Kantha Rao Family: ఒంట్లో శక్తి, దేహంలో తెగువ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకోసుకోవాలి. జీవితం చరమాంకంలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవాలను నెమరు వేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి తేడా అయినా దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. వెనుకటికి సావిత్రి అనే కథానాయక తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఏలుతూ ఉండేది. మూడు షిఫ్టులు పనిచేస్తూ ఉండేది. లెక్కకు మిక్కిలి డబ్బు ఆమె వద్ద ఉండేది. జెమినీ గణేషన్ తో ఆమె పరిణయం, తర్వాతి పరిణామాలు ఆమెను ఆర్థికంగా దెబ్బతిశాయి. ఇప్పుడు వాటి తాలూకు కష్టాలను ఆమె కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఎవరు తీసుకోవాలి? ఆమెను ఆదరించిన సమాజమా? ఆమె తీసుకున్న నిర్ణయాలా? ఒకవేళ ఆమె ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడానికి సమాజమే కారణం అయితే ఆమె సంపాదించినప్పుడు ఆ డబ్బు కూడా సమాజానికి చెందాలి కదా?

కాంతారావు కుటుంబ కష్టాలకు తెలంగాణ సమాజానికి ఏమిటి సంబంధం
కాంతారావు.. తెలుగు పౌరాణిక చిత్రాల్లో నటించిన ఓ మహానటుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి నటులతో పోటాపోటీగా సినిమాలు చేసేవారు. ఒకానొక దశలో ఆయనకు గాలి పీల్చేందుకు కూడా ఖాళీ ఉండేది కాదు. అంత బిజీగా ఉండేవారయానా! కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాయి. కాంతారావు బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో ప్రతిరోజు ఆయన ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉండేది. వచ్చేవాళ్లు, వెళ్లే వాళ్లతో సందడిగా ఉండేది. కూర్చుని తింటే కొండలయినా కరుగుతాయి అన్నట్టు.. కాంతారావుకు అవకాశాలు ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది.. కానీ ఎప్పుడైతే ఆయన ఫేడ్ అవుట్ అయిపోయరో.. అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. సినీ పరిశ్రమ అంటేనే అంతే కదా.. అంతటి ఎన్టీఆర్ కు కూడా అవకాశాలు రావడం కష్టమైంది. వరుస ప్లాపులు వచ్చాక కనీసం ఆయన ముఖాన్ని చూసేందుకు కూడా నిర్మాతలు ఇష్టపడలేదు. సినీ పరిశ్రమ అంటే శుక్రవారం ఆధారంగా నడుస్తుంది. విజయవంతం అయితే కటౌట్ లు పెట్టారు. ప్లాప్ అయితే ఫోన్లు కట్ చేశారు. ఎంతటి నిర్దయ! అనే మాటకు ఇక్కడ తావు లేదు. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితి మీద ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు కనిపించాయి. ఆయన కుటుంబం కిరాయి ఇంట్లో ఉంటున్నదని, ఇందుకు తెలంగాణ సమాజం బాధ్యత తీసుకోవాలని కొందరు వ్యాఖ్యానించారు. కానీ ఆయన కష్టాలకు తెలంగాణ సమాజానికి ఏ సంబంధం?
Also Read: Cold booming In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న చలి
ఎంతో మంది రోడ్డున పడ్డారు
సినిమా పరిశ్రమ అంటేనే ఒక జూదం. బయటికి కనిపించేంత ఇంద్రధనస్సు రంగులు అందులో ఉండవు. ఎవడి బతుకువాడిదే.. కాంతారావు గురించి, ఆయన కుటుంబం గురించి గుండెలు బాదుకుంటున్న వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. తెలుగు చిత్ర పరిశ్రమకు కుబేరుల్లా వచ్చి నిండా మునిగిపోయిన వారు 90 శాతం దాకా ఉంటారు. దువ్వాసి మోహన్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకప్పుడు శ్రీమంతుడు.. కానీ ఇప్పుడు ఆఫీసుల్లో పని చేసుకుంటూ ఉంటున్నాడు. దానికి కూడా సమాజం బాధ్యత తీసుకోవాలా? చిత్ర పరిశ్రమకు వచ్చి సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో.. అడ్రస్ లేకుండా పోయిన వారు కూడా ఎందరో.. అసలు చిత్ర పరిశ్రమ అంటేనే 90% ఫెయిల్యూర్స్ ఉంటాయి. అప్పుడు గెలిచినవారు ఇప్పుడు కనీసం సోయి లో కూడా లేరు.
ప్రభుత్వం ఇచ్చింది
కాంతారావు గొప్ప నటుడు. ఆ గొప్పతనం మొత్తం క్యాష్ రూపంలో కుటుంబ సభ్యులకు రావాలి అంటే ఎలా? తండ్రిగా కాంతారావు ఏమి సంపాదించలేకపోవచ్చు. కానీ ఘనమైన వారసత్వాన్ని ఇచ్చారు కదా.. మరి దానిని ఎందుకు అందుకోలేపోయారు. తమ తండ్రి గొప్పగా బతికారని, ఇప్పుడు తమ కష్టాల్లో ఉన్నాం కాబట్టి సాయం చేయాలని వారు అడగడం కాంతారావు స్థాయిని తగ్గించడమే అవుతుంది. వాస్తవానికి కాంతారావు భార్య జీవించి ఉన్నంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది. ఆమె కన్నుమూసిన తర్వాత కూడా ప్రభుత్వం సాయం చేయాలి అని అడగడం ఎంతవరకు కరెక్ట్?

ఎవరి బతుకు వారిదే
ఈ సమాజంలో ఎవరి బతుకు వారిదే. ఎవరి కష్టం వాడే పడాలి.. డబ్బులు సంపాదించిన మాత్రాన గొప్పోలైపోరు.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆదాని, అంబానీ ఒకప్పుడు కష్టాలు అనుభవించినవారే. వారి తండ్రులు భారీగా సంపాదించిన మాత్రాన కూర్చుని తినలేదు. వారు కూడా కష్టపడ్డారు. దానికి కొంత అదృష్టం తోడైంది. అందుకే ఇవాళ అపర కుబేరులుగా వెలుగొందుతున్నారు. అంతేకానీ గాలికి దీపం పెట్టి దేవుడా మీదే భారం అన్నట్టుగా చేయలేదు. మరి ముఖ్యంగా రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని.. పక్షంలో ఆ బాధ్యత ఈ సమాజం తీసుకోవాలని నిందలు వేయలేదు. అందుచేత కాంతారావు కుటుంబం మీద సోషల్ మీడియాలో పోస్టులు చేసే ఉదారవాదులు వీలుంటే వారి కుటుంబానికి సహాయం చేయండి.. అంతేకానీ ఆ నెపాన్ని ఈ సమాజం మీద రుద్దకండి. ఎందుకంటే ఆ సమాజం ఆదరిస్తేనే కాంతారావు గొప్ప నటుడు అయ్యాడు. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు.
Also Read:Superstar Krishna Donating Organs: చనిపోయిన తర్వాత అవయవాలను దానం చేసిన సూపర్ స్టార్ కృష్ణ
[…] Also Read: Kantha Rao Family: కాంతారావు కుటుంబం కష్టాలకి సమ… […]