AP Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంతో కేంద్రం సైతం డిసెంబర్లో ఎన్నికలకు సిద్ధమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

AP Early Elections: ఏపీలో ముందస్తుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోందా? ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు దేనికి సంకేతం? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అటు ప్రభుత్వ చర్యలు సైతం అనుమానాస్పదంగానే ఉన్నాయి. వాస్తవానికి ఏపీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ సైతం ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్గా మారింది. కేంద్రం సైతం ముందస్తుకు వెళుతుండడంతో.. దానిని అనుసరించడమే శ్రేయస్కరమని జగన్ భావిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంతో కేంద్రం సైతం డిసెంబర్లో ఎన్నికలకు సిద్ధమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. వినాయక చవితి తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దాదాపు 10 నుంచి 15 రోజులు పాటు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇవ్వడంతో మొదటి వారంలోనే ఆయన లండన్ వెళ్తున్నారు. వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేయనున్నారు. ముందుగా సెప్టెంబర్ 15న సచివాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించి సహచరులతో ముందస్తు ఎన్నికలపై జగన్ చర్చించనున్నట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఒకవేళ ముందస్తుకు వెళితే ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. దీంతో వీలైనన్ని కీలక బిల్లులకు మోక్షం కలిగించాలన్నది జగన్ అభిప్రాయం.
మరోవైపు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు ఎలక్ట్రోరల్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్టే. చాలామంది కీలక అధికారులు ఈసీ పరిధిలోకి వెళ్తారు. కేంద్రం డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళబోతుందన్న ప్రచారం జరుగుతున్న వేళ ఎలక్షన్ కమిషన్ చర్యలు చూస్తే.. ఏపీలో సైతం ముందస్తు సందడి ప్రారంభమైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
