హీరో రాజశేఖర్ మంచి ఫామ్ లో ఉన్న రోజులు అవి. అందుకే, రోజుకు రెండు సినిమాల షూట్స్ లో పాల్గొనేవాడు. ‘మనసున్న మారాజు’ అనే సినిమాతో పాటు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘ఒక్కడు చాలు’ అనే సినిమాని కూడా రాజశేఖర్ ఒకేసారి చేస్తున్న కాలం అది. దాంతో ఆ రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. అయితే రెండు సినిమాల్లో ‘మనసున్న మారాజు’ చిత్రానికి బాగా బిజినెస్ జరిగింది.
మంచి రేట్లకు బయ్యర్లు కొనడానికి ముందుకు వచ్చి అడ్వాన్స్ లు కూడా ఇచ్చి వెళ్లారు. అడ్వాన్స్ ఇవ్వని ఏరియాల విషయంలో కూడా ఓ మాట అనేసుకుని ఆ ఏరియాలను కూడా ఖాయం చేసుకుని వెళ్లారు. కట్ చేస్తే.. తీరా సినిమా విడుదల దగ్గర పడేసరికి.. బయ్యర్లు మాట మార్చారు. ముందుగా మాట్లాడుకొన్న మొత్తం కాకుండా అందులో కొంత తగ్గిస్తామంటూ మెలిక పెట్టారు.
‘ఇది కరెక్ట్ కాదు సర్.. మీరు మొదట మేము చెప్పిన రేటుకు కొనడానికి అంగీకరించారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఉన్నట్టు ఉండి తగ్గిస్తానంటే ఎలా కుదురుతుంది ?’ అని నిర్మాతలు నిలదీయడంతో… అప్పుడు ఆ బయ్యర్లు అసలు విషయాన్ని బయటపెట్టారు. ‘ఏమీ లేదు సర్. మీ సినిమా పై మాకు నమ్మకం లేదు. మీ సినిమాని కొని మేం నష్టపోలేం’ అంటూ నసిగారు. ఎందుకు మా సినిమా పై మీకు నమ్మకం పోయింది అని అడిగితే,
‘మీ సినిమా కంటే ‘ఒక్కడు చాలు’ చాలా బాగుందని మీ హీరో రాజశేఖర్ గారే స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే మీరు రేటు తగ్గించి ఇవ్వాల్సిందే’ అంటూ బయ్యర్లు డిమాండ్ చేశారు. ఆ మాట విని నిర్మాతలకు కళ్ళు తిరిగాయి. మన హీరోనే మన సినిమా బాగాలేదని పబ్లిసిటీ చేసి బిజినెస్ చెడగొట్టడా ? అని నిర్మాతలు కుమిలిపోయారు. కట్ చేస్తే.. ‘ఒక్కడు చాలు’ సినిమా కంటే, ‘మనసున్న మారాజు’ సినిమానే బాగా ఆడింది. అప్పట్లో రాజశేఖర్ ఇలాంటి పనులు చేసేవారు. ఏది ఏమైనా హీరో రాజశేఖర్ చేసిన పనికి నిర్మాతలకు గుండె ఆగినంత పని అయింది.