Jagan-Chandrababu Naidu: జగన్ ని ఓడించడం అంటే చంద్రబాబుని సీఎం చేయడమా?
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి శ్రమించే బదులు తన పార్టీ బలాబలాలను అంచనా వేసుకొని ఒంటరిగా బరిలోకి దిగితే జనసేన భవిష్యత్తు మరింత మెరుగవుతుందనడంలో సందేహం లేదు.

Jagan-Chandrababu Naidu: ఎంత సేపు పొత్తులు, సీట్లు యేనా? ఒంటరిగా పవన్ ను ఎందుకు పోటీచేయడం లేదు? పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? గతం కంటే మెరుగయ్యామని చెబుతున్న జనసేన నేతలు టీడీపీ, బీజేపీ వెంట ఎందుకు పడుతున్నారు? బీజేపీకి పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకు రాష్ట్రంలో లేదు. కేంద్రంలో అధికారంలో ఉందని తప్పా. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల టీడీపీ బలపడుతున్నా, మూడో పార్టీ అవసరం కనిపిస్తూనే ఉంది. అయినా, పవన్ ఒంటరిగా వెళ్తానని మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారు. ఏమిటీ కారణం? ఎక్కడుంది లోపం? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఒకరిద్దరు నేతలు మాత్రమే పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు. గెలవలేమని తెలిసినా 2014లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలను కలుపుకొని బరిలోకి దిగారు. 2019లో అదే సీన్ రిపీట్ అయినా, పరిస్థితి కాస్త మెరుగుపడింది. అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయినా, పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. జనసేనకు వచ్చిన ఓట్ల శాతాన్ని మధించే అవకాశం దొరికింది. మొత్తంగా 7 శాతం ఓటు బ్యాంకు జనసేనకు వచ్చినట్లు నిర్థారణ చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 20 నుంచి 30 శాతం కూడా ఓట్లు పోలయినట్లు జనసేన నేతలు చెబుతున్నారు.
2019 తరువాత జనసేన పార్టీ రాష్ట్రంలో బాగా పుంజకుంది. పార్టీ కార్యకర్తలను ఎక్కువ మంది తయారయ్యారు. లక్ష మంది జనసైనికులు ఉన్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన ఎక్కడికి వెళ్లిన అశేష జనవాహిని వెంట వస్తున్నారు. అయినా, పొత్తు కోసం పార్టీల వద్దకు వెళ్తుండటంపై జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతిమంగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీలు నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలిసి వస్తున్నారు. రాష్ట్రంలోని ఏ పార్టీతో పొత్తు ప్రకటించకపోయినా, తెలుగుదేశంతో కలిసి వెళ్తారని ప్రచారం బాగా జరుగుతోంది. దీనిని ఫులిస్టాప్ పెట్టేప్రయత్నాలను పవన్ కల్యాణ్ చేయకపోవడం ఆ వాదనలకు బలం ఇస్తుంది.
కాగా, మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. 40 సీట్లు ఇస్తే పరిస్థితి మరోలా ఉంటుందని అన్నారు. ఇందుకు కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన వైనాన్ని వివరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీకి వెళ్తున్నట్లు మాత్రం చెప్పలేదు. కలిసి వచ్చే పార్టీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు బీజేపీతో వ్యతిరేకించారు. ఆయన ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేసి గెలుపొందారు. రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
కుమారస్వామి, కేజ్రీవాల్లా పవన్ కల్యాణ్ కూడా పోటీ చేయాలని జనసైనికులు కోరుకుంటున్నారు. గతం కంటే మెరుగ్గా ఉన్న ఆయన పార్టీకి ఈ సారి విశేషంగా ఆదరణ లభిస్తుంది. టీడీపీతో కలిసి వెళ్లకపోతేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీకి కాస్తా దూరం జరిగితే ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి పరీక్షించుకోవచ్చు. కమల దళంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఆ విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి శ్రమించే బదులు తన పార్టీ బలాబలాలను అంచనా వేసుకొని ఒంటరిగా బరిలోకి దిగితే జనసేన భవిష్యత్తు మరింత మెరుగవుతుందనడంలో సందేహం లేదు. త్వరలో ప్రజల్లో రాబోతున్న ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న రాజకీయ ఆసక్తి రాష్ట్రంలో నెలకొని ఉంది.
