Homeఎంటర్టైన్మెంట్Garikapati- Chiranjeevi: గరికపాటిని గందరగోళం చేసిందెవరు ?

Garikapati- Chiranjeevi: గరికపాటిని గందరగోళం చేసిందెవరు ?

Garikapati- Chiranjeevi: ఓ ఉన్నత ఆశయంతో, ముఖ్యమైన కార్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఓ ప్రముఖుడు ఊరిలోకి వస్తున్నాడు. ఇన్నాళ్లకి మన ముందుకు వస్తున్నాడు. మనం ఘనస్వాగతం పలికి, గుండెల్లో పెట్టుకుందాం – అని ఆ ఊరు ఊరంతా దండలు పట్టుకొని, దండాలు పెట్టుకుంటూ తండోపతండాలుగా బారులు తీరింది. ఇంతలో ఓ పది మంది ఆ మధ్యలోంచి తోసుకొచ్చి, మావోడు వస్తున్నాడు, మేమే ముందు- అంటూ మిగతా వాళ్లను నెట్టుకుంటూ ముందుకెళ్లి ఆ ప్రముఖుణ్ని చుట్టుముట్టేశారు. ఆయనకేమో అలవికాని మొహమాటం. అంతకు మించి సున్నిత స్వభావం. చుట్టూ ఉన్న ఆ పది మందిని నొప్పించలేక, మిగతా జనాన్ని ఒప్పించలేక – ఎక్కడికో వెళ్లాల్సిన మనిషి కాస్త ఎక్కడి వాడు అక్కడే ఉండిపోయాడు. ఇది నిన్నటి చారిత్రక వాస్తవం. ఆ పది మందికీ మితిమీరిన అభిమానం. ఆయనకేమో చెప్పలేనంత మొహమాటం. అందుకే, ఆ అతి కొద్ది మందే కలుపుకొని పోవడానికి బదులు… ఒట్టి పుణ్యానికి కెలుక్కొని పోతుంటారు కొన్నిసార్లు ! అయినా ఇదంతా ఇప్పుడెందుకు ! పురాణం చెప్పబోతే దారుణంగా తిడుతున్న రోజులివి. విషయం మాట్లాడుకుందాం.

Garikapati- Chiranjeevi
Garikapati- Chiranjeevi

అలాయ్ బలాయ్ ప్రముఖుడు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన వేదిక మీద పురాణ విలువలు బోధించే ప్రవచనం ఉండాలనుకోవడం ఉదాత్తమైన ఆలోచన. అదే వేదిక మీద కొత్తగా మార్కెట్ లో సినిమా రిలీజైన చిరంజీవి కూడా ఉండే సరికి ఊహించని చిక్కొచ్చి పడింది. దత్తాత్రేయ బంధుగణం వేదిక మీద చిరంజీవితో ఫోటో కోసం ఎగబడ్డారు. అభిమానం అంటాం దాన్ని ! లెట్స్ డు కుమ్ముడు అనుకొని, కాదనలేక ఆయన ఫోటో దిగుతుంటే, ఈలోగా గరికపాటి ప్రవచనం మొదలవుతుందని చింతల రామచంద్రారెడ్డి ప్రకటించడంతో చిక్కొచ్చి పడింది. నాకు ఆలస్యం అయిపోతోంది, ఇలాగే చిరంజీవి గారు ఫోటోలు దిగుతూ ఉంటే నేను వేదిక దిగిపోతా అనే ధోరణిలో గరికపాటి వారు స్పందించడం లైవులో కనిపించింది. ఫోటోలు దిగడం ఆయనకి ఎంత సర్వసాధారణమో, సుతిమెత్తగా ఆలస్యాన్ని తనదైన స్టైల్లో పరిహరించడం కూడా గరికపాటికి అంతే సహజం. ఫోటోలు తర్వాత చిరునవ్వుతో చిరంజీవి వచ్చి అదే గరికపాటితో సరదాగా సంభాషించడం, కార్యక్రమం కొనసాగడం అన్నీ జరిగిపోయాయ్. అంటే వారిద్దరికీ ఏ చింతా లేదు. కానీ అంతోటి అభిమానగణం ఉన్న అన్నయ్యను ఎంత మాట అనేశారో చూశారా అంటూ – నడి మధ్యలో వాడు కొక్కిరాయితనం బయటపెట్టుకోవడం వల్లే ఇప్పుడు గలాటా !

ఇతరులెవరూ ప్రత్యేకించి అవమానించలేని స్థాయికి చిరంజీవి చేరుకొని పదేళ్లు పైనే అవుతోంది. అయినా ఎప్పుడూ వెలితి పడటం కానీ, పరుషంగా మాట్లాడ్డం కానీ తెలియదు చిరంజీవికి ! టిక్కెట్ రేట్ల పెంచుకునే అవకాశం ఇవ్వమని ఆయన చేతులు కట్టుకొని అడుగుతాడు. సైరా మన సినిమా అని చేతులు జోడించి చెప్పి, ఇంటికెళ్లి ఒప్పిస్తాడు ఎవ్వరినైనా ! ఎదురు దెబ్బల్ని ఎదుర్కోవడం కూడా ఆయనకి సున్నితత్వంతో పెట్టిన విద్యే ! ఓసారి ఏదో అలా ట్రై చేశా, రాజకీయాలు మనకు కలిసి రాలేదు అని ఆయన ఓపెన్ గా చెప్పగలిగాడూ అంటే కారణం అదే. అదేంటి జస్ట్ ట్రై చేశా అనడం అంటే, నాన్ సీరియస్ కదా, ఆ 18 లక్షల మంది ఓటర్లను తక్కువ చేసినట్టుగా కదా – అని ఎవరైనా అంటే కూడా ఆయన స్పందించడు. ఎందుకంటే అనవసరమైన విషయాలు పెద్దగా పట్టించుకునే తత్వం కాదు ఆయనది. అలాగే విజయం నాదీ, వైఫల్యం నీది అని పంచి పెట్టగల పెద్దరికం ఆయనకున్నది. కొంత డౌట్ ఉంటే కొరటాలను అడగండి.

అయినా అది ఎవ్వరినెవరూ అవమానించడానికో, స్థాయిలు నిర్ణయించి తూకం వేయడానికో వేదిక కానే కాదు.అసలు అలాయ్ బలాయ్ అంటేనే కలిసి మెలిసి గలే మిలాకే బతకాలని ! అలాంటి వేదిక మీద ఇలాంటి రగడ రలిగించడం నిజంగా సంకుచితత్వమే ! అమ్మా నాకు సమయం మించిపోతోంది, మీరు త్వరగా పేరంటాలు ముగిస్తే నేను మొదలు పెడతాను – అనడం గరికపాటి ప్రవచనాల్లో భాగం. లైవ్ చూసే అలవాటున్న వారిలో చాలా మందికి తెలుసు ఈ సంగతి. అలాయ్ బలాయ్ లో కూడా అదే జరిగింది. చిరంజీవి గారూ మీరు ఫోటోలు ఆపితే నేను మొదలు పెడతా అనడంలో ఆంతర్యం అదే ! అసూయో, అనసూయో కారణం కాదు. ఈ సంగతి స్పష్టంగా తెలుసును కాబట్టే చిరు నవ్వుతో చిరంజీవి వచ్చి సముదాయింపుగా మాట్లాడ్డం, కార్యక్రమంగా సాగడం జరిగిపోయాయ్. ఆనక ఎందుకీ పంచాయతీ ?

Garikapati- Chiranjeevi
Garikapati

పురాణాల్ని, వైదిక ప్రబంధాలను ప్రాపంచిక విషయాలతో మేళవించి సాధారణ ఆలోచనలకు అందించడమే ప్రవచనం. డొక్క శుద్ధి, ధారణ, పురాణ ప్రకర్ష, వర్తమాన విజ్ఞానం, మాటకారితనంతోపాటు మొహమాటంలేని ముక్కు సూటితనం కూడా అవసరం దానికి. మూడు దశాబ్దాలుగా గరికపాటి సాహితీ ధార్మిక అభినివేశం తెలుగు నేలకే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో తెలుగు వాళ్లకి నేరుగా తెలుసు. ఇప్పుడు గరికపాటికి కొత్తగా వీరతాళ్లు వేయక్కర్లేదు. ఉన్నతాళ్లు తెంపక్కర్లేదు. సంబోధనలో సంస్కారం బయటపడుతుందన్న విచక్షణా జ్ఞానం ఉంటే చాలు. గరిక, పిలక లాంటి పదాలు ఆయన మర్యాదను తగ్గించలేవు. మన మానసిక స్థితిని ప్రపంచానికి చూపెడతాయంతే ! అయినా పాండిత్యాన్ని సత్కరించకపోయినా సంస్కారంగా చూసుకోవడం, మన విశిష్టతలను, మన జాతి ఖ్యాతిని దిగంతాల వరకూ వ్యాపింపజేసిన ప్రముఖులను గౌరవించుకోవడం లాంటివి మనం ఎప్పుడో మర్చిపోయాం. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని గానామృతంలో ఓలలాడించిన బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని చెత్తలో పడేసిన సంస్కారాన్ని మరవక ముందే ఓ ప్రవచనకారుడిపై కారుకూతలు కూయడం వింటున్నాం, చూస్తున్నాం. మన జాతి గీత ఇలా ఎందుకు ఉందనేందుకు ఇలాంటివే ఆనవాళ్లు. గీటురాళ్లు.

ఒక్కటి తెలుసుకోవాలెవరైనా ! ప్రవచనకారుడికి తన ముందు ఆశీనులైనది ఎవరైనా ఒక్కటే. సాధారణ ప్రజ ఉన్నా, ప్రధాని ఉన్నా, రంగుల హంగుల ఆకర్షణలున్న ఇంకెవరైనా సంబోధన భారతీయ విలువలకు, రాజ్యాంగ విశేషణాలకు లోబడి మాత్రమే ఉంటుంది. ఇది వాస్తవం. మేం అన్నిటికీ అతీతులం అనో, లేదంటే వివాదం చేస్తే మరికాస్త ప్రచారం వస్తుందనో నడిమధ్య గాళ్లు కొందరు రాళ్లు రువ్వుతారు. అర్థం చేసుకోవాలి తప్ప ఆవేశపడక్కర్లేదు. ఇలాంటి సందర్భాల్లో, అనవసర వివాదాలు తలెత్తుతున్న వేళల్లో నేరుగా చిరంజీవి స్పందించిన దాఖలాలు లోగడ చాలానే ఉన్నాయ్. నేటి తరానికి ఆధ్యాత్మిక సుగంధాన్ని పంచుతూ, విలువల విశిష్టతను తెలియజెబుతున్న గురు సమానుడి విషయంలో ఇప్పుడు వివాదం రేపడం విచారకరం. అసలు అక్కడ జరిగింది ఇదీ – అంటూ చిరంజీవి తనదైన తరహాలో సున్నితంగా స్పందిస్తే బావుంటుందనేది వాస్తవం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular