England Bazball Approach: టి20 మెన్స్ వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టును .. వన్డే సీరిస్ లో వైట్ వాష్ చేసి ఆస్ట్రేలియా టీం నేలకు దించింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ మొదలయ్యాయి. టి20 కప్ ను అదృష్టం కొద్దీ గెలిచిందని ఇంగ్లాండ్ టీం పై మీమ్స్ చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంగ్లాండ్ పాకిస్తాన్ వెళ్ళింది. పాకిస్తాన్ జట్టుతో రావల్పిండి మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. మాది అదృష్ట జట్టు కాదు. ఆటగాళ్లు ఉన్న జట్టు అని నిరూపించింది.

ben stokes, Brendon McCullum
సాహసోపేతం
పాక్ లోని రావల్పిండి మైదానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది బ్యాట్స్మెన్ కు స్వర్గధామం. ఈ మైదానంలో బ్యాటింగ్ కు దిగిన ఎవరైనా బౌలర్లను పిండి పిండి చేస్తారనే నానుడి ఉంది. దానిని ఈసారి కూడా ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ నిజం చేశారు. ఏకంగా ముగ్గురు బ్యాట్స్మెన్ సెంచరీలతో కదం తొక్కారు. తొలి ఇన్నింగ్స్ లో 657 పరుగులు చేశారు. ఒకానొక దశలో పాకిస్తాన్ బౌలర్లు నీరసపడిపోయారు. నిర్జీమైన పిచ్ పై వికెట్లు తీయలేక చేతులు ఎత్తేశారు. ఇదే అదునుగా ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. స్కోర్ 500 పరుగులు దాటిన తర్వాత ఇంగ్లీష్ టీం ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసేందుకే సిద్ధమయ్యారు. అలా ఆడి ఆడి 657 పరుగులు చేశారు.
పాకిస్తాన్ కూడా..
తర్వాత బ్యాంటింగ్ కు దిగిన పాక్ కూడా టీ 20 ఫలితం పునరావృతం కాకూడదని కసితో ఆడింది. ఆ దేశ బ్యాట్స్ మెన్ 579 పరుగులు చేశారు. ఇందులో ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేశారు. కానీ చివర్లో తడబడ్డారు. 78 పరుగులు వెనుక పడ్డారు. ఇలా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో ఫలితం రావడం దాదాపు అసాధ్యం. తలలు పండిన నిపుణులు కూడా ఇదే చెబుతారు. కానీ ఇంగ్లీష్ టీం దీనిని తిరగ రాసింది.
బేజ్ బాల్ క్రికెట్
సాధారణంగా టెస్ట్ క్రికెట్ లో ఓవర్ కు 2 నుంచి 3 మధ్యలో రన్ రేట్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ టీం ఓవర్ కు 6నుంచి 7 రన్ రేట్ తో టీ 20 మ్యాచ్ లాగా ఆడింది. అందువల్లే ఇంతటి భారీ స్కోర్ సాధ్య మైంది. దీనిని క్రికెట్ పరి భాషలో బేజ్ బాల్ క్రికెట్ అంటారు. అంటే ఏటికి ఎదురు ఈదడం అన్న మాట. ఎలాంటి పరిస్థితులోనైనా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఉండటం.. రిస్కు చేసేందుకు ఇష్టపడటం ఈ ఆట తీరు లక్షణాలు. ఇలాంటి ఆట తీరు ఇంగ్లాండ్ ఈ మధ్య టి20 క్రికెట్ మ్యాచ్ లో ప్రదర్శించింది. ముఖ్యంగా ఇండియా టీం తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో వికెట్ నష్టపోకుండా విజయాన్ని సాధించింది. ఇప్పుడు పాక్ తో టెస్ట్ ను కూడా టీ 20 మాదిరి ఆడి బేజ్ బాల్ క్రికెట్ కు కొత్త అర్థం చెప్పింది.

ben stokes, Brendon McCullum
రెండో ఇన్నింగ్స్ లోనూ
78 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని మరింత పెంచేందుకు ఇంగ్లాండ్ టీం మరింత బలంగా ఆడింది. వరుసగా వికెట్లు కోల్పోయినా బ్రూక్, రూట్ ఆదుకున్నారు. జట్టు 264 పరుగులు చేయడంతో కీలకపాత్ర పోషించారు. ఇక్కడే ఇంగ్లీష్ టీం ఇన్నింగ్స్ కు డిక్లేర్ ఇచ్చింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ తడబడింది. మధ్యలో కొంచెం పుంజుకుంది. చివరిలో ధాటిగా ఆడబోయి వికెట్లు సమర్పించుకుంది. టీ20 కప్ అప్పగించిన చేతులతోనే.. మొదటి టెస్ట్ ను కూడా ఇంగ్లాండ్ చేతుల్లో పెట్టింది. ఇంగ్లాండ్ ఈ స్థాయిలో అసమాన ఆట తీరు ప్రదర్శించేందుకు ప్రధాన కారణం ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్ కల్లం. ఈ మాజీ న్యూజిలాండ్ ఆటగాడు… ఇంగ్లాండ్ జట్టు కోచ్ గా నియమితుడైన తర్వాత ఆ జట్టు ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. బ్యాట్స్మెన్ దాటిగా ఆడుతున్నారు. బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదులుతున్నారు.. ఒక జట్టుకు ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇప్పుడు ఆ జట్టుకు మెక్ కలమ్ కూడా అదే ఇస్తున్నాడు.