Pawan Kalyan- Chalam: సినిమా అంటే సాధారణ జనాలకు రంగుల ప్రపంచం, కానీ.. సినిమా వాళ్లకు అదే మొత్తం ప్రపంచం. బయట ప్రపంచంతో పోల్చుకుంటే.. వీరి ప్రపంచం చాలా చిన్నది. అందుకేనేమో ఎక్కువమంది నటీనటులు తమ నిజ జీవితంలో మోసపోయారు. బయట కుయుక్తులకు చిత్తు అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా వాళ్ళ జీవితాల్లో ఎన్నో కన్నీటి గాథలు చోటు చేసుకున్నాయి. తెర పై నవ్వులు పూయించిన ఎందరో జీవితాల్లో.. చివరకు కేవలం కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఈ కోవకు చెందిన నటుడే చలం. బహుశా ఈ తరం వారికి ఈయన పేరు కూడా తెలియకపోవచ్చు. కానీ.. నేటి పవన్ కళ్యాణ్ సైతం ప్రేరణగా నిలిచిన గొప్ప హాస్య కథానాయకుడు మన చలం. హాస్యరసానికి మొదటసారి హీరోయిజాన్ని అద్దిన ఘనత నటుడు చలం గారికే దక్కుతుంది. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్, తాను కొన్ని సార్లు చలం గారిని ఇమిటేట్ చేశాను అని చెప్పారంటేనే.. చలం గారి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.

Pawan Kalyan
చలం గారు 100 కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించారు. ఈయన అసలు పేరు కోరాడ సూర్యాచలం. రమణకుమారిని వివాహం చేసుకున్న తర్వాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నారు. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్న ఘనత కూడా చలం గారికే దక్కింది. తెరపై ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే చలం, నిజ జీవితంలో మాత్రం చాలా నిదానం. అందరికీ ఎంతో మర్యాద ఇచ్చేవారు. సినిమాల పై కూడా ఆయనకు అపారమైన నాలెడ్జి ఉండేది. ముఖ్యంగా సినిమాకి పాటలు ప్రాణం అని చలం భావించే వారు.
అందుకే, చలం గారి సినిమాల్లోని పాటల్లో దాదాపు హిట్లే కనిపిస్తాయి. పైగా నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చలంగారు రాణించారు. కాకపోతే, సొంత బ్యానర్లో చేసిన కొన్ని సినిమాలు దెబ్బతినడం వలన ఆర్ధికంగా బాగా చితికిపోయారు. డబ్బు పోయాక, ఆయన వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. నటి శారదతోనూ ఆయన కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఆమెతో ప్రేమ కూడా విఫలమే అయ్యింది. దాంతో చలం గారు మానసికంగా బాగా నలిగిపోయేవారు. దీనికి తోడు విపరీతమైన మద్యం అలవాటు. దాంతో ఆరోగ్యపరంగా కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయనకు చివరి రోజుల్లో చెప్పులు కూడా లేవు. రోజుకు ఒక పూట భోజనం కూడా దొరక్క బాగా ఇబ్బంది పడ్డారు. మనసుకు కష్టం కలిగించే విధంగానే చివరకు చలం గారి జీవితం ముగిసింది.

Chalam
చలం గారి విషాద ముగింపు గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆయన చేసిన సేవ, సాయం గురించి చాలా తక్కువమందికే తెలుసు. చలం గారు బాగున్న రోజుల్లో ఎంతో మందికి గుప్తదానాలు చేసేవారు. చాలామంది పేద విద్యార్థులను చదివించారు. చలం వల్ల లాభపడిన వాళ్లు వందల మంది ఉన్నారు. చలం గారిది పెద్ద మనసు. ఎన్నడూ తన జీవితంలో డబ్బు గురించి ప్రాకులాడలేదు. ఆయన ఎప్పుడు వ్యక్తిత్వాలే చూసేవారు. అందుకే.. ఆయన తన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నారు. ఏది ఏమైనా చలం గొప్ప నటుడే కాదు, గొప్ప వ్యక్తి కూడా.