Etela Rajender: మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై అప్పుడే అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమి భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దీనిపై మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అదంతా ఊహాజనితమే అని కొట్టిపారేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో రెండు పార్టీల్లో ఆందోళన నెలకొంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్ లకు జీవన్మరణ సమస్యగా మారింది. తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి రెండు పార్టీలకు ఏర్పడింది. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగానే ఓటమి భయంతోనే టీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు వట్టివేనని కొట్టిపారేస్తున్నారు.
అసలు బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే రహస్య ఒప్పందం జరిగిందని ప్రత్యారోపణ చేస్తోంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి అక్కడే వారం రోజులు మకాం వేసి బీజేపీ అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తుందన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మంతనాలు జరిగినట్లు అప్పుడే వార్తలు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే పని పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయంగా నిలదొక్కుకునే క్రమంలో ఇతర పార్టీలపై బురద జల్లడం మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు.
దళితబంధు పథకంతో లబ్ధిపొందాలని టీఆర్ఎస్ భావించినా అది కూడా అంత ప్లస్ కాలేకపోతోందని తెలుస్తోంది. దీంతోనే నేతల్లో ఓటమి భయం పట్టుకుందని సమాచారం. అందుకే ప్రత్యర్థి పార్టీలపై లేనిపోని విధంగా ఆరోపణలకు దిగుతున్నారని పలువురు చెబుతున్నారు. రాజకీయంగా ఓడిపోతే పెద్ద దెబ్బ తగిలినట్లేనని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో విజయం ముంగిట నిలవాలని తమ శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నాయి.