తెర వెనుకన దోపిడీకి పాల్పడుతుందన్న ఆరోపణలున్నాయి. అయితే జగన్ సర్కారు చర్యలు పుణ్యమా అని ఏపీ భవిష్యత్ అంధకారంలోకి వెళుతోంది. నెల మొదటి తారీఖుకే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఖాతాల్లో జీతాలు జమ కావడం లేదు. శేష జీవితం అనుభవించే పెన్షనర్ల అవసరాలకు పింఛన్ అందడం లేదు. అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. అయితే వీరికి సవ్యంగా చెల్లిస్తే మాకేంటి అనుకున్నారేమో కానీ.. నవరత్నాల్లో భాగంగా పథకాలకు మాత్రం అటుఇటుగా ధనాన్నిసర్దుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటి పాలనను గాలికొదిలేస్తున్నారన్న టాక్ వైసీపీ సర్కారుపై ఎప్పటి నుంచో ఉంది.

AP Salaries
రాష్ట్రాలకు కేంద్రం రుణ పరిమితి విధిస్తోంది. దానిని అధిగమించేందుకు వీలుండదు. కానీ జగన్ సర్కారుకు మాత్రం కేంద్రం ఇప్పటివరకూ పరిమితికి మించి అప్పులకు అనుమతిచ్చింది. కానీ దానిని ఏపీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఎడాపెడా అప్పులు చేసి ఆర్థిక సంవత్సరం నాలుగు నెలలు ఉండగానే పరిమితి దాటేసింది. ఇప్పుడు ఎక్కడా అప్పుపుట్టని దుస్థితి. చివరికి సెక్యూరిటీ బాండ్లు వేలంతో పాటు కార్పొరేషన్ల పేరిట కూడా అప్పులు చేసింది. రాష్ట్ర భవిష్యత్ ఆదాయాన్ని సైతం కుదువపెట్టింది. ఇప్పుడు చేయడానికి అంటూ ఏమీ లేదు. అందుకే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలోని అధికారుల బృందం పడిగాపులు కాస్తోంది.కేబినెట్ లో ఏ మంత్రికి ఇప్పుడు పనిలేదు. కానీ బుగ్గన మాత్రం అప్పుల కోసం తిప్పలు పడుతుంటారు. నెలలో పదిరోజులు ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం తిరుగుతుంటారు. అందుకే కాబోలు ఆయనకు విస్తరణలో తప్పించలేదన్న టాక్ కూడా ఉంది.
డిసెంబరు నెలకు సంబంధించి రెండో వారం సమీపిస్తోంది. ఇంతవరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఖాతాల్లో జీతాలు పడలేదు. పెన్షనర్లలో కొందరికి పింఛను అందలేదు. రాష్ట్ర ఖజానా చూస్తే నిండుకుంది. మంగళవారం ఆర్బీఐ సెక్యూరిటీ వేలంలో ఐదు రాష్ట్రాలు పాల్గోనున్నాయి. అందులో రూ.9,250 కోట్ల రుణాలకు సంబంధించి వేలం నిర్వహించనున్నారు. మిగతా ఐదు రాష్ట్రాలకు చాన్స్ ఉన్నా ఏపీకి మాత్రం డోర్స్ క్లోజయ్యాయి. రుణ పరిమితి దాటిపోవడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు ఏపీ ముందున్న కర్తవ్యం ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లడమే. అయితే రాజకీయంగా దుమారం రేగుతుందన్న భయంతో జగన్ సర్కారు ఓడీకి వెళుతుందా అన్నది అనుమానమే. ఇప్పుడు నిధులు ఎలా సమీకరిస్తారన్నది చర్చనియాంశంగా మారింది.

AP Salaries
రాష్ట్రంలో జీతాలు, పింఛన్ల కోసం నెలకు రూ.5,500 కోట్లు అవసరం. డిసెంబరు నెలకు సంబంధించి ఇప్పటివరకూ సగం జీతాలు చెల్లించినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తక్కువ మొత్తంలో జీతాలను ముందుగా చెల్లిస్తోంది. భారీగా జీతాలు ఉన్న వర్గాలకు ఐదో తేదీ దాటిన తరువాత.. అప్పులు పుట్టాకే చెల్లిస్తోంది. ఈ నెల కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే అప్పులకు కేంద్రం ప్రత్యేక అనుమతిస్తే గట్టెక్కినట్టే లేకపోతే మాత్రం తప్పనిసరి ఓడీకి వెళ్లాల్సిందే. వాస్తవానికి 2022, 23 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి 44,574 కోట్ల బహిరంగ మార్కెట్ రుణానికి కేంద్రం అనుమతిచ్చింది.కానీ జగన్ సర్కారు నవంబరు నాటికే 45,503 కోట్ల మేర అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్టు కార్పొరేషన్ల ద్వారా రూ.20 వేల కోట్లు సమీకరించింది. ఇప్పుడు అన్ని పరిమితులు దాటిపోవడంతో అప్పు పుట్టక బేల చూపులు చూస్తోంది. కేంద్ర పెద్దలు దయ కోసం ఎదురుచూడాల్సిన దౌర్భగ్య స్థితిలో ఏపీ సర్కారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.