Ravi Teja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రవితేజ(Mass Maharaja Raviteja), తన కష్టం మీద స్టార్ హీరో గా ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయం అనే చెప్పాలి. కానీ సంపాదించుకున్న ఆ స్టార్ స్టేటస్ ని కాపాడుకోవడం లో రవితేజ దారుణంగా విఫలం అయ్యాడు , అందులో ఎలాంటి సందేహం లేదు. ‘మిరపకాయ్’ చిత్రం తర్వాత రవితేజ చేసిన ప్రతీ చిత్రంలోను ఆయన వింటేజ్ యాంగిల్ ని మిస్ అయ్యేలా చేసింది. ‘మిరపకాయ్’ తర్వాత మంచి కమర్షియల్ హిట్స్ పడ్డాయి, కానీ అంతకు మించిన డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా పడ్డాయి. ఫలితంగా ఆయన మార్కెట్ పూర్తిగా దెబ్బ తినింది. స్టార్ హీరోగా రికార్డులు సృష్టించే స్థాయిలో ఉండాల్సిన రవితేజ, నేడు మీడియం రేంజ్ హీరోల లీగ్ లో ఉండడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. ‘ధమాకా’ చిత్రం తర్వాత ఆయన ఏకంగా 7 సినిమాలు, 7 కూడా ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి.
రీసెంట్ గా విడుదలైన ‘మాస్ జాతర’ కూడా కమర్షియల్ గా మరో డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమా ఫ్లాప్ రవితేజ ని ఆలోచనల్లో పడేలా చేసింది. ఇక మీదట కెరీర్ విషయం లో జాగ్రత్తలు తీసుకోకపోతే మనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా కరువు అవుతారు అనే విషయాన్నీ గుర్తించాడు. అందుకే ఇక పై రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా, నేటి తరం ఆడియన్సు అభిరుచికి తగ్గ సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు. అంతే కాదు ఈమధ్య కాలం లో ఆయన వరుసగా కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. కానీ ఇక నుండి మినిమం గ్యారంటీ డైరెక్టర్స్ తో మాత్రమే పని చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన కిషోర్ తిరుమల, కళ్యాణ్ శంకర్, శివ నిర్వాణ వంటి దర్శకులను ఎంచుకున్నాడు.
కిషోర్ తిరుమల తో ఆయన చేస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. అదే విధంగా కళ్యాణ్ శంకర్ తో సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు. ఇక శివ నిర్వాణ తో చేస్తున్న సినిమా, కాస్త డిఫరెంట్ గా ఉండనుంది. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. ఈ చిత్రం లో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రవితేజ తన కూతురిని రక్షించుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్దపడే తండ్రిగా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అదే విధంగా కాంతారా సిరీస్ కి అద్భుతమైన మ్యూజిక్ ని అందించినా అంజనీష్ లోకనాధ్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.