TDP Senior leaders: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి అడుగులు వేసిన వారు ఉన్నారు. వరుసగా ఐదారుసార్లు గెలిచినవారు ఉన్నారు. అయితే అటువంటి వారంతా క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని ఆలోచన చేస్తున్నారు. పొలిటికల్ రిటైర్మెంట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. వయసుతోపాటు ఆరోగ్యం దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు స్వస్తి అని వైరాగ్య ధోరణిలో మాట్లాడారు. ఆయన ఒక్కరే కాదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్లంతా ఇప్పుడు ఇదే పాట పాడుతున్నారు. కొత్త ధోరణితో ముందుకు వెళుతున్నారు.
ఏడు పదులకు దగ్గరగా నాయకులు..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపు 44 సంవత్సరాలు అవుతోంది. ఆ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ( political entry ) ఇచ్చిన చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. తొలిసారిగా పోటీ చేసే సమయంలో వారి వయస్సు 25 సంవత్సరాల లోపల. అటువంటి వారంతా ఇప్పుడు ఏడుపదులు దాటేశారు. వయసు దృష్ట్యా రాజకీయాలనుంచి పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో యువనాయకత్వం తెరపైకి వచ్చింది. సీనియర్లకు వారసులు ఉన్నచోట వారికి లైన్ క్లియర్ అయింది. లేని చోట కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్లు తమ వారసులను సెట్ చేశారు. చంద్రబాబుతో తాము ఎలా మెలిగామో.. అదే మాదిరిగా లోకేష్ తో సైతం వారసులు జత కలిసేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యారు. అటువంటి వారిలో విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం నుంచి గౌతు శ్యామసుందర శివాజీ, యనమల రామకృష్ణుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.
వారి నిష్క్రమణ ఖాయం..
2029 ఎన్నికల్లో దాదాపు టిడిపి ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాయకులంతా పక్కకు తప్పుకోవడం ఖాయం. ప్రధానంగా విశాఖ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు తదితరులు వారసులను తెరపైకి తేనున్నారు.
అన్నిచోట్ల అంతే..
గోదావరి జిల్లాల నుంచి చాలామంది తమ వారసులను పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నారు. జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. అయితే వీరే కాదు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పదుల సంఖ్యలో సీనియర్లు రాజకీయాలనుంచి నిష్క్రమించాలని చూస్తున్నారు. తమ స్థానంలో వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పేరుకే వీరు ఎమ్మెల్యేలు కానీ.. పాలనాంత వారసులే చూస్తున్నారు. తద్వారా వారికి కొంత అనుభవం వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి అయితే 2029 ఎన్నికల్లో అంతా యంగ్ జనరేషన్ కనిపిస్తుందన్నమాట.
