Etela Rajender: ఒక్కో సారి చిన్న విషయమే కానీ మనల్ని ఇబ్బంది పెడుతుంది. దానిని పట్టించుకోకపోవడం వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు దాని ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటారా ? మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ప్రస్తుతం ఇలాంటి చిన్న పొరపాటే చేశారు.
వైరల్ అవుతున్న ఫొటో
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్విహిస్తున్నారు ఈటల రాజేందర్. అందులో భాగంగానే శనివారం ఓ చోట ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈటల అభిమానులు డబ్బు కొట్టి డ్యాన్సులు చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఈటలను డబ్బు కొట్టాల్సిందిగా కోరారు. వారి కోరిక మేరకు ఆయన డబ్బు కొట్టి అభిమానులను ఆనందింపజేశారు. కానీ ఇక్కడే ఆయన చిన్న పొరపాటు చేశారు. ఆ చిన్న పొరపాటే ఇప్పుడు బీజేపీ శ్రేణులను, ఓటర్లను గందరగోళంలోకి నెట్టివేసింది.
‘జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు’ అంటున్న ఫొటో వైరల్..
అభిమానులు కోరిక మేరకు డబ్బు కొట్టిన ఈటల రాజేందర్ ఇక్కడ ఒక్క చిన్న విషయాన్ని గుర్తించలేదు. ఆయన దరువేసిన డప్పుపై ‘జై కేసీఆర్, కారుగుర్తుకే మన ఓటు’ అని రాసి ఉంది. దీనిని కొందరు ఫొటో తీశారు. ఈటల రాజేందర్ దరువేస్తున్న ఫొటో, ఆ డప్పుపై ఉన్న స్లోగన్ స్ఫష్టంగా కనిపించేలా ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ‘టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న ఈటల రాజేందర్ కు ధన్యవాదాలు. మీకు ఇంకా టీఆర్ఎస్ పై ఉన్న అభిమానికి జోహార్లు’ అంటూ ఫొటో వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. దీంతో బీజేపీ కార్యకర్తలకు ఏం కౌంటర్ ఇవ్వాలో తెలియడం లేదు. ఇలా చిన్న పొరపాటు కూడా ఎంత వరకు తీసుకెళ్తుందో చూశారుగా.. చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో జాగ్రత్తగా గమనించాలని ఈ ఫొటో హెచ్చరిస్తోంది కదూ..