Elon Musk: హాలీవుడ్ సినిమాల్లో చూశాం. పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా చూశాం. ఒక వ్యక్తి జ్ఞాపకాలను ఒక చిప్ లో అమర్చి, మరో మనిషి మెదడులో అమర్చుతారు. సినిమాటిక్ లిబర్టీ కాబట్టి దర్శకులు కొంచెం స్వేచ్ఛ తీసుకోవచ్చు గాక.. నిజ జీవితంలో అది సాధ్యమేనా అనే సందేహాలు మనలో చాలామందికి ఉంటాయి.. కానీ ఈ తరహా ప్రయోగాలు సినిమాలకే పరిమితం కాదు.. నిజ జీవితంలో కూడా కొన్ని సంస్థలు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ గా వ్యవహరించే ఈ తరహా సాంకేతికత పై ప్రయోగాలు చేస్తున్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ తో సంచనాలు సృష్టిస్తున్న ఎలన్ మస్క్ కూడా న్యూరాలింక్ అనే స్టార్టప్ ద్వారా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ఆరు నెలల్లో మనిషి మెదడులో చిప్ అమర్చే ప్రయోగాలకు సిద్ధమైనట్టు ఆయన ప్రకటించారు. ఇది పూర్తికాగానే తానే స్వయంగా ఒక చిప్ అమర్చుకుంటానని మస్క్ స్వయంగా వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది.

Elon Musk
ఇదీ న్యూరాలింక్ నేపథ్యం
శరీరానికి దెబ్బ తగిలితే చికిత్స ద్వారా, శస్త్ర చికిత్స ద్వారా నయం చేసుకునే అవకాశం ఉంటుంది.. మెదడుకు దెబ్బ తగిలితే? ఈ ప్రమాదంలోనో వెన్నెముక విరిగి మెదడు నుంచి శరీరానికి సంకేతాలను చేరవేసే వ్యవస్థ దెబ్బతింటే? అప్పుడు కచ్చితంగా మనిషి మంచానికే పరిమితం కావలసి ఉంటుంది. అలాంటివారికి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ పేస్ ల ద్వారా ఊరట కలిగించేందుకు మస్క్ 2016లో న్యూరా లింక్ స్థాపించారు.. ఇందులో జరిపే ప్రయోగాల కోసం తన సొంత డబ్బు వందల కోట్లు వెచ్చించారు. అయితే న్యూరాలింక్ లో తయారుచేసే ఇంప్లాంట్ల ద్వారా ఏదో ఒక రోజు పక్షవాత బాధితులు తమ ఆలోచనలతో స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేయగలిగితే తమకు అమర్చిన కృత్రిమ అవయవాలను కదపగలిగే సామర్థ్యాన్ని పొందుతారని మస్క్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆటిజం, స్క్రీజో ప్రోనియా వంటి సమస్యలను కూడా అధిగమించే వీలుంటుందని మస్క్ ఆలోచన. ఇదంతా శంకర్ సినిమాలా కనిపించినా న్యూరాలిక్ సంస్థ ఇప్పటికే ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించింది.
ఎలా పనిచేస్తుందంటే
న్యూరాలింక్ తయారు చేస్తున్న బ్రెయిన్ చిప్ పేరు ఎన్ 1. మన చేతికి పెట్టుకునే గడియారం డయల్ ముల్లు కన్నా చిన్నగా ఉంటుంది. న్యూరాలింక్ కంపెనీ తయారుచేసిన ఒక సర్జరీ రోబో ద్వారా దీనిని మనిషి మెదడులో అమర్చుతారు.. ఇప్పటినుంచి ఇది మన మస్తిష్కం లోని ఆలోచనలు మొత్తం గ్రహిస్తుంది. మెదడులో జరిగే కదలికలను రికార్డు కూడా చేస్తుంది.. కదిలే సామర్థ్యం లేని వారు కదిలేలా చేస్తుంది.. వారు చెప్పాలి అనుకున్న విషయాలను మాట్లాడకుండానే కంప్యూటర్ వంటి పరికరాల సహాయంతో ఎదుటివారికి చేరవేయగలుగుతుంది.. మన తల వెంట్రుక మందంలో 20వ వంతు ఉన్న అత్యంత సూక్ష్మమైన వైర్లను ఈ చిప్ ద్వారా మెదడుకు అనుసంధానం చేస్తారు.. ఈ వైర్లలో 1024 ఎలక్ట్రోడ్లు ఉంటాయి.. ఇవి మెదడు కదలికలను గమనిస్తూ విద్యుత్ సంకేతాల ద్వారా ఉత్తేజితం చేస్తాయి. ఆ సమాచారాన్ని వైర్లెస్ విధానంలో చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఫోన్ వంటి పరికరాలకు సరఫరా చేస్తాయి.

Elon Musk
కథ ఇంకా చాలా ఉంది
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరిజ్ఞానం పై న్యూరాలింక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చాలాకాలంగా మరికొన్ని కంపెనీలు ఈ దిశగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. గణనీయమైన ఫలితాలు సాధించాయి.. బ్లాక్ రాక్ న్యూరో టెక్ అనే కంపెనీ వచ్చే ఏడాది కల్లా ప్రపంచంలోనే తొలి బీసీఐ వ్యవస్థను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామంటున్నది. సింక్రాన్ అనే మరో సంస్థ శాశ్వత బ్రెయిన్ ఇంప్లాంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇప్పటికే ఇప్పటికే ఎఫ్ డీ ఏ అనుమతులు పొందింది . పారాడ్రోమిక్స్ అనే మరో సంస్థ కూడా 2023లో బ్రెయిన్ ఇంప్లాంట్లకు సంబంధించి మనుషులపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది. సో హాలీవుడ్ సినిమాలు కావచ్చు, ఇస్మార్ట్ శంకర్ సినిమా కావచ్చు.. అవన్నీ కూడా కాల్పానిక కథలతో నిర్మితమవచ్చు. కానీ అవే రేపటి ప్రయోగాలకు నాంది పలికాయి. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్ అమర్చే దిశగా దారి చూపాయి. సినిమాలందు స్మార్ట్ సినిమాలు వేరయా.. డబ్బున్న వారిలో మస్క్ మామ వేరయా!?