Corona Update in AP, Telangana: మరోసారి మహమ్మారి ముసురుకుంటోంది. తెలుగు రాష్ట్రాలపై కరోనా పడగ పరుచుకుంటోంది. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఆంక్షలు.. లాక్ డౌన్ దిశగా సాగుతోంది. ఏపీలో ఒక్కరోజులో 5వేలకు వరకూ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో రోజుకు 2వేలు అని చెబుతున్నా ఆ సంఖ్య ఎక్కువేనంటున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదు కావడం దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేసుల పెరుగుదల ఆగడం లేదు. మొదటి, రెండే వేవ్ కంటే ఈసారి కేసులు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఇక కరోనా నివారణకు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ సోకడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం వరకు 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 4,570 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో 1,963 నమోదయ్యాయి. అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రెండు రాష్ట్రాలు విభిన్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఈ సందర్బంగా అన్నివిద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి సెలవులు ఇచ్చారు. ఈనెల 17 నుంచి రీ ఓపెన్ చేయాలని నిర్ణయించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం సెలవును పొడగించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయిం తీసుకుంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. మరోవైపు సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో నైట్ కర్ఫ్యూ, ఆంక్షలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కేవలం విద్యాసంస్థలే కాదు, థియేటర్స్, మాల్స్ లకు కూడా సెలవులు ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: 18 ఏళ్లకే ఎంపీగా రికార్డు సృష్టించిన తెలుగమ్మాయి.. ఎక్కడంటే..?
కరోనా ఏపీలో ముఖ్యంగా చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో రోజుకు 1000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. తీవ్రత చూస్తుంటే ఇక్కడ లాక్ డౌన్ పెట్టేలానే కనిపిస్తోంది. ఇక మహానగరం హైదరాబాద్ లో ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. చాలా మంది కోవిడ్ బారినపడ్డ సామాన్యులు, ప్రముఖులు హైదరాబాద్ కు పోటెత్తుతుండడంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఫిబ్రవరి వరకూ థర్డ్ వేవ్ పతాక స్థాయికి చేరవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
ఇక ఏపీ విషయానికొస్తే తెలంగాణ కంటే రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థలను సోమవారం నుంచి రీ ఓపెన్ చేయిస్తోంది. సెలవులను పొడగించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు తెలిపారు. కరోనా జాగ్రత్తలతో విద్యాసంస్థలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమే కానీ.. అంతకంటే వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు నడుస్తాయని తెలిపారు. దీంతో సోమవారం నుంచి ఇక్కడి విద్యాసంస్థలు ఓపెన్ కానున్నాయి. అయితే విద్యాసంస్థల రీ ఓపెన్ పై కొందరు విమర్శిస్తున్నారు.
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల్లో అనేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కఠినం చేశాయి. బెంగుళూర్లో వీకెండ్ లాక్డౌన్ విధించారు. తెలంగాణలో నేటి కేబినేట్ మీటింగ్ తరువాత నిర్ణయం తీసుకోనుంది. తమిళనాడులో జనవరి 31 వరకకు 10,11, 12 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ రాష్ట్రంలో 20 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రతి శనివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఢిల్లీలోనూ వీకెండ్ కర్ఫ్యూ ప్రకటించారు.
దేశంలో మొత్తంగా 2 లక్షల 70 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించి కరోనా ఆంక్షలపై తీసుకునే చర్యలపై వివరించారు. ఆయా రాష్ట్రాల్లో అవసరమైతే ఆంక్షలు కఠినం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే వృద్ధులకు బూస్టర్ డోస్ ప్రకటించిన కేంద్రం త్వరలో మిగతా వారికి కూడా మూడో డోస్ పై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే జనవరి లాస్ట్ వీక్ వరకు పతాక స్థాయికి చేరి ఫిబ్రవరిలో అత్యధిక కేసులు నమోదవుతాయని అంటున్నారు. ఆ తరువాత కేసుల్లో తగ్గుదల కనిపిస్తుందని అంటున్నారు. కానీ ఈ వేవ్ పై అంచనా వేయలేమని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కొన్ని రోజుల పాటు వ్యక్తిగత ఆంక్షలు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: ‘ఇస్మార్ట్’గా రెమ్యునరేషన్ పెంచేసిన నిధి అగర్వాల్..!