AP Early Elections: ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాయి. అయితే అధికార పార్టీలోజరుగుతున్న పరిణామాలతో ముందస్తు సంకేతాలు వెలువడుతున్నాయి. 175 సీట్లను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోనూ. పార్టీలోనూ కీలక మార్పులు చేశారు. ఏకంగా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులపై ఫోకస్ పెట్టారు. మూడెంచల విధానంలో వడబోసి అభ్యర్థులను ఫైనలైజ్ చేయనున్నారు. ఇప్పటికే రెండు అంశాలపై అభ్యర్థుల జాబితాను వడబోశారు. ఇందుకు ఐ ప్యాక్ బృందం నివేదికలు, సర్వే సంస్థలతో ద్వారా తెప్పించుకున్న వివరాలు, ప్రభుత్వ నిఘాసంస్థల ద్వారా సేకరించిన వివరాలను క్రోడికరించి ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తుండడం ముందస్తు ఖాయమని తెలుస్తోంది. అటు తరువాత జగన్ ఢిల్లీ లో పెద్దలను కలవనుండడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

JAGAN
జీ20 శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది భారత్ లోనే జరగనుంది. దానికి సన్నాహక సమావేశం ఈ నెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. సమావేశానికి సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఇరువురు నేతల ఢిల్లీ షెడ్యూల్ సైతం ఖరారైంది. అయితే అంతకంటే ముందుగానే జగన్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడానికి డిసైడ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. అంతకంటే ముందుగానే జగన్ తన సొంత జిల్లా కడప టూర్ కు బయలుదేరుతుండడం, అటు నుంచి వచ్చిన వెంటనే పార్టీ వర్గాలతో సమావేశం, అటు తరువాత నేరుగా ఢిల్లీ వెళ్లడం వంటి పరిణామాలతో.. ఏదో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని అధికార పక్షంతో పాటు విపక్షాలు సైతం అనుమానిస్తున్నాయి.
ఎన్నికల వ్యూహాలను రూపొందించే పనిలో ఉన్న జగన్ అత్యున్నత సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో భేటీ కానున్నారు. ఇప్పటికే సమావేశానికి విధిగా హాజరుకావాలని అందరికీ ఆహ్వానాలు అందాయి. ఎన్నికలకు దిశా నిర్ధేశం చేయడానికే ఈ కీలక సమావేశమంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ అనుబంధ విభాగాలను, శ్రేణులను కలుపుకొని వెళ్లేందుకు ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసి పార్టీ బాధ్యుల చేతిలో పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పనితీరు పేలవంగా ఉండి, ప్రజల్లో మంచి అభిప్రాయం లేని సిట్టింగ్ లను మార్చనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిని తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. ఈ సమావేశంలో అటువంటి నేతల విషయంలో ఎటువంటి సంకేతాలు ఇస్తారోనని పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు ముందస్తు సంకేతాలుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేని వారి పేర్లు ప్రకటిస్తారన్న చర్చ నడుస్తోంది.

JAGAN
మరోవైపు ప్రధాన విపక్ష నేత చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆయన సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అటు చంద్రబాబు సైతం ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. అటు ప్రభుత్వ చర్యలు, ఇటు విపక్షాల హడావుడి చూస్తుంటే ముందస్తు తప్పదన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే దీనిపై కొందరు ప్రభుత్వ పెద్దలు మాత్రం ముందస్తుకు చాన్సేలేదని చెబుతున్నారు. పార్టీలో సమన్వయం ఏర్పాటుచేయడానికి మాత్రమే జగన్ సమావేశం నిర్వహిస్తున్నారని.. చాలాచోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని.. వాటిపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని.. కఠినంగా హెచ్చరించనున్నారని చెబుతున్నారు. అయితే వైసీపీ అత్యున్నత సమావేశంతో ఎన్నికలు ఎప్పుడన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.