Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) విడుదలకు కూడా నోచుకోలేనంత దీనమైన స్థితికి పడిపోతుందని నందమూరి అభిమానులు కలలో కూడా ఊహించలేదు. ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా, నిర్మాతకు ఉన్న పాత ఆర్ధిక లావాదేవీల కారణంగా, కోర్టు కేసు వేయడం వల్ల సినిమా విడుదలను ఆపేయాల్సి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన తర్వాత ఒక సినిమా ఇలా ఆగిపోవడం ఈమధ్య కాలం లో ఎప్పుడూ జరగలేదు. జూన్ లో విడుదల అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ఇదే గతి పట్టింది. కానీ అప్పటికి కేవలం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు.
కానీ ఇక్కడ పరిస్థితి వేరే, తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై లక్షకు పైగా టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. మరికాసేపట్లో సినిమా అనగా వాయిదా పడింది. ఆర్ధిక సమస్యలు తొలగిపోయి, ఈరోజు కాకపోతే రేపు అయినా సినిమా మన ముందుకొస్తుంది అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇప్పట్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదట. ఎందుకంటే EROS కి ఇవ్వాల్సిన 60 కోట్ల రూపాయలతో పాటు, పాత సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా తమకు రావాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు సినిమా ని విడుదల చేసేందుకు వీలు లేదని కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారట. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం కచ్చితంగా డిసెంబర్ 12 న విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 25 వరకు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ డిసెంబర్ 25 కూడా మిస్ అయితే, ఇక సంక్రాంతికి రావాల్సిందే అని అంటున్నారు.
సంక్రాంతికి ఇప్పటికే 5 సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ రాజా సాబ్ చిత్రం తో పాటు, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలకు థియేటర్స్ ని సర్దుబాటు చేయడానికే బయ్యర్స్ కి తలప్రాణాలు తోకకు వస్తాయి. అలాంటిది ఆరు సినిమాలకు థియేటర్స్ ని సర్దుబాటు చేయడం అసాధ్యమైన పని. అందులో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవి, ఆ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 300 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి ‘అఖండ 2’ విడుదల అయితే డిసెంబర్ 25 న కానీ, లేదా అంతకంటే ముందు కానీ విడుదల అవ్వాలి. లేదంటే ఇప్పట్లో విడుదల కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.