
సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైంది. కాగా ఆ అమర గాయకుడికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పై హర్షం వ్యక్తం చేశారు నటుడు, రచయిత తనికెళ్ల భరణి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్కెఎం హోటల్లో నిర్వహించిన సింగర్ మీట్ కార్యక్రమానికి హాజరయిన భరణి.. ఈ సందర్భంగా పలు విషయాలను చెప్పుకోచారు.
భరణి మాటల్లో.. ‘బాలుతో ‘మిథునం’ చిత్రం చేశాను. అది ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తీసుకురావడం సంతోషంగా ఉంది. బాలుగారి అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఇక కరోనా గురించి మాట్లాడుతూ.. ప్రపంచమంతా తనదే అనే దురహంకారులకు చెంపపెట్టు కరోనా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యం కాపాడకపోతే త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా నేర్పిందని.. తనికెళ్ళ భరణి చెప్పుకొచ్చాడు.
కాగా సాంకేతికత కారణంగా ఇంట్లో కూనిరాగాలు తీసేవారికి అరుదైన అవకాశాలు లభిస్తున్నాయని.. ఆ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది గాయనీ, గాయకులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మధుర గీతాలను ఆలపించారు.