Electric Cars In India: మనవాళ్లు ఆ కంపెనీ కార్లే ఎక్కువ కొంటున్నారట!
అమెరికా, చైనా తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ గా అవతరించింది. వ్యాపార విస్తరణకు భారత్ అనువుగా ఉండడంతో పెద్దపెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఆసక్తి చూపిస్తున్నాయి.

Electric Cars In India: చమురు ధర పెరిగిపోతుంది. సరే దాన్ని భరిద్దాం అనుకుంటే..నిర్వహణ ఖర్చు కూడా అదిరిపోతోంది. ఒక స్థాయిలో స్తోమత ఉన్న వాళ్లకు ఇది పెద్ద విషయం కాదు. అదే మధ్య తరగతి విషయానికొస్తే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత రోజుల్లో కారు అనేది లగ్జరీ కాకుండా నిత్య జీవితంలో ఒక ప్రధాన అవసరం అయిపోయింది.. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి..ఇదే సమయంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ అవసరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెరపైకి వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల కాలుష్యం అనేది ఉండకపోవడం, చమురు దిగుమతులు తగ్గడం, దానివల్ల విదేశీ మారకద్రవ్య నిల్వల మీద ఒత్తిళ్ళు తగ్గే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. పైగా వీటిని తయారు చేసే కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తోంది.
మూడో అతి పెద్ద మార్కెట్
అమెరికా, చైనా తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ గా అవతరించింది. వ్యాపార విస్తరణకు భారత్ అనువుగా ఉండడంతో పెద్దపెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే మార్కెట్ మరింత విస్తృతమైన అవకాశం ఉండడంతో.. పెద్ద పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని “ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్” అనే సంస్థ వెల్లడించింది..” ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్ అవతరించనుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం కాబట్టి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. పైగా భారత్లో ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉండదు. దీనికి తోడు ఇవి బ్యాటరీలు, ముడి సరుకు కోసం విస్తృతమైన మార్కెట్ ఏర్పరచుకోవచ్చు. భవిష్యత్తులో భారత్ నెంబర్ వన్ ఇవి మార్కెట్ గా అవతరించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని” ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. ఇక గత ఏడాదిలో మొత్తం తేలికపాటి వాహన విక్రయాలలో కార్ల వాటా రెండు శాతం కంటే తక్కువ ఉంది. 90% వాటాను ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రి చక్ర వాహనాలు కలిగి ఉన్నాయి. అయితే బలమైన వృద్ధి సామర్థ్యం ఉన్నప్పటికీ తగిన చార్జింగ్ పాయింట్లు ఉంటేనే కార్ల విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తే ఇక తిరుగు ఉండదు.
80% కంటే ఎక్కువ
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి టాటా మోటార్స్ అన్నింటికంటే ముందు వరుసలో ఉంది. మార్కెట్లో 80 శాతం కంటే ఎక్కువ వాటాను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. ఎస్ ఏ ఐ సీ మోటార్ కార్ప్, హ్యుందాయ్, మహీంద్రా వంటి సంస్థల నుంచి పోటీ ఉన్నప్పటికీ టాటా మోటార్స్ బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఆసియాలోని చాలా దేశాలు ఇవి రంగానికి అనువైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇండోనేషియాలో నికెల్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ఈ నికెల్ ద్వారా బ్యాటరీలను తయారు చేస్తారు. చైనా, కొరియా, జపాన్ లో ఈవీ ల తయారీకి కావలసిన సాంకేతికత పుష్కలంగా ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకరమైన నగరాలు మన దేశంలో ఉన్న నేపథ్యంలో ఈవీ ల వాడకం వల్ల అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఎలక్ట్రిక్ వాహనాల పట్ల సాధారణ ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీటి విక్రయాలు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.
