Etela Rajender- KCR: భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయి.. చివరకు అధికార పార్టీని వీడిన నేత ఈటల రాజేందర్. బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆత్మగౌరవ నినాదంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిలిచి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈటలకు, కేసీఆర్‌కు మధ్య పోటీ అన్నట్లుగా జరిగిన హుజూరాబాద్‌లో ఈటల పైచేయి సాధించారు. దీంతో ఈటల దూకుడు పెంచారు. కేసీఆర్‌ను ఓడించమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు. గజ్వేల్‌లో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని చాలెంజ్ చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో వర్క్ కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

Etela Rajender- KCR
ఎక్కడైనా రెడీ..
కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన ఈటల రాజేందర్ అది గజ్వేల్ అయినా మరొకటి అయినా సరే తాను రెడీ అంటున్నారు. ఇప్పుడు అదే క్లారిటీ వచ్చేసినట్లుగా ఉంది. ఈటల రాజేందర్‌నే కేసీఆర్‌పై పోటీకి దింపాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు కమలనాథుల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు ఈటలకు ఇప్పటికే అధిష్టానం నుంచి సమాచారం కూడా అందినట్లు తెలిసింది. ఇటీవల కొన్ని రోజులపాటు ఈటల ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై పోటీ, ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఆయనకు అధిష్టానం బ్లూప్రింట్ ఇచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్ గజ్వేల్‌లో పోటీ చేస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే ఆయన నియోజకవర్గం మారొచ్చని కొంత కాలం కిందట ప్రచారం జరిగింది. ఇప్పటికి సూచనలు లేవు. అయితే ఈటల రాజేందర్ మాత్రం గజ్వేల్‌లో పని ప్రారంభించారు. తనకు ఉన్న పరిచయాలతో.. ఓ మాదిరిగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. తరచూ గజ్వేల్‌లో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కొంచెం కొంచెంగా మారుతోంది.

Etela Rajender- KCR
ప్రత్యర్థి లేకుండా చేసుకున్న కేసీఆర్..
గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. అక్కడ తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకున్నారు. గతంలో కేసీఆర్‌కు ప్రత్యర్థిగా వంటేరు ప్రతాప్‌రెడ్డి ఉండేవారు. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రత్యర్థి లేరు. ఈ క్రమంలో వచ్చే ఎన్నినకల్లో ఈటల అయితే సరైన ప్రత్యర్థి అవుతారన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో ఉంది. కేసీఆర్, ఈటల మధ్య పోటీ జరిగితే.. ఎజెండా మారిపోతుంది. కేసీఆర్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగానే తాను బరిలో నిలబడ్డానని.. న్యాయం కావాలని ఈటల ప్రచారం చేస్తే సీన్ మారిపోతుంది. టీఆర్‌ఎస్‌లో తనకు అన్యాయం చేశారని ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కేసీఆర్ .. టీఆర్‌ఎస్ అధినేతగా బలంగా నిలబడగలరు.. కానీ గజ్వేల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందే.
బెంగాల్ ప్లాన్ అమలు..
ఏడాదిన్నర క్రితం జరిగగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడింది. దాదాపు అధికార తృణమూల్‌ను ఓడించినంత పనిచేసింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరిన సువెందో అధికారిని బరిలో నిలిపి మమతను బీజేపీ ఓడించింది. ఇప్పుడు ఇదే ప్లాన్‌ను బీజేపీ తెలంగాణలోనూ అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌పై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటలను బరిలో నిలపడమే సరైన నిర్ణయమని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే దీదీలాగా కేసీఆర్‌ను కూడా ఓడించవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఈటలకు భయపడి కేసీఆర్ నియోజకవర్గం మార్చుకుంటారో లేక పోలీకి సై అంటారో వేచి చూడాలి.