Merupu Murali: టొవినో థామస్ సూపర్ హీరోగా తెరకెక్కిన ‘మిన్నల్ మురళి’ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘నెట్‌ఫ్లిక్స్’ గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న టొవినో థామస్. ఈసారి సూపర్ హీరోగా వచ్చేస్తున్నాడు. కన్నడంలో ‘మిన్నల్ మురళి’ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రంతో టొవినో కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నాడు. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నేరుగా ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా గురువారం ‘మిన్నల్ మురళి’ ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలుగులో ‘మెరుపు మురళి’ గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇంకా హిందీ, తమిళంలో కూడా రిలీజ్ కానుంది. హీరో మురళి ఓ గ్రామంలో నివసిస్తుంటాడు. ఓ రోజు అతడిపై పిడుగు పడుతుంది. దీంతో అతడి గుండె ఆగుతుంది. వైద్యులు ఎట్టకేలకు అతడికి ప్రాణం పోస్తారు. అయితే, పిడుగుపాటు తర్వాత అతడి శరీరంలో మార్పులు వస్తాయి. చిన్న శబ్దాలు కూడా అతడికి పెద్దవిగా వినిపిస్తాయి. అతడికి ఊహించనంత బలం, శక్తి వస్తుంది. మన హాలీవుడ్ సినిమాల్లో చూపించే ‘సూపర్ హీరో’లా మారిపోతాడు.
మురళి తాను కూడా సూపర్ హీరోలా ఎగరగలనో లేదో తెలుసుకొనేందుకు చెట్టు మీద నుంచి కిందకి దూకుతాడు. కింద పడటంతో ఎగరలేనని తెలుసుకుంటాడు. మరి మురళికి ఎలాంటి సూపర్ పవర్స్ వస్తాయి… అతడి శక్తి వల్ల ఆ గ్రామానికి మేలు జరుగుతుందా… పోలీసులు అతడి గురించి ఎందుకు వెతుకుతారు… సూపర్ హీరోగా మారిన తర్వాత అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది బుల్లితెర పైనే చూడాలి. ట్రైలర్ చూస్తుంటే… టొవినో పాత్ర చాలా కామెడిగా ఉంది. మీరు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ నిర్మించగా… డిసెంబరు 24 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.