Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కదలికలు.. అప్రూవర్ గా ఎంపీ మాగుంట
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం జాబితాలో ఉంది. గతంలో ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ ఎప్పుడు విచారణకు మాత్రం హాజరు కాలేదు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కి మళ్ళీ కదలికలు వచ్చాయి. కెసిఆర్ తెలంగాణకే పరిమితం కావడం.. బిజెపికి పెద్దగా విమర్శించకపోవడం.. ఈడి దూకుడు తగ్గించడంతో ఇక కేసు నీరుగారి పోతుందని అంతా భావించారు. కానీ గత వారం రోజుల నుంచి మళ్లీ కదలికలు ప్రారంభించింది. అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలో సైలెంట్ గా విచారణను మొదలుపెట్టింది. హవాలా లావాదేవీలు పై సమాచారం సేకరించింది. అయితే ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అప్రూవర్ గా మారడంతో సాధ్యమైందని.. ఆయన ఇచ్చిన సమాచారంతోనే తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కీలక విషయాల గుట్టు బయటపడినట్లు ఈడి మీడియాకు లీకులు ఇచ్చింది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం జాబితాలో ఉంది. గతంలో ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ ఎప్పుడు విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఆయన కుమారుడిని మాత్రం చాలాసార్లు పిలిచి అరెస్టు కూడా చేశారు. చాలాకాలం జైల్లో కూడా ఉన్నారు. అక్కడ కొద్ది రోజుల తర్వాత బెయిల్ లభించింది. అప్రువర్గా మారినట్లుగా కోర్టులో పిటిషన్ వేసి క్షమాభిక్ష కూడా తెచ్చుకున్నారు. అయితే మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు జాబితాలో ఉన్నా.. విచారణ, అరెస్టు వంతు మాత్రం ఎప్పుడూ లేదు.
తాజాగా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈడి ప్రశ్నించింది. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యుడికి చెందిన సన్నిహితుడు తో హవాలా లావాదేవీల పై పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను బయటపడేయడానికి ఒప్పందాలు జరిగిపోయాయని.. అందుకే అంతా సైలెంట్ అయిపోయారు అన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది. కానీ అనూహ్యంగా ఈడి మళ్లీ ఎంటర్ అయింది. కొద్ది రోజుల్లో ఈ స్కామ్ లో కీలక పరిణామాలు ఉంటాయన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలకు సంబంధించి కీలక వ్యక్తుల పేర్లు బయటకు వస్తుండడం విశేషం. అయితే ఇవి కేవలం లీక్ లేనా? రాజకీయంగా ఏదైనా సర్దుబాట్లు చేయాలనుకున్న తర్వాత.. చేసేసి సైలెంట్ కావడం పరిపాటిగా మారింది. ఈ కోవలోకి ఈ కేసు చేరుతుందా? లేదా? అన్నది చూడాలి మరి.
