Medico Manasa : మెడికో మానస మృతిలో కీలక మలుపు.. చిక్కిన సీసీటీవీ వైరల్ వీడియో
కానీ హాస్టల్ మారిన 15రోజులల్లోనే మానస ఆత్మహత్య చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మానస ఉంటున్న హాస్టల్ గది ముందు ఉన్న కిటికీలో ఓ డైరీ, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Medico Manasa : ఖమ్మంలో మమత మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్సు నాలుగో ఏడాది చదువుతున్న మానస ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదివారం హాస్టల్ గదిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం లో. ఈఘటనపై ఖమ్మం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు మనోవేదనే కారణమా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మానస ఉంటున్న హాస్టల్ గదిలో కీలక ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. హనుమకొండ జిల్లా కేంద్రం సమీపంలోని కిషన్‌పుర ప్రాంతానికి చెందిన సముద్రాల మానస(23) ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కాలేజీలో దంతవైద్య విద్య నాలుగో ఏడాది చదువుతూ స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తానుంటున్న హాస్టల్ గదిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె మృతదేహానికి ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సోమవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించగా.. వారు స్వగ్రామానికి తీసుకెళ్లి అంతయక్రియలు పూర్తిచేశారు.
ఇంతకీ జరిగిందేంటంటే..
చిన్నతనంలోనే మానస తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో మానస తండ్రి అజయ్‌కుమార్ తన భార్య చెల్లెలు ప్రణిత (మానస సొంత పిన్ని)ని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత 2008లో తండ్రి కూడా మృతి చెందారు. ఈ క్రమంలో మానస బాగోగులు చూసుకున్న పినతల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఖమ్మంలోని వైద్యకళాశాలలో డెంటల్ కోర్సులో చేర్చారు. ఈ నేపథ్యంలో మానస రెండేళ్ల పాటు కళాశాల సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉండి.. గత నెల 22న కళాశాలకు సమీపంలోని మరో హాస్టల్‌లో చేరి మూడో అంతస్తులోని ఓ గదిలో ఒంటరిగా ఉంటోంది. ఈ ఏడాది నాలుగోసంవత్సరం పూర్తవుతుండగా.. గతంలో కొన్ని సబ్జెక్టులో ఫెయిలైన మానస.. మరో 20 రోజుల్లో ఆ పరీక్షలు కూడా రాయాల్సి ఉంది. అయితే మళ్లీ ఫెయిలైతే తన పరువు పోతుందేమోనని స్నేహితులకు పలు మార్లు చెప్పి బాధపడిందని తెలిసింది. ఇక రెండురోజులుగా స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్లి కొద్ది సేపు మాట్లాడి తిరిగి హాస్టల్‌కు వస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన మానస సమీపంలోని ఓ పెట్రోల్‌బంక్‌కు వెళ్లి బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని సంచీలో పెట్టుకుని హాస్టల్‌కు వస్తున్న దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. తర్వాత హస్టల్‌లో గదికి చేరుకున్న మానస తానుండే అంతస్థులో చుట్టుపక్కల ఎవరు లేని సమయంలో తన గదికి లోపల గడియపెట్టుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. కాలిన వాసన, పొగ వస్తుండటంతో కింది అంతస్థులో ఉన్న పల్లవి అనే విద్యార్థిని పై అంతస్థుకు వెళ్లి చూడగా మానస గది నుంచి పొగ వస్తుండటంతో భయంతో కిందికి పరుగుతీసింది. హాస్టల్ యాజమాన్యంతోపాటు సమీపంలోని షాపుల యజమానులు మానస ఉంటున్న గదివద్దకు వెళ్లి తలుపులు తోసుకుని లోపలకు వెళ్లి తగలబడుతున్న దుప్పట్లు, పరుపుపై నీళ్లుపోసి మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే ఆ మంటల్లోనే మానస మృతిచెందిన విషయాన్ని గుర్తించి ఖానాపురంహవేలి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసుల విచారణ
సంఘటనాస్థలం వద్దకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించగా.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని.. సోమవారం ఉదయం 8గంటల సమయంలో పోస్టమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
అందరితో కలివిడిగా ఉండే మానస ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని ఆమె పిన్ని ప్రణిత, కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై మానస పిన్ని ప్రణతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపురంహవేలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. సోమవారం మానస చదువుతున్న కళాశాల, హాస్టల్ వద్ద విచారించగా తోటి విద్యార్థులు, స్నేహితులు ఎలాంటి అనుమానాలు వ్యక్తంచేయలేదు. కానీ హాస్టల్ మారిన 15రోజులల్లోనే మానస ఆత్మహత్య చేసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మానస ఉంటున్న హాస్టల్ గది ముందు ఉన్న కిటికీలో ఓ డైరీ, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కింద కేసు నమోదుచేశామని ఖానాపురం హవేలీ సీఐ టి.శ్రీహరి తెలిపారు. మానస విషయమై తోటి విద్యార్థులు, స్నేహితులు, బంధువులు నుంచి కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదని స్పష్టం చేశారు. చిన్నతనంలోనే తల్లి, ఆ తర్వాత తండ్రి చనిపోవడం లేదంటే సబ్జెక్టుల్లో ఫెయిలైతే పరువుపోతుందన్న మనోవేదనలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తున్నా.. తాము మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
