ఆయనో డాక్టర్. ప్రాణాలు పోసే పవిత్రమైన వృత్తి. కానీ అతడో నరహంతకుడి అవతారమెత్తాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. తనలో కూడా ఓ రాక్షసుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆలినే కాదన్నాడు. అంతమొందించాడు. కర్కోటకుడిగా మారి తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. చివరకు కటాకటాలపాలయ్యాడు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకున్న తరుణంలో హతురాలి తల్లిదండ్రుల అనుమానంతో హత్య విషయం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది.
రావణగెరె జిల్లా న్యామాతి తాలూకా రామేశ్వర గ్రామానికి చెందిన శిల్ప(36), చెన్నేశప్ప(45) భార్యాభర్తలు. వీరికి వివాహమై దాదాపు 16 ఏళ్లు దాటింది. వృత్తి రీత్యా చెన్నేశప్ప వైద్యుడు. భార్య శిల్పకు లోబీపీ ఉంది. దీంతో మందులు వాడుతుంటారు. అయితే చెన్నేశప్ప డాక్టర్ అయినా మూఢ నమ్మకాలను విశ్వసిస్తుంటాడు. దీంతో అతడు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునే మార్గాల కోసం అన్వేషించాడు.
అతడికి ఓ క్షుద్ర పూజలు చేసే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి సలహా మేరకు ఓ వ్యక్తిని బలిస్తే డబ్బులు కుప్పలు తెప్పలుగా వస్తాయని చెప్పడంతో అతడి మాటలు నమ్మి ఎవరిని బలిద్దామని ఆలోచించాడు. చివరికి అతడి భార్యనే ఇవ్వాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా ఆమెకు ఉన్న అనారోగ్యాన్ని సాకుగా చూపి తన పని కానివ్వాలని భావించాడు. దీంతో ఆమెకు ఫిబ్రవరి 11, 2021న డెక్సామెథసోన్ అనే ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇచ్చాడు.
దీంతో ఆమె అపస్మార స్థితికి వెళ్లడంతో ఆస్పత్రికి తరలిస్తున్నట్లుగా నాటకం ఆడాడు. సగం దూరం వెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయిందని మళ్లీ వెనకకు తీసుకొచ్చాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ చేపట్టి నిందితుడు భర్తే అని తేల్చారు. చివరకు కటాకటాలపాలయ్యాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాలని కుట్ర పన్నిన కసాయి డాక్టర్ ఉదంతంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.