Electric Cars: ఈ_ కారు.. యమ జోరు

పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే సంప్రదాయ ఇంధన కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్లను ఇప్పుడు వినియోగదారులు అమితంగా ఇష్టపడుతున్నారు. ఎలక్ట్రిక్‌ కార్లు సౌకర్యంగా ఉండటం, ప్రయాణానికి అయ్యే వ్యయం తక్కువగా ఉండటంతో ఈ-వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

  • Written By: Bhaskar
  • Published On:
Electric Cars: ఈ_ కారు.. యమ జోరు

Electric Cars: పెట్రోల్ ధర పెరుగుతోంది. డీజిల్ ధర చుక్కలు చూపిస్తోంది. అలాగని బండి నడపకుండా ఉండలేం. కారు తోలకుండా ఉండలేం. బతుకు బండి సాగాలి అంటే వీటి అవసరం మనిషికి అత్యవసరం. ఈ ధరల మీద మన్ను వడ ఇంత గనం పెరుగుతున్నాయి అని మనసులో తిట్టుకోవడం తప్ప సామాన్య మానవులు చేసేది ఏమీ ఉండదు. ఇంధన ధరలు ప్రభుత్వాల ఇష్టం కాబట్టి.. ఖజానా నింపుకునేందుకు ఏవైనా చేస్తాయి…ఎలాగైనా వ్యవహరిస్తాయి. ఓటు వేసిన పాపానికి సగటు ఓటర్లు ఆ మాత్రం అనుభవించాల్సిందే అనే తీరుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. సరే ఇదంతా పక్కన పెడితే భవిష్యత్తు రోజుల్లో ఇంధనంతో నడిచే వాహనాలు తగ్గిపోవచ్చు. ధరలు పెరుగుతున్నాయనే బాధలు సామాన్య మనుషులకు ఉండకపోవచ్చు.

వాటిని ఇష్టపడుతున్నారు

పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే సంప్రదాయ ఇంధన కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్లను ఇప్పుడు వినియోగదారులు అమితంగా ఇష్టపడుతున్నారు. ఎలక్ట్రిక్‌ కార్లు సౌకర్యంగా ఉండటం, ప్రయాణానికి అయ్యే వ్యయం తక్కువగా ఉండటంతో ఈ-వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రోత్సాహకాలను ప్రకటించడంతో వినియోగదారుల దృష్టి ఈ-వాహనాల వైపు మళ్లింది. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు పలు ప్రోత్సాహకాలను కల్పిస్తూ 2020-2030 ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పూర్తిగా ఎత్తేసింది. మొదటగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే 500 ఎలక్ట్రిక్‌ బస్సులు, 5 వేల మోటారు కార్లు, 5 వేల ట్యాక్సీలు, 20 వేల ఆటోలు(జీహెచ్‌ఎంసీ పరిధిలో వెయ్యి, జిల్లాల్లో 19 వేలు), 10 వేల చిన్న తరహా వస్తు రవాణా వాహనాలు (ట్రాలీలు), 2 లక్షల బైక్‌లకు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలను మినహాయిస్తూ 2022 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలు పెరిగింది. మొదట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు ఫెయిల్‌ అవుతున్నాయని, కొన్ని చోట్ల పేలిపోతున్నాయనే వార్తలతో వినియోగదారులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా బ్యాటరీ తయారీ, ఛార్జింగ్‌ విధానంలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తున్నామని ఆయా సంస్థలు ప్రకటించడంతో వాహనాల కొనుగోళ్లు పెరిగాయి.

ప్రోత్సాహకం కోసం డిమాండ్లు..

సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రికల్‌ వాహనాల ధరలు 30-50శాతం వరకు అదనంగా ఉండటంతో కొనుగోళ్లు అంతగా ఉండకపోవచ్చని, ఐదారేళ్లలో ప్రభుత్వం కల్పించిన రాయితీ, ప్రోత్సాహకాలను వినియోగదారులు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారని అధికారులు అంచనావేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. 2023మార్చి నాటికే రవాణా శాఖలో 5వేల ఎలక్ట్రిక్‌ కార్లు ప్రభుత్వం అందించిన ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం మరో 2వేల ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రోత్సాహకం ఇచ్చేందుకు అనుమతించింది. రెండు నెలల్లోనే కోటా పూర్తి కావడంతో మరో వెయ్యి వాహనాలకు అనుమతించినట్టు ప్రకటించింది. జూలై మొదటి వారంలోనే ఆ కోటా పూర్తయింది. అయినప్పటికీ ఆ తర్వాత 882ఈ-కార్లు రిజిస్ట్రేషన్‌కు వచ్చాయి. ప్రోత్సహకాల కోటా పూర్తి కావడంతో తాజాగా వస్తున్న ఎలక్ట్రిక్‌ కార్లలో రూ.10లక్షలలోపు ఖరీదు చేసే వాహనాలకు 14శాతం, రూ.10లక్షలకు మించి ఖరీదు చేసే వాహనాలకు 17శాతం రోడ్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో మరో పది వేల ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రోత్సహకాలు ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వానికి రవాణా శాఖ నివేదిక పంపినట్టు తెలిసింది. మరోవైపు, గడిచిన జూన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇచ్చే సబ్సిడీని 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో కార్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా అది కొత్త వాహనాల కొనుగోళ్లపై ప్రభావం చూపలేదు. ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలో 1. మోటారు కార్లు 8,882, 2. మోటారు సైకిళ్లు.. 70,989, 3. మోటారు, మ్యాక్సీ క్యాబ్స్‌.. 1,481, 4. ఆటో రిక్షాలు.. 1,071,
5. గూడ్స్‌ వాహనాలు.. 3,442 రిజిస్ట్రేషన్ అయ్యాయి.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube