AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటో తారీఖున ఠంచ్ గా జీతం. అవసరం వచ్చినప్పుడు రుణాలు, ఏడాదికి ఒకసారి బోనస్ లు, ఇంక్రిమెంట్లు, వేతన సవరణలు.. ఇలా అన్నిరకాల బెనిఫిట్స్ లభిస్తాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత క్రేజ్. చివరకు పిల్లను ఇచ్చేవారు సైతం ప్రభుత్వ ఉద్యోగం అయితేనే ప్రాధాన్యిమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగిని వెతికి మరీ పట్టుకొని సంబంధాలు కలుపుకుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యం కలిగిన ప్రభుత్వ ఉద్యోగాన్ని జగన్ సర్కారు చులకన చేసింది. వారికి అంత మొత్తంలో జీతాలు ఎందుకు అనుకుందో ఏమో తెలియదు కానీ.. ఒకటో తేదీన జీతం అన్నమాట మరిచిపోయేలా చేస్తోంది. మూడో వారం దాటే వరకూ జీతాలు చెల్లిస్తూనే ఉంది. గత కొద్దినెలలుగా ఇదే జరిగింది. చివరకు జనవరి పండుగ నెల అని తెలిసి కూడా అదే రీతిలో వ్యవహరించింది. ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం దాటుతున్నా.. 30 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించగలిగింది. ఇంకా 70 శాతం మంది వేతనజీవులు బ్యాంక్ ఖాతాల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

AP Government Employees
వేతన జీవులు గుర్తించుకునేది ఒకటో తారీఖు. అదే తేదీన బ్యాంక్ ఖాతాల్లో జీతాలు జమ అవుతాయి. పాలవాడి నుంచి పేపరు బిల్లుల దాకా.. రేషన్ షాపు నుంచి పిల్లల ఫీజుల వరకూ అదే తేదీన చెల్లింపులు చేస్తారు. ఆర్థికపరమైన అన్ని అంశాలు అదే తేదీ చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే ఉద్యోగులు ‘అమ్మో ఒకటో తారీఖు’ అని సంబోధిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యం కలిగిన ఒకటో తారీఖు చరిత్రను జగన్ సర్కారు చెరిపేసింది. ఆ తేదీన చెల్లించాల్సిన జీతాలను నెలలో మూడో వారంలో చెల్లిస్తోంది. పింఛనుదారులకు చుక్కలు చూపిస్తోంది. శేష జీవితంలో ఉండే వారు పింఛను మొత్తం ఆసరా. మందుల నుంచి రోజువారి ఖర్చుల వరకూ అదే వారికి ఆధారం. వారికి కూడా నెలల మూడో వారం దాటితే కానీ చెల్లించలేని స్థితికి ఏపీ సర్కారు జారుకుంది.
ఇప్పటివరకూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసే ఉద్యోగులను చూసుంటాం. కానీ ఫస్ట్ టైమ్ జీతాల కోసం రోడ్డెక్కే రాష్ట్రం ఏపీ కావడం జాతీయ స్థాయిలో పరువు పోయింది. ‘సకాలంలో జీతాలు ఇప్పించండి మహా ప్రభో.. ఈ విషయంలో చట్టం చేయండి’ అంటూ ఉద్యోగులు గవర్నర్ కు విన్నవించే వరకూ పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. గత కొద్ది నెలలుగా ఓపిక పట్టామని.. ఇక కుదరదంటూ ధైర్యం పోగుచేసుకొని ఉద్యోగులు రాజ్ భవన్ కు వెళ్లి ఫిర్యాదుచేశారు. ఇలా రాజ్ భవన్ కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులను శూల శోధన చేసి.. తప్పిదాలను బయటకు తీసి మరీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కానీ జీతాలు సకాలంలో చెల్లించే ఏర్పాట్లు చేయకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

AP Government Employees
ఇప్పుడు మిగిలిన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్నట్టు సమాచారం. అదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయం ఓడీకి జమ అవుతుంది. అవి పూర్తయితే కానీ ఉద్యోగుల జీతాలు జమ చేయలేని పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విధించిన రుణ పరిమితిని ఏపీ దాటేసింది. గత నెలలో పోర్టుల పేరుతో కార్పొరేషన్ నుంచి రూ.5 వేలు కోట్లు అప్పుచేసింది. కానీ వాటిని వివిధ పద్దుల కింద దారి మళ్లించేసింది. అటు ప్రభుత్వ భవన పనులు చేపడుతున్న వారికి బిల్లులు చెల్లించలేదు. ఇటు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ఆర్బీఐ ఓడీ పోనూ మిగతా మొత్తాన్ని ప్రాధాన్యతక్రమంలో ఈ నెల చివరి వరకూ జీతాలు జమ చేస్తుందని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో భయంకర పరిస్థితులు ఉంటాయని.. మార్చి నెలలో జమ చేయాల్సిన జీతాలు ఏప్రిల్ వరకూ పొడిగించిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని చెబుతున్నారు.